Rajiv Yuva Vikasam Scheme
Rajiv Yuva Vikasam: రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించి వారి కాళ్లపై వారు నిలదొక్కుకునేలా రేవంత్ సర్కార్ రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమలు చేస్తుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ పథకానికి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఎనిమిది లక్షల దరఖాస్తులు రాగా.. ఈ పథకంకు దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసే వరకు 15లక్షల దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Also Read: RBI new notes: కొత్త 500 రూపాయల నోట్లు వచ్చేస్తున్నాయ్.. పాత నోట్లను ఏం చేయాలి..?
రాజీవ్ యువ వికాసం పథకం కింద ఈ ఏడాదికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ వర్గాల్లోని ఐదు లక్షల మందికి యూనిట్లు మంజూరు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అర్హులను ఎంపిక చేసి వారికి రాయితీ రుణాలను ప్రభుత్వం బ్యాంకుల ద్వారా ఇప్పిస్తుంది. అర్హులకు ఇచ్చే రుణాలకు ప్రభుత్వమే పూచీకత్తు ఇస్తుందని ఇప్పటికే రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
రాజీవ్ యువ వికాసం పథకం కింద అర్హులు ఏ యూనిట్ నైనా ఎంపిక చేసుకోవచ్చు. అయితే, సంబంధిత రంగాల్లో అప్పటికే అనుభవం ఉన్న వారికి, నైపుణ్యం కలిగిన వారికి ఎంపికలో ప్రాధాన్యం ఉంటుంది. ఈ పథకంకు దరఖాస్తు చేసుకోవాలంటే ఎలాంటి విద్యార్హత అవసరం లేదు. విద్యార్హతలతో నిమిత్తం లేకుండా రుణాలు మంజూరు చేస్తారు. ఈ పథకం అప్లయ్ చేసుకునేవారు రేషన్ కార్డు ఉంటే ఆదాయ ధ్రువీకరణ పత్రం జతచేయాల్సిన అవసరం లేదని అధికారులు చెప్పారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి రూ.లక్షన్నర, పట్టణ ప్రాంతాల్లో ఏడాదికి రూ. 2లక్షల లోపు కుటుంబ ఆదాయం ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. దరఖాస్తు గడువు ముగిసిన తరువాత అర్హుల ఎంపిక ప్రక్రియ మొదలవుతుందని బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య బట్టు చెప్పారు. ఈ పథకంకు ఎంపికైన వారికి వారు ఎంచుకున్న రంగాల్లో 15రోజుల పాట శిక్షణ ఇస్తారు.
అయితే, ఒకవేళ మీరు కార్పొరేషన్ పరిధిలో గతంలో రుణం తీసుకుంటే.. ఐదేళ్ల వరకు అర్హులు కాదు. ఐదేళ్లకు ముందు తీసుకున్న వారైతే దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకుల్లో రైతుల రుణం తీసుకున్న దానికీ, ఈ పథకానికి ఎలాంటి సంబంధం లేదని మల్లయ్య బట్టు తెలిపారు.