Social Media AI Rules : ఫిబ్రవరి 20 నుంచి కొత్త రూల్స్.. AI, డీప్‌ఫేక్ కంటెంట్‌పై లేబులింగ్ మస్ట్.. 3 గంటల్లోపు డిలీట్ చేయాలి!
Social Media AI Rules : ఫిబ్రవరి 20 నుంచి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు నోటిఫికేషన్ వచ్చిన 3 గంటల్లోపు ఏఐ జనరేటెడ్ డీప్‌ఫేక్‌లతో సహా డేంజరస్ కంటెంట్‌ను డిలీట్ చేయాలి. గతంలో 36 గంటల సమయం ఉండేది.
Social Media AI Rules ( Image Credit to Original Source )
- ఏఐ కంటెంట్‌పై సోషల్ యాప్స్‌కు బిగ్ వార్నింగ్
- ఫిబ్రవరి 20 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి
- 36 గంటలు కాదు.. ఇకపై 3 గంటల్లోపే ఫేక్ కంటెంట్ డిలీట్
- ఏఐ-జనరేటెడ్ కంటెంట్ లేబులింగ్ మస్ట్
Social Media AI Rules : సోషల్ మీడియాలో ఏఐ ఫొటోలు, వీడియోలు క్రియేట్ చేస్తున్నారా? ఫిబ్రవరి 20 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. గత కొన్ని ఏళ్లుగా భారత్‌లో డీప్ ఫేక్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి.
రోజురోజుకీ ఈ డీప్ ఫేక్ బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా సెలబ్రిటీలు డీప్ ఫేక్ బారిన పడుతున్న పరిస్థితి. ఏఐ జనరేటెడ్ ఫొటోలు, వీడియోలతో ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక ఫేక్ వీడియో క్లిప్ నిమిషాల్లో వైరల్ అయిపోతుంది.
ఫేక్ కంటెంట్ తొలగింపు ఆలస్యం :
చాలామంది సోషల్ మీడియా యూజర్లు అది నిజమే అనుకుని షేర్లు చేస్తుంటారు. బాధితుల దృష్టికి వచ్చినా ఆ ఫేక్ వీడియోను డిలీట్ చేయడం సాధ్యపడదు. అయితే, ఇలాంటి ఫేక్ వీడియోలను గుర్తించి డిలీట్ చేసే సమయానికి జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఇలాంటి ఫేక్ కంటెంట్ డిలీట్ చేసేందుకు సోషల్ ప్లాట్‌ఫారమ్‌లు, అధికారులు గంటల సమయం లేదా కొన్నిసార్లు రోజులు పడుతుంది.
వాస్తవానికి, ఇంటర్నెట్లో ఏదైనా ఒక ఫేక్ కంటెంట్ వైరల్ అయ్యాక పూర్తిగా డిలీట్ చేయడం చాలా కష్టం. అందుకే సోషల్ మీడియా యాప్స్‌లో జనరేట్ చేసే ఫేక్ ఏఐ వీడియోలపై కఠినమైన నిబంధనలను అమల్లోకి తీసుకువస్తోంది కేంద్రం. ఫిబ్రవరి 20 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయి.
ఏఐ కంటెంట్‌పై సోషల్ యాప్స్‌కు ప్రభుత్వం అలర్ట్ :
ఏఐ కంటెంట్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు X, Instagram, Facebook, Threads, WhatsApp, Telegram, YouTube సహా ఇతర సోషల్ మీడియా కంపెనీలను హెచ్చరిస్తోంది. గతంలో, ఈ ప్లాట్‌ఫారమ్‌లు చట్టవిరుద్ధమైన కంటెంట్ డిలీట్ చేసేందుకు 36 గంటల వరకు సమయం పట్టేది. ఇకపై అలా కాదు.. ఎలాంటి ఫేక్ వీడియో లేదా ఫొటో వైరల్ అయినా మూడు గంటల్లోపు అలాంటి కంటెంట్‌ను డిలీట్ చేయాల్సి ఉంటుంది.
ఇందులో కొన్ని రకాల ఏఐ జనరేటెడ్ కంటెంట్, డీప్‌ఫేక్‌లు పోస్ట్‌లు ఉన్నాయి. ఇప్పటినుంచి హానికరమైన కంటెంట్, ముఖ్యంగా ఏఐ దుర్వినియోగంపై ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేస్తోంది. డీప్ ఫేక్ కంటెంట్ వ్యాప్తికి అడ్డుకట్ట పడనుంది.
గేమింగ్ క్రియేటర్లు, ఇన్ ఫ్లూయెన్సర్లు, ప్రముఖులు, రాజకీయ నేతలు, వ్యాపార దిగ్గజాలు, సినీనటులు, సింగర్స్ ఎక్కువగా ఈ డీప్ ఫేక్ బారినపడ్డారు. కొన్ని ఫేక్ వీడియోలతో స్కామ్‌లు చేస్తూ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తాయి.
ఫిబ్రవరి 20 నుంచి ప్లాట్‌ఫామ్‌లు చాలా వేగంగా పనిచేయాల్సి ఉంటుంది. హానికరమైన పోస్ట్‌లను త్వరగా గుర్తించి డిలీట్ చేసేందుకు కొత్త వ్యవస్థలు అవసరం. ఆటోమేటెడ్ టూల్స్, ఏఐ కంట్రోలింగ్ టూల్స్ ఎక్కువగా అవసరం. కొన్ని సందర్భాల్లో ఆయా పోస్టులను ముందుగా డిలీట్ చేసి ఆ తర్వాత ఫాక్ట్ చెకింగ్ చేస్తారు.
లేబులింగ్ తప్పనిసరి :
కొత్త రూల్స్ ప్రకారం.. సోషల్ మీడియా కంపెనీలు ఏఐ-జనరేటెడ్ కంటెంట్‌ను పోస్టు చేసే సమయంలో లేదా వెంటనే డిటెక్ట్ చేసేలా టూల్స్ రన్ చేయాలి. ఇలాంటి ఫేక్ ఏఐ కంటెంట్ స్పష్టంగా లేబుల్ చేయాలి. డిజిటల్ ఐడెంటిటీ అనేది మెటాడేటాతో పాటు ఉండాలి.
కేంద్ర ప్రభుత్వం కొన్ని రకాల కంటెంట్‌పై కూడా ప్రత్యేక ఆంక్షలు విధించింది. పిల్లల లైంగిక వేధింపులు, అనుమతి లేని ప్రైవేట్ ఫోటోలు లేదా వీడియోలు, ఫేక్ డాక్యుమెంట్లు, ఆయుధాలు లేదా హింస, వ్యక్తులు లేదా సంఘటనల డీప్‌ఫేక్ వీడియోలను జనరేట్ చేసే కంటెంట్‌ను ప్లాట్‌ఫారమ్‌లు వెంటనే బ్లాక్ చేయాలి లేదా డిలీట్ చేయాలి. ఈ విషయంలో సోషల్ మీడియా యాప్స్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆయా కంపెనీలపై ప్రభుత్వం లీగల్ యాక్షన్ తీసుకునే వీలుంటుంది.
యూజర్ డిక్లరేషన్ :
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు తమ కంటెంట్ ఏఐ క్రియేట్ లేదా ఎడిట్ చేశారంటూ అప్లోడ్ చేసే సమయంలోనే యూజర్ డిక్లరేషన్ పొందాలి. యూజర్ డిక్లరేషన్లను వెరిఫై చేసేందుకు కొత్త టూల్స్‌ను కూడా రన్ చేయాలి.
కంటెంట్ మోడరేషన్ టైమ్ :
గతంలో, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు అభ్యంతరకరమైన కంటెంట్‌ను డిలీట్ చేసేందుకు 36 గంటల సమయం ఉండేది. కానీ, ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఈ సమయం తగ్గించింది. ఈ ప్లాట్‌ఫామ్‌లు ఇప్పుడు చట్టపరమైన ఉత్తర్వు లేదా యూజర్లు ఫిర్యాదు వచ్చిన 3 గంటలలోపు అభ్యంతరకరమైన కంటెంట్‌ను డిలీట్ చేయాల్సి ఉంటుంది.
కొత్త నిబంధనల ప్రకారం.. ఏఐతో రూపొందించిన కంటెంట్‌ను చట్టవిరుద్ధ కార్యకలాపాలకు వాడితే దాన్ని ఇతర చట్టవిరుద్ధమైన కంటెంట్ మాదిరిగానే పరిగణిస్తామని స్పష్టం చేస్తున్నాయి. ప్లాట్‌ఫారమ్‌లు తమ సేవలను ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఉపయోగించకుండా చూసుకోవాల్సి ఉంటుంది.
