Maheshwaram : మహేశ్వరంలో ట్రయాంగిల్ ఫైట్.. సబిత ఓటమి ఖాయమంటున్న ప్రత్యర్థులు

Maheshwaram Assembly Constituency : మూడు పార్టీల నుంచి ముగ్గురు బలమైన అభ్యర్థులు బరిలో ఉండటంతో అందరి చూపు ఇప్పుడు మహేశ్వరం నియోజకవర్గం వైపే ఉంది. త్రిముఖ పోటీలో ఎవరికి వారే ప్రచారంతో ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. కచ్చితంగా తామే గెలుస్తామనే ధీమాతో ఎవరికి వారు "నీకు నాకు సై" అంటున్నారు.

Maheshwaram Assembly Constituency

రాజకీయ కురుక్షేత్రంలో ఎత్తుకు పై ఎత్తులు… అసెంబ్లీ ఎన్నికల సమరంలో పైచేయి సాధించేందుకు వ్యూహ ప్రతివ్యూహాలు. డిసెంబర్‌ 3న విజయఢంకా మోగిస్తామన్న సవాళ్లు. వీటన్నింటితో రంజుగా మారిన రాజకీయం. ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు రంగంలోకి పలువురు ఎమ్మెల్యే అభ్యర్థులు “నీకు నాకు సై” అంటున్నారు.

మహేశ్వరం నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. మూడు ప్రధాన పార్టీల నుంచి ముగ్గురు అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. మరో గెలుపు కోసం మంత్రి సబితా ఇంద్రారెడ్డి విస్తృత ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి బరిలో ఉన్నారు. మహేశ్వరంలో ఈసారి కాషాయ జెండా ఎగురవేసేందుకు బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్ పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు.

తెలంగాణకు కేసీఆర్ శ్రీరామరక్ష అని ప్రజలు నమ్ముతున్నారు- సబితా ఇంద్రారెడ్డి
తెలంగాణలో బీఆర్ఎస్‌ విజయం ఖాయమంటున్నారు మహేశ్వరం నియోజకవర్గ ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి. కేసీఆర్.. పక్కాగా హ్యాట్రిక్ సీఎంగా రికార్డ్ సృష్టిస్తారని జోస్యం చెప్పారామె. ప్రచారంలో తనకు మహేశ్వరం నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు సబితా ఇంద్రారెడ్డి. తొమ్మిదిన్నరేళ్లలో జరిగిన అభివృద్ధిని చూసి.. తెలంగాణకు సీఎం కేసీఆర్ శ్రీరామరక్ష అని ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యమంటున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి.

Also Read : మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌ నియోజకవర్గంలో వేడెక్కిన రాజకీయం.. హోరాహోరీ ప్రచారం

సబితను ఓడించేందుకు ప్రజలు సిద్ధమయ్యారు-అందెల శ్రీరాములు
మహేశ్వరం నియోజకవర్గానికి సబితా ఇంద్రారెడ్డి చేసిందేమీ లేదంటున్నారు బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్. పార్టీ మారి మంత్రి అయ్యారని.. కోట్ల విలువ చేసే భూములను కబ్జా చేశారని ఆరోపించారు. ఈసారి సబితా ఇంద్రారెడ్డిని ఓడించేందుకు మహేశ్వరం నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. బంగారు తెలంగాణలోని బజార్లలో మురుగునీరు ఏరులై పారుతోందని విమర్శించారు. తాను లోకల్‌.. స్థానిక ప్రజల సమస్యలేంటో తనకు తెలుసని.. ఈసారి మహేశ్వరం నియోజకవర్గ గడ్డపై కాషాయ జెండా ఎగురుతుందని అందెల శ్రీరాములు యాదవ్‌ ఫుల్ కాన్ఫిడెంట్‌గా చెప్తున్నారు.

సబితా ఇంద్రారెడ్డి ఓటమి ఖాయం-కేఎల్‌ఆర్
తెలంగాణలో బీఆర్ఎస్‌ను ఓడించి.. కాంగ్రెస్‌ను గెలిపించాలని ప్రజలు డిసైడ్‌ అయ్యారన్నారు హస్తం పార్టీ అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి. మహేశ్వరంలో సబిత వద్దు.. కాంగ్రెస్‌ ముద్దు అన్న ఉద్యమం జరుగుతోందన్నారు. సబిత కాంగ్రెస్‌ను మోసం చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో మహేశ్వరం నియోజకవర్గానికి ఒరిగిందేమీ లేదని విమర్శించారు. ఎప్పటి నుంచో తాను సేవా కార్యక్రమాలు చేస్తున్నానని.. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించానని గుర్తుచేశారు. మహేశ్వరంలో కాంగ్రెస్‌కు బీజేపీ మధ్యే పోటీ అని తేల్చి చెప్పారాయన.

Also Read : పెన్షన్ రూ.5వేలకు పెంపు, కొత్త రేషన్ కార్డులు- మంత్రి కేటీఆర్ వరాలు

మూడు పార్టీల నుంచి ముగ్గురు బలమైన అభ్యర్థులు బరిలో ఉండటంతో అందరి చూపు ఇప్పుడు మహేశ్వరం నియోజకవర్గం వైపే ఉంది. త్రిముఖ పోటీలో ఎవరికి వారే ప్రచారంతో ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. కచ్చితంగా తామే గెలుస్తామనే ధీమాతో ఎవరికి వారు “నీకు నాకు సై” అంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు