మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో వేడెక్కిన రాజకీయం.. హోరాహోరీ ప్రచారం
మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. మూడు ప్రధాన పార్టీల నుంచి ముగ్గురు అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు.

telangana assembly elections 2023 trianle fight in mahabubnagar assembly constituency
Mahabubnagar Assembly Constituency: రాజకీయ కురుక్షేత్రంలో ఎత్తుకు పై ఎత్తులు.. అసెంబ్లీ ఎన్నికల సమరంలో పై చేయి సాధించేందుకు వ్యూహ ప్రతివ్యూహాలు, డిసెంబర్ 3న విజయఢంకా మోగిస్తామన్న సవాళ్లు.. వీటన్నింటితో రంజుగా మారిన రాజకీయం.. ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు రంగంలోకి పలువురు ఎమ్మెల్యే అభ్యర్థులు “నీకు నాకు సై” అంటున్నారు.
మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. మూడు ప్రధాన పార్టీల నుంచి ముగ్గురు అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. రెండు సార్లు గెలిచిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ హ్యాట్రిక్ విజయం కోసం ప్రచారం విస్తృతంగా చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి యెన్నం శ్రీనివాస్ రెడ్డి బరిలో వున్నారు. అలాగే బీజేపీకి పట్టు ఉన్న పాలమూరులో కాషాయం జెండా ఎగరవేయాలని పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు బీజేపీ అభ్యర్థి మిథున్ రెడ్డి.
బీజేపీని గెలిపిస్తే అన్ని పథకాలు అందేలా కృషిచేస్తా: మిథున్ రెడ్డి
తొలిసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగినప్పటికీ తాను 2009 నుంచి రాజకీయాల్లో ఉన్నానన్నారు మహబూబ్‌నగర్ అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి మిథున్ రెడ్డి. ప్రచారంలో తనకు ప్రజల నుంచి మంచి మద్దతు లభిస్తోందని చెప్పారు. యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పార్టీ మార్పు ప్రభావం బీజేపీపై ఉండదని.. లీడర్లు వెళ్లినా బీజేపీలో కార్యకర్తలంతా పార్టీవైపే ఉంటారన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే మహబూబ్‌నగర్‌లో అభివృద్ధి జరిగిందన్నారు. గత పదేళ్లలో బీఆర్‌ఎస్ ఏమీ చేయలేదని.. కాని పబ్లిసిటీ స్టంట్‌తో అంతా వారే చేశామని చెప్తున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తనదే విజయమంటూ మిథున్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీజేపీని గెలిపిస్తే నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని, అలాగే అన్ని పథకాలు అందేలా కృషిచేస్తానని మిథున్‌రెడ్డి చెబుతున్నారు.
బీఆర్‌ఎస్‌ను ఓడించేందుకే పార్టీ మారాను: యెన్నం
గత పదేళ్లలో బీఆర్‌ఎస్ ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు మహబూబ్‌నగర్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్‌రెడ్డి. ప్రజలంతా బీఆర్ఎస్‌ను ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని.. వారు మార్పు కోసం కాంగ్రెస్ వైపు చూస్తున్నారని చెప్పారు. బీఆర్‌ఎస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని.. అందుకే తాను బీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు పార్టీ మారానని చెప్పారు. ఓటమి భయంతోనే ఇరు పార్టీలు కలిసి తనపై అభాండాలు వేస్తున్నాయన్నారు. తన జీవితం తెల్లని కాగితమని… తన ట్రాక్ రికార్డ్ ఎవరైనా పరిశీలించవచ్చని చెప్పారు.
మళ్లీ గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తా: శ్రీనివాస్ గౌడ్
తాము ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు మహబూబ్‌నగర్ బీఆర్‌ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్. తాము చేసిన అభివృద్ధి చూపించి ఓట్లు అడుగుతున్నామన్నారు. నియోజకవర్గాన్ని గత పదేళ్లలో ఎంతో అభివృద్ధి చేశారని.. మళ్లీ గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. ప్రతిపక్ష నేతలు గెలుస్తామని గాలిలో మేడలు కడుతున్నారని.. తెలంగాణలో వచ్చేది బీఆర్‌ఎస్ సర్కారేనన్నారు. మహబూబ్‌నగర్ అభివృద్ధికి తాను రోజుకు 18 గంటలు కష్టపడ్డానన్నారు. తెలంగాణలో వచ్చేది బీఆర్‌ఎస్ సర్కారేనని.. మహబూబ్‌నగర్‌లో తాను భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్‌లకు డిపాజిట్లు కూడా రావని, తన విజయం ఖాయమని చెప్తున్న బీఆర్‌ఎస్ అభ్యర్థి, మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో మా ప్రతినిధి రాఘవేంద్ర ఫేస్ టు ఫేస్.
Also Read: పెరుగుతున్న ఎన్నికల ప్రచార వ్యయం.. అప్పుల కోసం అభ్యర్థుల యత్నం
మూడు పార్టీల నుంచి ముగ్గురు బలమైన అభ్యర్థులు బరిలో ఉండటంతో అందరి చూపు ఇప్పుడు మహబూబ్‌నగర్ నియోజకవర్గం వైపే వుంది. త్రిముఖ పోటీలో ఎవరికి వారే ప్రచారంతో ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. కచ్చితంగా తామే గెలుస్తామనే ధీమాతో ఎవరికి వారు “నీకు నాకు సై” అంటున్నారు.