RBI గుడ్ న్యూస్.. రెపోరేట్ కట్‌.. మీ EMI ఎంత తగ్గుతుంది?

అంటే 0.5 శాతం రేటు కోతతో సంవత్సరానికి మీకు రూ.21,000కు పైగా ఆదా అవుతుంది.

RBI గుడ్ న్యూస్.. రెపోరేట్ కట్‌.. మీ EMI ఎంత తగ్గుతుంది?

Updated On : April 9, 2025 / 5:06 PM IST

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) బుధవారం రెపో రేట్‌ను 25 బేసిస్‌ పాయింట్లు తగ్గించడంతో ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్లు (ఈఎంఐలు) తగ్గనున్నాయి. గృహ, ఆటో, పర్సనల్‌ లోన్స్‌లకు సంబంధించిన ఈఎంఐ తగ్గనుంది.

రెపో రేటు 6.25% నుంచి 6%కి తగ్గిన విషయం తెలిసిందే. భారత్‌లో కొవిడ్‌-19 మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఆర్‌బీఐ వడ్డీరేట్లను తగ్గించడం ఇది రెండోసారి. 2020 మే – 2022 ఏప్రిల్ మధ్య ఆర్‌బీఐ రెపో రేటును 4 శాతంగా కొనసాగించింది. 2022 ఏప్రిల్ నుంచి 2023 ఫిబ్రవరి వరకు ఆర్‌బీఐ క్రమంగా ఈ పాలసీ రేట్లను పెంచడంతో చివరికి ఇది 6.5 శాతానికి చేరింది.

అప్పటి నుంచి రెండేళ్ల వరకు ఈ రేట్లు 6.5 శాతంగా కొనసాగాయి. ఇప్పుడు కీలకమైన పాలసీ రేట్లను ఆర్‌బీఐ తగ్గించడంతో దాన్ని బ్యాంకులు అనుసరించే అవకాశాలు ఉన్నాయి.

హోంలోన్‌పై మీకు ఎంత సేవ్ అవుతుంది?
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నుంచి రూ.50 లక్షల గృహ రుణాన్ని 30 సంవత్సరాల కాల వ్యవధికి ఈఎంఐ ఆప్షన్‌తో తీసుకుంటే ఇప్పటివరకు వడ్డీరేటు 8.70గా ఉంది. దీంతో ఇప్పటివరకు ఈఎంఐగా నెలకు రూ.39,157 చెల్లించాల్సి వచ్చేది.

ఇప్పుడు వడ్డీ రేటు 25 బేసిస్ పాయింట్లకు (8.45 శాతానికి) తగ్గితే.. ఈఎంఐ రూ.38,269కి తగ్గుతుంది. దీంతో నెలకు రూ.888 సేవ్ అవుతుంది. వడ్డీ రేటు 50 బేసిస్ పెరిగి 8.20 శాతానికి తగ్గితే, ఈఎంఐ రూ.37,388కి తగ్గుతుంది.

దీంతో నెలకు మీరు కట్టాల్సిన ఈఎంఐ రూ.1,769 తగ్గుతుంది. అంటే 0.5 శాతం రేటు కోతతో సంవత్సరానికి మీకు రూ.21,000కు పైగా ఆదా అవుతుంది. 30 సంవత్సరాల పాటు ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది కాబట్టి భారీ మొత్తంలో మీ ఈఎంఐ తగ్గినట్లే.

పర్సనల్‌ లోన్‌పై మీకు ఎంత సేవ్ అవుతుంది?
ఆర్‌బీఐ రెపో రేట్‌ను 25 బేసిస్‌ పాయింట్లు తగ్గించడంతో మీపై పర్సనల్‌ లోన్‌ భారం కూడా బాగానే తగ్గుతుంది. మీరు ఐదేళ్ల కాల వ్యవధితో 12 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల పర్సనల్‌ లోన్‌ ఇప్పటికే తీసుకుంటే 0.25 శాతం రేటు కోతతో మీ ఈఎంఐ రూ.11,282 నుంచి రూ.11,149కు తగ్గుతుంది.

మీకు నెలకు రూ.133 ఆదా అవుతాయి కాబట్టి సంవత్సరానికి రూ.1,596 ఆదా అవుతుంది. ఇప్పటికే ఫ్లోటింగ్‌ ఇంటెరెస్ట్‌ రేట్లతో పర్సనల్‌లోన్‌ తీసుకున్న వారికే ఇది వర్తిస్తుంది. స్థిర వడ్డీ రేట్లు ఉన్నవారి ఈఎంఐలు తగ్గవు.