Andesri : అందెశ్రీ మృతికి అసలు కారణం ఇదే.. అప్పటికే ఐదు గంటలైంది.. కీలక విషయాలు వెల్లడించిన వైద్యులు
Ande Sri Death Reasons : గాంధీ ఆస్పత్రి హెచ్ఓడీ సునీల్ కుమార్ మాట్లాడుతూ.. ఉదయం 7.20 గంటలకు అందెశ్రీని ఆస్పత్రికి తీసుకొచ్చారు..
Ande Sri Death Reasons
Ande Sri Death Reasons : ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (64) కన్నుమూశారు. సోమవారం తెల్లవారు జామున తన నివాసంలో అందెశ్రీ అస్వస్థతకుగురై కుప్పకూలిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటీన ఆయన్ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అందెశ్రీ తుదిశ్వాస విడిచారు. ఉదయం 7.20గంటలకు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. 7.25గంటలకు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. అందెశ్రీ మరణంతో సాహితీలోకం కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. అయితే, అందెశ్రీ మృతికి గల కారణాలపై వైద్యులు కీలక విషయాలు వెల్లడించారు.
గాంధీ ఆస్పత్రి హెచ్ఓడీ సునీల్ కుమార్ మాట్లాడుతూ.. ఉదయం 7.20 గంటలకు అందెశ్రీని ఆస్పత్రికి తీసుకొచ్చారు.. ఆస్పత్రికి వచ్చేలోపు ఆయన కన్నుమూశారని, హార్ట్ స్ట్రోక్‌తో అందెశ్రీ మృతిచెందారని తెలిపారు. ఆయనకు గత కొన్నేళ్లుగా హైపర్ టెన్షన్ ఉంది. నెలరోజుల నుంచి మందులు వాడటం లేదని కుటుంబ సభ్యులు చెప్పారు. అయితే, మూడు రోజులుగా ఛాతిలో నొప్పితోపాటు ఆయాసం వస్తుందని ఇంట్లో చెప్పారట. రెండురోజుల నుంచి బీపీ ట్యాబ్లెట్లు మళ్లీ వాడుతున్నారు. రాత్రి మామూలుగానే పడుకున్నారు. ఉదయం 6.20 గంటల సమయంలో ఆయన సతీమణి చూడగానే కింద పడిపోయి ఉన్నారట. ఉదయం 7.20 గంటల సమయంలో ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రికి తీసుకొచ్చే సరికే ఆయన చనిపోయి ఐదు గంటలు అయి ఉండొచ్చునని భావిస్తున్నాం. కింద పడటం వల్ల హార్ట్ స్ట్రోక్ వచ్చి మరణించిఉండొచ్చునని వైద్యులు సునీల్ కుమార్ తెలిపారు.
అందెశ్రీకి పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈమేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. అందెశ్రీ మరణంతో లాలాపేట్ లోని ఆయన నివాసం వద్ద విషాదఛాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అందెశ్రీ భౌతికకాయాన్ని అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం లాలాపేటలోని జీహెచ్ఎంసీ మైదానానికి తరలించారు. పలువురు రాజకీయ, వివిధ రంగాల ప్రముఖులు అందెశ్రీ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.
