మీది పాత సిమ్ కార్డా? కేంద్రం సంచలన నిర్ణయం? కోట్లల్లో పాత సిమ్ కార్డులన్నీ తీసేసి..
పాత సిమ్ కార్డులను మార్చడానికి ఫ్రేమ్‌వర్క్ రూపొందించడమే లక్ష్యంగా ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు.

దేశవ్యాప్తంగా ప్రజలు వాడుతున్న పాత సిమ్‌కార్డులను రీప్లేస్ చేయించాలన్న ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఆ పాత సిమ్ కార్డులలోని కొన్ని చిప్‌సెట్‌లు చైనాలో తయారయ్యాయని భారత్‌లోని ఓ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ దర్యాప్తులో తేలింది. దీంతో కేంద్ర సర్కారు ఈ అంశాన్ని పరిశీలిస్తోంది.
సిమ్ కార్డులపై ఈ దర్యాప్తును నేషనల్ సైబర్ సెక్యూరిటీ కోఆర్డినేటర్, భారత హోం మంత్రిత్వ శాఖ కలిసి చేశాయి. చైనాలో తయారైన ఈ చిప్‌సెట్లు మన దేశ భద్రతకు హాని కలిగిస్తాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రజలతో పాత సిమ్‌కార్డులను తీసేయించి, కొత్త సిమ్‌కార్డులను వాడేలా చేయడంలో ఉన్న సాధ్యాసాధ్యాలను కేంద్ర సర్కారు పరిశీలిస్తోంది.
నేషనల్ సైబర్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ (ఎన్‌సీఎస్‌సీ) టెలికమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ ప్రతినిధులతో పాటు రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వీఐ సహా ప్రధాన టెలికాం ఆపరేటర్ల అధికారులతో సమావేశాలను ఏర్పాటు చేసింది. టెలికాం రిసోర్సుల కొనుగోళ్ల ప్రక్రియలో ఉన్న లోతుపాటులను పరిష్కరించడం, పాత సిమ్ కార్డులను మార్చడానికి ఫ్రేమ్‌వర్క్ రూపొందించడమే లక్ష్యంగా ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు.
జాతీయ భద్రతా సమస్యల దృష్ట్యా హువావే, జెడ్‌టీఈ వంటి చైనా కంపెనీలపై ప్రభుత్వం ఇప్పటికే నిషేధాన్ని విధించింది. టెలికాంకు సంబంధించిన పరికరాలను దిగుమతి చేసుకోవడానికి, అమ్మడానికి, ఉపయోగించుకోవడానికి ముందు తప్పనిసరిగా ధ్రువీకరణ చేయించుకోవాలి.
టెలికాం కంపెనీలు సాధారణంగా సిమ్ కార్డులను స్వయంగా తయారు చేయవు. సిమ్ కార్డులను ప్రభుత్వం లేదా రెగ్యులేటర్‌తో ఆమోదం పొందిన, నమ్మదగినదిగా ఇతర సంస్థల నుంచి కొనుగోలు చేస్తాయి. ఆయా కంపెనీలకు వియత్నాం, తైవాన్ వంటి విశ్వసనీయ ప్రదేశాల నుంచి సిమ్ కార్డ్ చిప్స్ లభిస్తాయి.
ఆయా దేశాల కంపెనీలు సిమ్ కార్డులను ఒకచోట చేర్చి, వాటిని ప్యాక్ చేస్తాయి. మొబైల్ నెట్‌వర్క్ కంపెనీలకు పంపే ముందు ప్రతి సిమ్‌కార్డుకు భారత్‌లో ఒక ప్రత్యేకమైన నంబరును ఇస్తారు. ఇప్పుడు ఆయా దేశాల కంపెనీలపై భారత్ పెట్టుకున్న నమ్మకం సన్నగిల్లుతోంది. కొన్ని చిప్‌లు చైనా నుంచి తెప్పించుకుని మనకి పంపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.