నాసా సక్సెస్.. మార్స్ గుట్టు వీడినట్టేనా? అంగారకుడిపై జీవం ఉందా..?

నాసా సక్సెస్.. మార్స్ గుట్టు వీడినట్టేనా? అంగారకుడిపై జీవం ఉందా..?

Updated On : February 19, 2021 / 8:07 PM IST

NASA Rover landing safe on Mars: అమెరికాకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ సంస్థ నాసా మరో అద్భుతం చేసింది. అరుణ గ్రహంపై రోవర్‌ని సక్సెస్‌ఫుల్‌గా ల్యాండ్ చేసింది. అంగారకుడిపై జీవపు ఆనవాళ్లను తెలుసుకునేందుకు మార్స్ రోవర్‌ పర్సెవరెన్స్ పంపింది. రోవర్ మార్స్ పై విజయవంతంగా దిగింది. మార్స్ గ్రహానికి సంబంధించిన రెండు ఫొటోలను కూడా పంపింది. ఆరు చక్రాలున్న రోవర్.. రెండేళ్లు అంగారకుడి మీదే ఉండి పరిశోధనలు కొనసాగించనుంది. జీవం ఉందా లేదా తెలుసుకునేందుకు అంగారకుడిపై ఉన్న రాళ్లు, ఉపరితలాన్ని తొలిచి లభించిన మట్టిని విశ్లేషించనుంది. ఇప్పటికే రోవర్ పంపిన రెండు ఫొటోల్లో రోవర్‌కు వెనక ముందు ఎలాంటి ఎత్తు పల్లాలు లేకుండా సమాంతరంగా ఉన్నట్లు తేలింది. 7 నెలల క్రితం ప్రయోగించిన రోవర్… ల్యాండింగ్ విషయంలో చివరి 7 నిమిషాలు కీలకంగా మారాయి.

అంగారక వాతావరణంలోకి అడుగుపెట్టిన తర్వాత.. అంతరిక్ష నౌక నుంచి మార్స్ రోవర్ విడిపోయింది. గంటకు 20వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ.. గ్రహంపై ల్యాండ్ అయ్యే వరకూ ప్రతి నిమిషమూ కీలకంగా కనిపించింది. సూపర్ సక్సెస్ కావడంతో.. శాస్త్రవేత్తలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంగారకుడిపై రోవర్ దిగిన ప్రదేశం పరిశోధనకు ఎంతో కీలకం మారనుంది. జెజెరో క్రేటర్ అనే ఏరియాలో రోవర్ ల్యాండ్ అయింది. క్రేటర్ అనేది ఒక పురాతనమైన సరస్సుగా చెబుతుంటారు. కొన్ని కోట్ల ఏళ్ల క్రితం అంగారక గ్రహం నీటితో నిండి ఉండేదని పరిశోధనల్లో తేలింది. నదులు, సరస్సులు నిండుగా ఉండేవి.

ఆ నీటిలో అనేక రకాల సూక్ష్మజీవులు ఉండే అవకాశం ఉంది. అందుకే వాటి ఆనవాళ్ల కోసం క్రేటర్ సరస్సు పరివాహక ప్రాంతంలో మార్స్ రోవర్‌ని ల్యాండ్ చేసింది నాసా. సూక్ష్మజీవుల శిలాజాలను గుర్తించడమే లక్ష్యంగా… ఓ రోబో అన్వేషణ సాగించనుంది. ఈ ప్రయోగానికి దాదాపు 17వేల 450 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. క్రేటర్ ప్రాంతంలో ప్రస్తుతం నీళ్లు లేవు. సరస్సు అడుగున శిలాజాలు ఉండే అవకాశాలు ఉన్నాయని.. వాటిని పరిశీలిస్తే అక్కడ జీవుల ఉనికి గురించి తెలియనుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. క్రేటర్ సరస్సు ప్రాంతంలో రోవర్‌లోని రోబో 40శాంపిల్స్‌ సేకరించి.. వాటిని ప్రత్యేక ట్యూబ్‌లలో నిల్వ చేయనుంది.

ఫ్యూచర్‌లో టెస్టుల కోసం భూమికి తీసుకురానున్నారు. అంగారకుడిపై ఉండే కొండలు, ఇసుక మేటలు, బండల్లో కూడా నాసా రోవర్ ల్యాండ్ అయి పని పూర్తిచేస్తుంది. క్రేటర్ సరస్సు మధ్య అడుగు భాగం నుంచి అంచుల వరకు రోవర్ ప్రయాణించనుంది. ఈ ప్రయాణంలోనే అక్కడక్కడా మట్టి, రాళ్ల శాంపిల్స్‌ను రోబో సేకరించనుంది. క్రేటర్ సరస్సు ప్రాంతం నివాసానికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. నాసా మిషన్‌లో అక్కడ సూక్ష్మజీవులు, ఏలియన్స్ ఆనవాళ్లు బయటపడవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.