ఎస్సీ వర్గీకరణతో దళితుల చిరకాల స్వప్నం నెరవేరబోతోంది: కేంద్ర మంత్రి బండి సంజయ్

ఎస్సీ వర్గీకరణతో ఎవరికైనా నష్టం జరుగుతుందని భావిస్తే వారికి కేంద్రం న్యాయం చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్.

ఎస్సీ వర్గీకరణతో దళితుల చిరకాల స్వప్నం నెరవేరబోతోంది: కేంద్ర మంత్రి బండి సంజయ్

Bandi Sanjay comments on Supreme Court overruling on SC classification

Bandi Sanjay on SC Classification: ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాససం కీలక తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆయన స్పందించారు. ఎస్సీ వర్గీకరణ తీర్పు చారిత్రాత్మకమని, దళితుల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకునే పార్టీలకు ఈ తీర్పు చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు. ఈ సందర్బంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు చెప్పారు.

”అట్టడుగునున్న వర్గాలకు కూడా ప్రభుత్వ ఫలాలు అందాలన్నదే బీజేపీ అంత్యోదయ సిద్ధాంతం. 1997లోనే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా బీజేపీ తీర్మానం చేసింది. హైదరాబాద్ ఎన్నికల సభలోనూ ఎస్సీ వర్గీకరణకు అనుకూలమని ప్రధాని ఉద్ఘాటించారు. ఎన్నికల అనంతరం ఎస్సీ వర్గీకరణపై కేంద్ర కేబినెట్ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీని నియమించాం. ఆ కమిటీ నివేదిక ఆధారంగానే సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది.

సుప్రీంకోర్టు తీర్పుతో కోట్లాది మంది దళితుల చిరకాల స్వప్నం నెరవేరబోతోంది. మందకృష్ణ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ కోసం కొనసాగిన 3 దశాబ్దాల పోరాటాలు ఫలించాయి. ఎస్సీ వర్గీకరణతో ఎవరికైనా నష్టం జరుగుతుందని భావిస్తే వారికి కేంద్రం న్యాయం చేసేందుకు సిద్ధంగా ఉంది. కోర్టు తీర్పుపై అపార్ధాలకు తావివ్వకుండా దళితులంతా కలిసి మెలిసి ఉండాలని వేడుకుంటున్నా. రాజకీయ లబ్ది కోసం తీర్పును చిలువలు చేసి సమాజాన్ని చీల్చే కుట్రలు చేయొద్దని కోరుతున్నాన”ని బండి సంజయ్ అన్నారు.

Also Read : సుప్రీంకోర్టు తీర్పుపై తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన