Medak : మరో వివాదంలో ఈటల.. మళ్లీ తెరపైకి వచ్చిన ఈ వాదనేంటి..?

ఇప్పటికే మెదక్‌ జిల్లాలో అసైన్డ్‌ భూముల కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి ఈటలకు ఫ్యామిలీపై మరో ఫిర్యాదు నమోదైంది. ఈటల తనయుడి మెడకు మరో భూకబ్జా ఆరోపణ చుట్టుకుంది.

Etela Rajender  : ఇప్పటికే మెదక్‌ జిల్లాలో అసైన్డ్‌ భూముల కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి ఈటలకు ఫ్యామిలీపై మరో ఫిర్యాదు నమోదైంది. ఈటల తనయుడి మెడకు మరో భూకబ్జా ఆరోపణ చుట్టుకుంది. మేడ్చల్‌ మండలం రావలకోల్‌ గ్రామానికి చెందిన పిట్లం మహేష్‌… ఈటల కుమారుడిపై సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేశాడు. రావలకోల్ గ్రామంలోని సర్వే నెంబర్ 77లో సుమారు 10.11 ఎకరాల భూమి ఉంది. దీన్ని 1975-76లో సీలింగ్ యాక్ట్ ప్రకారం తన తాత పిట్లం నరసింహంకు చెందినదిగా ధృవీకరిస్తూ ప్రభుత్వం సర్టిఫికెట్‌ను కూడా అందజేసిందంటున్నాడు బాధితుడు మహేశ్‌.

1954 ఖాస్రా పహాణీ నుంచి 1986 అడంగల్ పహాణీ వరకు రెవెన్యూ రికార్డులన్నీ తన తాత నరసింహంకు చెందినట్లుగానే వచ్చిందన్నారు. ఆ తర్వాత తమ రికార్డులన్నీ కొంతమంది బలవంతంగా లాక్కొన్ని చించివేసినట్టు ఆరోపిస్తున్నారు. ఆ తర్వాత 1986లో సత్యం రామలింగరాజుతో పాటు ఇతరుల పేర్లు పహాణీలో నమోదయ్యాయని చెప్పారు. దీనిపై పలుమార్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని.. అంతేకాక ఇనాం భూమిగా నకిలీ పత్రాలు సృష్టించి తమ భూములు కొనుగోలు చేసినట్టు ఆరోపిస్తున్నాడు మహేశ్‌. ఈ మధ్యకాలంలో తన తాత పేరు మీద ఉన్న భూములను మాజీ మంత్రి ఈటల రాజేందర్ తనయుడు ఈటల నితిన్ రెడ్డి, సాదా కేశవరెడ్డి పేరుమీదకు మారిందంటున్నాడు బాధితుడు మహేశ్‌.

ఈ విషయాన్ని ఆయన సీఎం కేసీఆర్‌ దృష్టికి తెచ్చారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి పట్టాదారు పాసు పుస్తకాలు కూడా పొందారని ఫిర్యాదు చేశాడు. ఈ విషయాన్ని గతంలో ఈటల రాజేందర్ దృష్టికి కూడా తీసుకెళ్లానని.. అయితే ఆయన తనను బెదిరించారని చెప్పారు. తన తాత పేరు మీదున్న భూమిని తనకు వచ్చేలా చూడాలని సీఎంను కోరారు.

మెదక్‌ జిల్లాలోని అచ్చంపేట్‌, హకీంపేట్‌, దేవరయాంజల్‌లో అసైన్డ్‌ భూములు కబ్జాచేసినట్టు ఈటల రాజేందర్‌పై ఆరోపణలొచ్చాయి. అధికారులు భూకబ్జా జరిగింది వాస్తవమేనని నివేదిక ఇవ్వడంతో మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురయ్యారు ఈటల. ఆ కేసు ఇంకా హైకోర్టులో నడుస్తుండగానే.. మరో భూకబ్జా కేసు ఆయన కుటుంబానికి చుట్టుకుంది. ఏకంగా పది ఎకరాలు మేడ్చల్‌ జిల్లాలో కబ్జా చేసినట్టు బాధితుడు ఆరోపిస్తున్నారు. మరి దీనిపై ఈటల ఫ్యామిలీ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తి రేపుతోంది.

Read More : Operation Muskaan : చదువుకుని సీఎం అవుతా…. ఆపరేషన్ ముస్కాన్

ట్రెండింగ్ వార్తలు