Ambulances Exploitation
Ambulances Exploitation : కోవిడ్ రోగులను చివరికి అంబులెన్స్ నిర్వాహకులూ వదలడం లేదు. ఆపద సమయంలో తమను ఆశ్రయించిన కోవిడ్ పేషంట్లను పీల్చి పిప్పి చేస్తున్నారు. రోగికి ఓ రేటు, డెడ్‌బాడీకి మరో రేటు చెప్పి.. అందినకాడికీ దోచుకుంటున్నారు. కరోనాను అడ్డుపెట్టుకుని ప్రతివారు బిజినెస్ చేస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి చివరికి అంబులెన్స్ నిర్వాహకుల వరకూ కోవిడ్ రోగులను ఎలా దోచుకోవాలనే ఆలోచిస్తున్నారు. మానవత్వం చూపాల్సిన సమయంలో….. తమ జేబులు ఎలా నింపుకోవాలని చూస్తున్నారు.
కరోనా సెకండ్ వేవ్‌తో జనం భారీగా ఆస్పత్రులపాలవుతున్నారు. కరోనా సోకిన రోగి.. ఆస్పత్రికి వెళ్లాలంటే అంబులెన్స్ ఒక్కటే మార్గం. దీంతో హైదరాబాద్ మహానగరంలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా అంబులెన్స్ సర్వీసులకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. సాధారణంగా దూరాన్ని బట్టి అంబులెన్స్‌కు చార్జీ వేస్తారు. ఒక రోగిని ఆస్పత్రికి తరలించాలంటే గరిష్టంగా వెయ్యి రూపాయలు ఖర్చు అయ్యేది. ఆక్సిజన్‌కైతే మరో రెండు మూడు వందలు ఖర్చవుతుంది. కానీ కరోనా సమయంలో అంబులెన్స్ యజమానులు కూడా ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారు.
హైదరాబాద్‌లో కోవిడ్ రోగిని ఆస్పత్రికి తరలించాలంటే 5 వేల నుంచి 10వేల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. నాన్ కోవిడ్ రోగులకు కూడా ఇంతే తీసుకుంటున్నారు. మినీ అంబులెన్స్ అయితే 3వేల నుంచి 4వేలు గుంజుతున్నారు. కోవిడ్ మృతదేహాన్ని తరలించాలంటే మరో రేటు చెబుతున్నారు. భాగ్యనగరంలో ఒకచోటు నుంచి మరో చోటుకు దూరాన్ని బట్టి 10వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇక రూరల్ ప్రాంతాలకు వసూలు చేసే ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. అంబులెన్స్ యజమానులు 15వేల నుంచి 20వేల వరకు వసూలు చేస్తున్నారు.
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో…. అంబులెన్స్ సర్వీసుల షాటేజ్ పెరిగింది. ప్రభుత్వ ఆధీనంలోని 108 సర్వీసులైతే 24 గంటలూ కోవిడ్ సర్వీసుల్లోనే బిజీగా ఉంటున్నాయి. దీంతో ఆపద సమయంలో ప్రాణాలు కాపాడుకునేందుకు, తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్ అంబులెన్స్‌లను ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో అంబులెన్స్ నిర్వాహకులు రోగుల అవసరాన్ని ఆసరాచేసుకుని ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారు. ప్రధానంగా గాంధీ ఆస్పత్రి దగ్గర అంబులెన్స్ దందా మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగుల కోసం అంబులెన్స్‌ను అడిగితే అడిగినంత ఇస్తేనే వస్తామంటూ ఏమాత్రం మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు.
కొద్ది రోజులుగా రాజధానిలో ప్రైవేట్ అంబులెన్స్ సర్వీసుల కొరత ఏర్పడింది. చాలా అంబులెన్స్‌లను జీహెచ్‌ఎంసీ అధికారులు కరోనా మృతదేహాలను తరలించేందుకు వినియోగిస్తున్నారు. మరికొన్ని అంబులెన్స్‌లను ప్రైవేట్ హాస్పిటల్స్ ఎంగేజ్ చేసుకున్నాయి. దీంతో అందుబాటులో ఉన్న అంబులెన్స్‌ల్లోనే రోగులు ఆస్పత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో కోవిడ్ రోగులపై అదనపు భారం పడుతోంది. ఈ పరిస్థితి మారాలని, ప్రభుత్వం అంబులెన్స్‌లను పెంచాలని కోవిడ్ రోగులు కోరుతున్నారు.