ఆపిల్ మడతపెట్టే ఐప్యాడ్ ఇప్పట్లో రానట్టే.. మరీ ఇంత ఆలస్యమా? కారణం తెలిస్తే షాక్..

ఇంత పెద్ద మడతపెట్టే స్క్రీన్‌ను అభివృద్ధి చేయడం చాలా క్లిష్టమైన, ఖరీదైన ప్రక్రియ.

ఆపిల్ మడతపెట్టే ఐప్యాడ్ ఇప్పట్లో రానట్టే.. మరీ ఇంత ఆలస్యమా? కారణం తెలిస్తే షాక్..

Updated On : October 22, 2025 / 12:55 PM IST

Apple 18-Inch Foldable iPad: ఆపిల్‌ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఫోల్డబుల్ ఐప్యాడ్ ఇప్పట్లో విడుదలయ్యే అవకాశాలు కనపడడం లేదు. 2029 లేదా ఆ తర్వాతకు వాయిదా పడవచ్చని బ్లూమ్‌బెర్గ్ రిపోర్టు ద్వారా తెలిసింది.

ఈ డివైజ్ అభివృద్ధిలో యాపిల్ ఇంజనీర్లు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటున్నారు. సుమారు $3,000 ధర అంచనా వేస్తున్న ఈ ఐప్యాడ్‌ బరువు, ఫీచర్లు, డిస్‌ప్లే సాంకేతికత విషయంలో ఇబ్బందులు ఉన్నట్లు తెలుస్తోంది.

18 అంగుళాల డిస్‌ప్లేతో మడతపెట్టే ఐప్యాడ్

ఆపిల్ శామ్‌సంగ్ డిస్‌ప్లేతో కలిసి అభివృద్ధి చేస్తున్న ఈ మడతపెట్టే ఐప్యాడ్‌కు ఏకంగా 18-అంగుళాల డిస్‌ప్లే ఉండనుంది. మడతపెట్టే స్క్రీన్‌లపై సాధారణంగా కనిపించే మడతలను తగ్గించే విధంగా దీన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ డివైజ్‌ను మూసినప్పుడు మ్యాక్ ల్యాప్‌టాప్‌లా, తెరిచినప్పుడు 13-అంగుళాల ల్యాప్‌టాప్ పరిమాణంలో ఉండనుంది. ఇంత పెద్ద మడతపెట్టే స్క్రీన్‌ను అభివృద్ధి చేయడం చాలా క్లిష్టమైన, ఖరీదైన ప్రక్రియ.

Also Read: అమెజాన్‌లో ఐఫోన్ 16పై కేక పెట్టించే ఆఫర్.. పండుగ ముగిసినా భారీ డిస్కౌంట్ల జోరు

భవిష్యత్ ప్రణాళికలు.. కొత్త ఆవిష్కరణలు..

ఆపిల్ మడతపెట్టే ఐప్యాడ్‌ను మార్కెట్‌లోకి సరికొత్త ఉత్పత్తులను తీసుకురావాలన్న తన విస్తృత ప్రణాళికలో భాగంగా అభివృద్ధి చేస్తోంది. ఇటీవల, యాపిల్ స్లిమ్ మోడల్ ఐఫోన్ ఎయిర్‌ను భారతదేశంలో రూ.1,19,900కి విడుదల చేసింది. అంతేకాకుండా, స్మార్ట్ గ్లాసెస్, టేబుల్‌పై పనిచేసే రోబో వంటి విభిన్న ఉత్పత్తులను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మడతపెట్టే ఐప్యాడ్ సాధారణ ఐప్యాడ్‌కు చేసే చిన్న మార్పుల కంటే ఎక్కువ ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.

 మడతపెట్టే ఐప్యాడ్ అసలు వస్తుందా?

గతంలో ఆపిల్ కొన్ని ప్రాజెక్టులను రద్దు చేసింది. ఆటోనమస్ కార్ ప్రాజెక్ట్, తక్కువ ధరతో తీసుకురావాలనుకున్న విజన్ ప్రో హెడ్‌సెట్ వేరియంట్ వంటివి ఈ కోవలోకే వస్తాయి. మరి మడతపెట్టే ఐప్యాడ్ నిజంగా మార్కెట్‌లోకి వస్తుందా? లేదా? అనేది కాలమే నిర్ణయించాలి.