RCB beat GG, WPL 2026 : స్మృతి సేన దూకుడు.. హ్యాట్రిక్ విజయాలు నమోదు.. అదరగొట్టిన రాధ యాదవ్, శ్రేయాంక

RCB beat GG, WPL 2026 : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL 2026)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో 32 పరుగుల తేడాతో ఆర్సీబీ జట్టు విజయం సాధించింది.

RCB beat GG, WPL 2026 : స్మృతి సేన దూకుడు.. హ్యాట్రిక్ విజయాలు నమోదు.. అదరగొట్టిన రాధ యాదవ్, శ్రేయాంక

RCB vs GG WPL 2026

Updated On : January 17, 2026 / 7:42 AM IST
  • డబ్ల్యూపీఎల్-2026లో ఆర్సీబీ హ్యాట్రిక్ విజయం
  • గుజరాత్‌పై 32పరుగుల తేడాతో స్మృతి సేన గెలుపు
  • ఐదు వికెట్లతో ఆర్సీబీ విజయంలో శ్రేయాంక కీలక భూమిక

RCB beat GG, WPL 2026 : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL 2026) తొమ్మిదవ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ జెయింట్స్ జట్ల మధ్య శుక్రవారం రాత్రి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధించింది. గుజరాత్ జెయింట్స్ ను 32 పరుగుల తేడాతో ఓడించింది. స్మృతి మంధాన నేతృత్వంలోని ఆర్సీబీ జట్టు వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. ఆర్సీబీ తరపున స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ ఐదు వికెట్లు పడగొట్టింది.


ఆర్సీబీ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు గ్రేస్ హారిస్ (17), స్మృతి మంధాన (5) తక్కువ పరుగులకే ఔట్ అయ్యారు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన బ్యాటర్లు కూడా పరుగులు రాబట్టడంలో విఫలమయ్యారు. మిడిల్ ఆర్డర్ లో రాధా యాదవ్ (47 బంతుల్లో 66 పరుగులు) అద్భుత బ్యాటింగ్‌తో జట్టు భారీ స్కోర్ సాధించేలా చేసింది. మరోవైపు.. రిచా ఘోష్ (28బంతుల్లో 44 పరుగులు) రాణించింది. దీంతో ఆర్సీబీ జట్టు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 182 పరుగులు చేసింది.


183 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ జెయింట్స్ 18.5ఓవర్లలో 150 పరుగులకే ఆలౌట్ అయింది. గుజరాత్ జట్టులో భార్తీ పుల్మాలి (20బంతుల్లో 39 పరుగులు) టాప్ స్కోరర్ గా నిలిచింది. ఆర్సీబీ బౌలర్లలో శ్రేయాంక ఐదు వికెట్లు, లారెన్ బెల్ మూడు వికెట్లు పడగొట్టారు. దీంతో గుజరాత్ జెయింట్స్ బ్యాటర్లు వెంటవెంటనే వికెట్లు కోల్పోయి లక్ష్య ఛేదనలో విఫలమయ్యారు.


ఈ డబ్ల్యూపీఎల్ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుసగా మూడో విజయం సాధించింది. టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టుపై మూడు వికెట్లు తేడాతో విజయం సాధించగా.. ఉత్తరప్రదేశ్ వారియర్స్ ను తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించింది. తాజాగా జరిగిన మ్యాచ్ లో గుజరాత్ జట్టును 32 పరుగుల తేడాతో ఆర్సీబీ జట్టు ఓడించింది. దీంతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆర్సీబీ జట్టు అగ్రస్థానంలో నిలిచింది.