మీరు తరచుగా ఫేస్‌బుక్‌లో ఫోటోలు అప్‌లోడ్ చేస్తుంటారా? మీ ఫ్యామిలీ, పిల్లలకు సంబంధించిన పిక్స్.. ఎక్కువగా పోస్ట్ చేస్తారా.? ఐతే.. మీ అందరికీ ఇదో హెచ్చరిక. మీరు ఇక్కడ అప్‌లోడ్ చేసే పర్సనల్ ఫోటోలు.. ఇంకెక్కడో సైబర్ కేటుగాళ్లు డౌన్‌లోడ్ చేసే ప్రమాదముంది. వాళ్లకు గనక మీ ఫోటోలు దొరికితే అంతే సంగతులు. ఏం చేస్తారో మీరే చూడండి.
ఫేస్‌బుక్..కొందరికి టైంపాస్. ఇంకొందరికి..అడిక్షన్. టైంపాస్‌కు వాడితే ప్రాబ్లమ్ లేదు. కానీ..దానికి అడిక్ట్ అయితేనే..కొత్త చిక్కులొచ్చి..చుక్కలు కనిపిస్తాయి. ఈ మధ్య జనాలు ఇంట్లో కంటే..ఫేస్‌బుక్‌లోనే ఎక్కువగా ఉంటున్నారు. కొందరు యూజర్లైతే..వరుసగా ఫోటోలు అప్‌లోడ్ చేస్తూ..ఫేస్‌బుక్‌పై దండయాత్ర చేస్తుంటారు.
ఇంకొందరు.. ఫోటోలు పోస్ట్ చేయడాన్ని ఉద్యమంలా ఫీలవుతుంటారు. గంట గంటకు..ఓపెన్ చేస్తూ తాము అప్‌లోడ్ చేసిన ఫోటోలకు ఎన్ని లైక్స్ వచ్చాయి..ఎవరేం కామెంట్లు పెట్టారనే దానిపై తెగ ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. మరికొందరు అవతలి నుంచి ఎవరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినా ఏ మాత్రం ఆలోచించకుండా యాక్సెప్ట్ చేసేస్తుంటారు. ఎవరు..ఏమిటి..అని తెలుసు కుకోకుండానే చాటింగ్‌లు చేస్తుంటారు. ఇలాంటి వాళ్లకే.. సైబర్ కేటుగాళ్ల నుంచి కొత్త చిక్కులు వస్తున్నాయి. ఒక్కసారి వారికి చిక్కారో..ఇక చుక్కలు చూపిస్తారు.
తాజాగా…సైబర్ కేటుగాళ్లు…ఫేస్‌బుక్ వేదికగా సరికొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. ఫేస్‌బుక్.. ట్విట్టర్…ఇలా వివిధ సామాజిక ఖాతాల్లో చురుగ్గా ఉంటూ ముఖ్యంగా ప్రజలు, అభిమానులకు దగ్గరగా ఉంటున్న వీఐపీలు, సెలబ్రిటీల పేర్లను వాడేస్తున్నారు.
వారి ఖాతాల్లోని ఫొటోలు, వారు వాడే భాషను అనుకరిస్తూ ఏకంగా వారి ఫేస్‌బుక్ ఖాతాలకు నకిలీవి సృష్టిస్తున్నారు. ఆ నకిలీ ఖాతా ద్వారా వారి అభిమానులు, కార్యకర్తలకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తున్నారు. అంతా పెద్దోళ్ల దగ్గరి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ రావడంతో మరేమీ ఆలోచించకుండానే యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇదే సైబర్ నేరగాళ్లకు వరమవుతోంది. ఇందుకు ఎంపీ సంతోష్ పేరుతో ఓ మైనర్ బాలుడు మోసానికి పాల్పడిన ఘటనే నిదర్శనం.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ బాలుడు ఎంపీ సంతోష్ కుమార్ జోగినిపల్లి పేరుతో నకిలీ ఫేస్‌బుక్ ఖాతా సృష్టించి హైదరాబాద్‌లో ఉంటున్న బాధితుడికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. ఇది నిజమని భావించి యాక్సెప్ట్ చేసిన బాధితుడితో నిజంగా జోగినిపల్లి సంతోష్ అనుకునేలా చాటింగ్ చేశాడు. చివరకు బాధితుడి నమ్మాడని తెలిశాక మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోని ఓ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న తన స్నేహితుడి కుమార్తెకు డబ్బులు అవసరమంటూ రెండు గూగుల్ పే నంబర్ల పంపాడు. ఇది నిజమని బాధితుడు కొంత డబ్బును సదరు నంబర్లకు బదిలీ చేశాడు. తీరా ఇది మోసమని తెలిసి సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఉత్తరప్రదేశ్‌లో ఆ బాలుడ్ని పట్టుకున్నారు.
ఇక…ఈ ఫేస్‌బుక్ మాయలో అనేక మంది ఆడవాళ్ల జీవితాలు నాశన మయ్యాయి. ఫేస్‌బుక్ పరిచయాలతో ఎన్నో కాపురాలు కూలిపోయాయి. ఎంతో మంది ప్రాణాలు సైతం కోల్పోయారు. అవతలి వ్యక్తుల గురించి తెలుసు కోకుండానే…చాలా మంది ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేసేస్తుంటారు. ఆ తర్వాత చాటింగ్‌లు…కొద్ది రోజులకు ఫోన్లు మాట్లాడుకోవడం…ఆ తర్వాత ప్రేమించుకోవడం… చివరకు వాడుకుని వదిలేయడమో.. లేదా చంపేయడమో… ఇలాంటి ఘటనలు లెక్కలేనన్ని చోటు చేసుకున్నాయి. ఇప్పటికీ ఎక్కడో ఓ చోట వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇటు…అమ్మాయిల ఫొటోలతో ఫేక్ ఐడీలు సృష్టించి మగవాళ్లను బురిడీ కొట్టించిన ఘటనలు కూడా చాలానే ఉన్నాయి.
మరికొందరు…ఫేస్‌బుక్‌లో ఫొటోలు ఆప్‌లోడ్ చేయడం…వాటికొచ్చే లైక్‌లు, కామెంట్‌లను చూసి మురిసిపోతుంటారు. ఇలా చేయడం కూడా కేటుగాళ్లకు ప్లస్ పాయింట్‌గా మారుతోంది. అయినా…ఫేస్‌బుక్ ఉన్నదే.. ఫోటోలు అప్‌లోడ్ చేసుకోవటానికి.. హ్యాపీ మూమెంట్స్‌ని షేర్ చేసుకోవటానికి…అలాంటిది ఫోటోలు అప్‌లోడ్ చేయొద్దంటే..ఇక ఎఫ్బీ ఎందుకు వాడటమనే కదా మీ డౌట్. అక్కడికే వస్తున్నాం..
సమస్య మన వరకు రానంత వరకు అంతా బానే ఉంటుంది. మన దాకా వస్తే గానీ తెలియదు. దాని ఎఫెక్ట్ ఏంటో. మనం చేసే చిన్న చిన్న తప్పులనే.. కేటుగాళ్లు క్యాష్ చేసుకుంటూ ఉంటారు. అందుకే ఫేస్‌బుక్‌లో ఎక్కువగా ఫొటోలు అప్‌లోడ్ చేయొద్దని సూచిస్తున్నారు పోలీసులు. ఒకవేళ.. అప్‌లోడ్ చేయాలనుకుంటే.. పర్సనల్ సెట్టింగ్ ఉండేలా.. చూసుకోవాలంటున్నారు. మరోవైపు ఏదైనా సమస్య వచ్చాక బాధపడటం కంటే.. ముందే అది రాకుండా జాగ్రత్తపడటం మేలంటున్నారు సైబర్ నిపుణులు.
ఇక…వీవీఐపీ, వీఐపీ, సినీ ప్రముఖుల పేర్లతో ఫేస్‌బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు వస్తే నమ్మవద్దని సూచిస్తున్నారు. సరిగ్గా తనిఖీ చేసుకున్నాకే ముందుకెళ్లాలని…. డబ్బులు అవరమని చాట్ చేస్తే మాత్రం సదరు వ్యక్తికి ఫోన్ కాల్ చేసి నిజమా, కాదా అన్నది నిర్ధారించుకోవాలని అంటున్నారు. పిల్లలు, వృద్ధులకు వైద్య చికిత్సలకు డబ్బులు అవసరం ఉన్నాయని గుర్తు తెలియని వ్యక్తులు డబ్బులు అడిగితే ట్రాన్స్‌ఫర్ చేయవద్దని చెబుతున్నారు. వీవీఐపీ, వీఐపీ, సినిమా తారలు, సెలబ్రిటీలు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫేస్‌బుక్, వాట్సాప్ ద్వారా డబ్బులు అడగరని…అలా ఎవరైనా అడిగితే తమకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఒక్క.. ఫేస్‌బుక్ మాత్రమే కాదు.. మిగతా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌లోనూ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి కాస్త అలర్ట్‌గా ఉంటే మంచిది.