UPI QR Payments
UPI QR Payments : యూపీఐ యూజర్లకు అలర్ట్.. గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం యూజర్లు ఇకపై ఈ తరహాలో యూపీఐ పేమెంట్స్ చేయలేరు. భారత్‌లో యూపీఐ పేమెంట్లను నిర్వహించే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), అంతర్జాతీయ UPI పేమెంట్ల విషయంలో కొత్త రూల్ అమల్లోకి తీసుకొచ్చింది.
ఏప్రిల్ 30 నుంచి అంతర్జాతీయ యూపీఐ యూజర్లు QR కోడ్ షేరింగ్ పే-ఆధారిత అంతర్జాతీయ యూపీఐ లావాదేవీలను అనుమతించదు. ఒక వ్యక్తి నుంచి మర్చంట్ లావాదేవీలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఏప్రిల్ 8న ఎన్పీసీఐ ఒక సర్క్యులర్ జారీ చేసింది.
దీని ప్రకారం.. “అన్ని యూపీఐ గ్లోబల్ P2M లావాదేవీలు, పేయర్ పేమెంట్ సర్వీసు ప్రొవైడర్ (PSP)కి QR షేర్ చేస్తే ఆ పేమెంట్ పనిచేయదు’’అని పేర్కొంది. దేశీయ QR షేర్, పేతో సహా ఇతర రకాల యూపీఐ లావాదేవీ పరిమితులలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. కేవలం అంతర్జాతీయ యూపీఐ పేమెంట్ల విషయంలో మాత్రమే ఈ తరహా పేమెంట్లను అనుమతించదు.
మరో మాటలో చెప్పాలంటే.. మీరు వేరే దేశంలో ఉన్న షాపు లేదా మర్చంట్ నుంచి ఏదైనా కొనుగోలు చేస్తే.. మీరు పేమెంట్ చేసేందుకు QR కోడ్‌ను అందిస్తారు. మీరు ఈ కోడ్‌ను మీ ఫోన్ ఫోటో గ్యాలరీలో సేవ్ చేస్తారు. పేమెంట్ చేయడానికి మీరు ఆ సేవ్ చేసిన క్యూఆర్ కోడ్‌ను తర్వాత స్కాన్ చేసేందుకు ప్రయత్నిస్తే అది పనిచేయదు.
అయితే, మీరు అక్కడ ఉన్నప్పుడు షాపులో స్వయంగా క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేయవచ్చు. ప్రస్తుతం, ఎన్పీసీఐ వెబ్‌సైట్ ప్రకారం.. ఫ్రాన్స్, మారిషస్, నేపాల్, సింగపూర్, శ్రీలంక, యూఏఈ సహా దాదాపు 7 దేశాలు భారత యూపీఐ ఆధారిత భారత్ క్యూఆర్ పేమెంట్లను అంగీకరిస్తున్నాయి.
NPCI నిర్ణయం ఎందుకంటే? :
ఎన్పీసీఐ ఇటీవలి నిర్ణయానికి నిర్దిష్ట కారణాలను వెల్లడించలేదు. అయితే, పెరుగుతున్న మోసాలను అడ్డుకట్ట వేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. చాలా వరకు భారతీయ అమాయక యూజర్లను లక్ష్యంగా చేసుకుని ఇతర దేశాలలోని సైబర్ నేరగాళ్లు ఈ మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడుతున్నారని సమాచారం.
ఈ మోసాల నుంచి వినియోగదారులను రక్షించడానికి ఎన్పీసీఐ కఠిన నిర్ణయం తీసుకుంది. యూపీఐ షేరింగ్, పేమెంట్లలో క్యూఆర్ కోడ్‌లతో చేసే లావాదేవీలపై వెరిఫై చేయని ఆఫ్‌లైన్ మర్చంట్లకు చేసే చెల్లింపులపై రూ. 2వేలు పరిమితి విధించింది.