Paytm Launches Mini App Store : గూగుల్ తో తెగదెంపులు చేసుకొనేందుకు Paytm రెడీ అవుతోంది. ఇటీవలే గూగుల్ ప్లే స్టోర్ నుంచి పేటీఎం యాప్ ను తొలగించిన కొద్ది రోజులకు సొంతంగా ప్లాన్స్ రచిస్తోంది.
అందులో భాగంగా..ఓ యాప్ (App) ను ప్రారంభించడం ప్రాధాన్యత సంతరించుకుంది. తక్కువ ఖర్చుతో హెచ్‌టీఎంఎల్, జావా స్క్రిప్ట్ ఆధారంగా డెవలప్ చేసిన యాప్స్‌కి కూడా తమ ప్లేస్టోర్‌లో చోటు దక్కుతుందని పేటీఎం స్పష్టం చేసింది. మినీ యాప్ స్టోర్‌లో వినియోగదారులకు అనేక సేవలను ఉచితంగా అందించనుంది.
డెవలపర్లు తమకు ఇష్టమైతే పేటీఎం వాలెట్, పేమెంట్స్ బ్యాంక్, యూపీఐ, నెట్ బ్యాంకింగ్, కార్డ్ చెల్లింపు సేవలను తమ యాప్ ద్వారా ప్రమోట్ చేయవచ్చని పేటీఎం వెల్లడించింది. గూగుల్ ప్లేస్టోర్ బిల్లింగ్ సిస్టమ్ ద్వారా పేమెంట్ చేస్తే 30 శాతం కమిషన్ చెల్లించాల్సి ఉంటుంది.
కానీ తమ మినీ యాప్ స్టోర్ పేమెంట్ గేట్ ద్వారా యాప్స్ లిస్టింగ్, డిస్ట్రిబ్యూషన్ సేవలను చార్జీలు లేకుండా అందించనున్నట్టు పేటీఎం తెలిపింది. 1ఎంజీ, నెట్‌మెడ్స్, డిజిట్, డెకథ్లాన్ తదితర 300 సంస్థలు తమ ప్లే స్టోర్ కోసం యాప్స్ డెవలప్ చేశాయని పేటీఎం వెల్లడించింది.
దేశానికి చెందిన ప్రతి యాప్ డెవలపర్‌కి అవకాశం కల్పించడంలో భాగంగానే ఈ మినీ యాప్ స్టోర్‌ను ప్రారంభించామని పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈఓ విజయ్‌శేఖర్‌శర్మ తెలిపారు.