Bharati Builders Scam : హైదరాబాద్ లో మరో భారీ మోసం వెలుగు చూసింది. ప్రీ లాంచ్ పేరుతో ఒక సంస్థ బాధితులను నట్టేట ముంచేసింది. కొంపల్లిలో వెంచర్ పేరుతో బాధితుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసింది భారతి బిల్డర్స్ అనే సంస్థ. ఆపై ల్యాండ్ ను వారి పేరున రిజిస్ట్రేషన్ చేయకుండా కాలయాపన చేస్తోంది. సుమారు 450 మంది నుంచి 200 కోట్ల రూపాయలు వసూలు చేసింది. బాధితుల తమ డబ్బు తమకు తిరిగివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. భారతి బిల్డర్స్ ఫైనాన్షియర్ సునీల్ అహుజ నివాసం ముందు బాధితులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని కోరారు.
హైదరాబాద్ నగరంలో మరొక ప్రీ లాంచ్ మోసం వెలుగులోకి వచ్చింది. కొంపల్లిలోని భారతి బిల్డర్స్ బాధితులంతా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. లోటస్ పాండ్ లోని కొంపల్లి వెంచర్స్ భారతి బిల్డర్స్ ఫైనాన్షియర్ సునీల్ అహుజ ఇంటి ముందు ఆందోళన నిర్వహించారు. గడిచిన కొన్ని రోజులుగా కొంపల్లిలోని ప్రైమ్ ఏరియాలో ఆరున్నర ఎకరాల విస్తీర్ణంలో భారతి బిల్డర్స్ ల్యాండ్ కొనుగోలు కోసం సుమారుగా 450 మంది కస్టమర్ల నుంచి డబ్బులు వసూలు చేసింది. ఒక్కొక్కరి దగ్గరి నుంచి సుమారుగా 40 నుంచి 50 లక్షల రూపాయల వరకు డబ్బు చెల్లించుకుంది.
అయితే, ల్యాండ్ రిజిస్ట్రేషన్ మాత్రం వారి పేరుతో చేయలేదు. దీనికి సంబంధించి బాధితులు తమ డబ్బు తమకు తిరిగివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అనేకమార్లు వారి చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందని వాపోయారు. దీంతో పాటు కస్టమర్ల పేరుతో కొనుగోలు చేసిన ల్యాండ్ ను భారతి బిల్డర్స్ వారు మరొక దగ్గరి తనఖా పెట్టి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నట్లు వారికి తెలిసింది. దాంతో తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు లబోదిబోమన్నారు. దీనిపై స్థానిక పోలీస్ స్టేసన్ లో ఫిర్యాదు చేశారు. సైబరాబాద్ సీసీఎస్ లోనూ ఫిర్యాదు చేశారు. రెండేళ్లు కావొస్తున్నా డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉదయం పెద్ద సంఖ్యలో బిల్డర్ ఇంటి వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు.
Also Read : ప్రతి నెల 4శాతం లాభం అంటూ రూ.300 కోట్లు కొట్టేసిన కేటుగాడు..