అవాక్కయ్యారా…..ఇల్లు కదులుతోంది

చిత్తూరు : ఆ ఇల్లు అంటే యజమానికి ఎంతో ఇష్టం. తనకి కలిసొచ్చిన ఇల్లు. ఇరవై ఏళ్ల నుంచి కంటికి రెప్పలా చూసుకుంటూ వస్తున్నాడు. కానీ రోడ్డు విస్తరణలో భాగంగా ఆ ఇంటిని కూల్చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఆ ఇంటి యజమాని అందరిలా కూల్చివేయకుండా వినూత్న ప్రయత్నం చేశాడు. ఒక్క ఇటుక కూడా పడగొట్టకుండా ఇంటిని పక్కకు తరలిస్తున్నాడు. ఇంటిని తరలించడమేంటా…అని ఆశ్చర్యపోతున్నారా…? అది ఎలానో మీరే చూడండి.
ఇదిగో ఇక్కడ ఈ రెండంతస్తుల భవనాన్ని చూడండి. ఒక్క ఇటుక కూడా పడగొట్టకుండా…ఇంటికి ఎలాంటి ప్రమాదం లేకుండా…ఒక చోటు నుంచి మరో చోటుకు ఎలా తరలిస్తున్నారో చిత్తూరు నగర శివారులోని తిరుపతి – చిత్తూరు జాతీయ రహదారికి ఆనుకొని ఈ భవనం ఉంది. దీని యజమాని రామ్మూర్తి రెడ్డి. ఇరవై ఏళ్ల క్రితం ఆయన ఈ ఇంటిని నిర్మించారు. ఈ ఇల్లు అంటే ఆయనకు ఎంతో సెంటిమెంట్. ఆ ఇల్లు నిర్మించాక వ్యాపార పరంగా తనకు అన్నీ కలిసి వచ్చాయని ఆయన భావన. అలాంటి ఆయనకు కలలో కూడా ఊహించని సమస్య వచ్చి పడింది.
జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ఆయన ఇంటి ముందు నుంచి ఓ కొత్త రోడ్డు మంజూరైంది. రోడ్డు విస్తరణలో భాగంగా తప్పనిసరిగా ఇల్లు కూల్చివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తనకు అన్ని విధాలా కలిసి వచ్చిన ఆఇంటిని కూల్చివేయడం ఇష్టం లేక, ఆవేదనకు గురయ్యాడు. అందరిలా ఇంటిని కూల్చివేసి వేరొక చోట నిర్మించుకోకుండా మొత్తం బిల్డింగ్‌ను యధాతథంగా పక్కనే ఉన్న ఖాళీ స్థలంలోకి తరలిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేశాడు.
అనుకున్నదే తడవుగా అన్వేషణ ప్రారంభించాడు. తనకు కలిసొచ్చిన ఇంటిని వదులుకోలేక….ఏం చేయాలా అని ఆలోచించి మార్గం వెతకటం మొదలెట్టాడు. చెన్నైలోని కొన్ని కంపెనీలు బిల్డింగ్‌ను ఉన్నది ఉన్నట్లుగా తరలించే పనులు చేపడుతున్నాయని తెలుసుకుని వారిని ఆశ్రయించాడు. బాబు హౌస్ లిఫ్టింగ్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో కంపెనీ ప్రతినిధులు రంగంలో దిగారు. మొదట ఆ బిల్డింగ్ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో పిల్లర్లు వేసి బేస్‌మెంట్‌తో సిద్ధం చేశారు. ఆ తర్వాత ఇంటిని జర్మన్ టెక్నాలజీతో ఇదిగో ఇలా యధాతథంగా పైకి లేపారు.
సుమారు 80 టన్నుల బరువున్న ఇంటిని పైకి లేపేందుకు రెండు వందలకు పైగా జాకీలను ఉపయోగించారు. ఎక్కడ ఎలాంటి పగుళ్లు రాకుండా అత్యంత జాగ్రత్తగా మూడు అడుగుల మేర ఇంటిని పైకి లేపారు. ఇక ఇప్పుడు ఆ భవనాన్ని బేస్‌మెంట్‌తో సిద్ధంగా ఉన్న ఖాళీ స్థలం పైకి తరలించాలి. ఇందుకోసం ఇంటి నుంచి ఖాళీ స్థలం వరకు రైల్వే ట్రాక్ తరహాలో సిమెంట్ ఇటుకలతో ఓ రహదారి నిర్మించి అత్యంత చాకచక్యంగా భవనాన్ని జరుపుతున్నారు. రోజుకు ఆరు అడుగుల చొప్పున నెమ్మదిగా భవనాన్ని తరలిస్తున్నారు.
ఈ మొత్తం కాంట్రాక్ట్ ఖరీదు 15 లక్షలు కాగా 90 రోజుల్లో పూర్తి చేసే విధంగా ఆ ఇంటి యజమాని ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇప్పటికి రెండు నెలల పనులు పూర్తి చేశామని.మరో నెల రోజుల్లోనే ఇంటిని తరలిస్తామని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. అయితే ఇలా తరలించేటప్పుడు ఇంటికి ఎలాంటి ప్రమాదం జరిగినా ఆ కంపెనీదే బాధ్యత. అలా ఆ ఇంటి యజమాని ఒప్పందం కుదుర్చుకున్నారు. కాస్తా ఖర్చుతో కూడుకున్న పనే అయినా…ఈ ఆలోచన అదుర్స్ కాదా… మీకూ ఇలాంటి సమస్యే ఎదురైతే…మీ ఇంటిని కూడా తరలించేందుకు సిద్ధమవ్వండి.