శాంసంగ్‌ గెలాక్సీ S25 రివ్యూ: జబర్దస్త్‌ స్మార్ట్‌ఫోన్‌.. కాకపోతే ఈ మైనస్‌ పాయింట్లు కూడా తెలుసుకోవాల్సిందే..

కొత్త One UI 7తో వచ్చిన మొదటి సిరీస్ ఇదే.

Samsung Galaxy S25 review

శాంసంగ్‌ గెలాక్సీ S25 ఫోన్లలో ఏఐ కీలకంగా మారింది. మీ పనులు సులభంగా, స్పీడ్‌గా అయ్యేలా ఏఐ చూసుకుంటుంది. మెసేజ్‌లు, ఈ-మెయిల్స్‌లోని ముఖ్యాంశాలు త్వరగా చూడొచ్చు. మీకు తెలియని భాషల్లో మాట్లాడేవారి మాటలను వెంటనే అనువాదం చేస్తుంది. పర్సనల్ అసిస్టెంట్ లా మీ పనులు సరిగ్గా అయ్యేలా చూస్తుంది.

శాంసంగ్‌ గెలాక్సీ S25 చిన్న ఫ్లాగ్‌షిప్ ఫోన్. అనుకున్నదానికంటే బాగా పని చేసింది. డిజైన్‌లో మాత్రం పెద్ద మార్పులు ఏమీ లేవు. కొత్త One UI 7తో వచ్చిన మొదటి సిరీస్ ఇదే. ఇది పూర్తిగా ఏఐతో పని చేస్తుంది.

ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 ప్రాసెసర్ ఉంది. యాప్‌లు వేగంగా ఓపెన్ అవుతాయి, మల్టీటాస్కింగ్‌కు అనుగుణంగా ఉంటుంది, గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌ బాగుంటుంది. 2032 వరకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు వస్తాయి. అదే విధంగా ఆటోమేటిక్ అప్ డేట్స్ కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు.

ఫోన్‌కు 6.2 అంగుళాల డైనమిక్ అమోలెడ్ 2X ఎల్‌టీపీఓ డిస్‌ప్లే.. స్క్రీన్ ఎఫ్‌హెచ్‌డీ+ రిజల్యూషన్, హెచ్‌డీఆర్ 10+ సపోర్ట్ ఇస్తుంది. 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌ను దానంతట అదే మార్చుకుంటుంది. బ్రైట్‌నెస్ 2600 నిట్స్ వరకు వస్తుంది. ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనపడుతుంది.

బ్యాక్ సైడ్ మూడు కెమెరాలు: 50ఎంపీ మెయిన్, 12ఎంపీ అల్ట్రా వైడ్, 10ఎంపీ 3ఎక్స్ టెలిఫొటో. ఫ్రంట్ సైడ్ 12ఎంపీ సెల్ఫీ కెమెరా. తీసిన ఫొటోలు చాలా నాణ్యంగా, షార్ప్‌గా వస్తాయి. పగటిపూట లైట్‌ లో అయినా, చీకట్లో అయినా ఫొటోలు బాగా వస్తాయి.

ఫోన్‌లో 12జీబీ ర్యామ్. 256జీబీ, 512జీబీ స్టోరేజ్ మోడల్స్ ఉన్నాయి. ఐపీ68 వాటర్, డస్ట్ ప్రొటెక్షన్ ఉంది. కొత్తగా గోరిల్లా గ్లాస్ విక్టస్ 2, ఆర్మర్ అల్యూమినియం ఫ్రేమ్ వాడారు.

ఏడు కలర్స్‌లో అందుబాటులో శాంసంగ్‌ గెలాక్సీ S25 ఫోన్: బ్లూ బ్లాక్, కోరల్ రెడ్, పింక్ గోల్డ్, నేవీ, ఐసీ బ్లూ, సిల్వర్, మింట్.

ఈ ఫోన్లో ఏఐ ఫీచర్లు ఇంకా చాలా స్పెషల్. ‘నౌ బ్రీఫ్’, ‘నౌ బార్’ ఫీచర్లు హోమ్ స్క్రీన్ పైనే మీకు కావాల్సిన వివరాలు చూపిస్తాయి. మీకు నచ్చిన పాటలు, స్పోర్ట్స్ స్కోర్లు, గూగుల్ మ్యాప్స్ రూట్ డీటెయిల్స్ అన్నీ వెంటనే కనిపిస్తాయి. ఈ ఫీచర్లు చాలావరకు ఫోన్ లోనే పని చేస్తాయి. జెమినీ ఏఐ లాంటివి వాడాలంటే మాత్రం ఇంటర్నెట్ కావాలి.

ఫొటో గ్యాలరీలో ‘జెనరేటివ్ ఎడిట్’ టూల్ బాగా అప్‌గ్రేడ్‌తో వచ్చింది. దీనితో ఫొటోలను సులభంగా ఎడిట్ చేసుకోవచ్చు. స్పామ్ కాల్స్‌ ను గుర్తించడం, మెసేజ్‌ లకు స్మార్ట్ రిప్లైలు ఇవ్వడం, మీ వాడకాన్ని బట్టి బ్యాటరీ పనితీరును పెంచడం – ఇలాంటి ఏఐ ఫీచర్లు కూడా ఉన్నాయి.

మైనస్ పాయింట్ ఏంటి?
ఇవన్నీ బాగున్నాయి కానీ, కొన్ని ఇబ్బందులు లేకపోలేదు. బ్యాటరీ బాగానే ఉన్నా, ఎక్కువగా గేమ్స్ ఆడినా.. కెమెరా, ఏఐ ఫీచర్లు బాగా వాడినా ఛార్జింగ్ త్వరగా అయిపోతుంది. ఇతర ఫోన్లతో పోల్చి చూస్తే శాంసంగ్‌ గెలాక్సీ S25 ఫోన్లలో ఛార్జింగ్ చాలా స్లో. కస్టమర్లకు ఎప్పటిలాగే ఈ సారి కూడా శాంసంగ్‌ ఛార్జర్ adopter ఇవ్వడం లేదు.

మొత్తం మీద చెప్పాలంటే, శాంసంగ్‌ గెలాక్సీ S25 చాలా మంచి ఫ్లాగ్‌షిప్ ఫోన్.