ట్రంప్ 104% టారిఫ్‌పై చైనా ప్రతిస్పందన.. సుంకాలు ఎంతగా పెంచేసిందంటే? టారిఫ్‌లతో ఫుట్‌బాల్ ఆడుతున్నట్లు..
ఈ నిర్ణయం గురువారం నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.

చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వారం రోజుల వ్యవధిలో రెండోసారి పెంచిన అదనపు సుంకాలపై డ్రాగన్ కంట్రీ ప్రతిస్పందించింది. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే అన్ని ఉత్పత్తులపై 84 శాతం సుంకాలను విధిస్తున్నట్లు చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇవాళ ప్రకటించింది. ఈ నిర్ణయం గురువారం నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా ఉత్పత్తులపై రెండోసారి విధించిన 104 శాతం సుంకాలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో చైనా కూడా టారిఫ్‌ను పెంచేస్తూ ఇవాళే నిర్ణయం తీసుకుంది.
డొనాల్డ్ ట్రంప్ “104 శాతం సుంకాల విధింపు” ప్రకటన చేసిన తర్వాత దీనిపై చైనా స్పందిస్తూ.. అమెరికా చర్యను ‘అహంకార పూరిత, బెదిరింపు ప్రవర్తన’గా అభివర్ణించింది. దీనికి తాము కూడా గట్టిగా ప్రతిస్పందిస్తామని చెప్పింది. అన్నట్లే చేసింది.
ఇదీ టారిఫ్‌ల లెక్క..
మొదట ట్రంప్ చైనాపై అదనంగా 34 శాతం సుంకాలను విధించారు. దీంతో ఈ సుంకాల శాతం నిన్నటివరకు 54%గా ఉంది. ట్రంప్ చేసిన రెండో ప్రకటన వల్ల ఇప్పుడు చైనాపై అమెరికా సుంకాల శాతం 104కి పెరిగింది.
మొదట ట్రంప్ చైనాపై అదనంగా 34 శాతం సుంకాలను విధించిన తర్వాత.. యూఎస్‌పై డ్రాగన్ కంట్రీ కూడా అదనంగా 34 శాతం సుంకాలు విధించింది. ఆ నిర్ణయం కూడా ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి రావాల్సి ఉండగా, ఇప్పుడు చైనా ఆ అదనపు సుంకాలను 84 శాతానికి పెంచింది. ఈ మొత్తం కలిపి గురువారం నుంచి అమల్లోకి రానుంది.
ఎగుమతులు, దిగుమతులు ఇలా..
ప్రపంచంలో తొలి రెండు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలుగా అమెరికా, చైనా ఉన్నాయి. ఆ రెండు దేశాలు ఇలా తరుచూ అదనపు టారిఫ్‌లు విధించుకుంటూ పోతుండడంతో ఈ రెండు దేశాల మధ్య వాణిజ్యం నిలిచిపోతుందన్న ఆందోళనలు ఉన్నాయి. అమెరికా ట్రేడ్ రిప్రెజెంటేటివ్ ఆఫీస్ తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికా 2024లో చైనాకు 143.5 బిలియన్ డాలర్ల ఉత్పత్తులను ఎగుమతి చేసింది. అదే సమయంలో 438.9 బిలియన్ డాలర్ల ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది.
Also Read: RBI గుడ్ న్యూస్.. రెపోరేట్ కట్.. మీ EMI ఎంత తగ్గుతుంది?