Bandi Sanjay
Bandi Sanjay : జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం సాయంత్రం బోరబండ డివిజన్లో బీజేపీ అభ్యర్థి విజయాన్ని కోరుతూ సంజయ్ ప్రచార ర్యాలీ నిర్వహించారు. భారీ సంఖ్యలో బీజేపీ శ్రేణులు తరలివచ్చారు. సంజయ్‌తో పాటు ప్రచార ర్యాలీలో ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్సీ కొమురయ్య, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
మేం మీటింగ్ పెట్టుకుంటే ఎవరికెందుకు నొప్పి? మా ప్రచారం ర్యాలీకి అనుమతి ఇచ్చి రద్దు చేస్తారా..? పాతబస్తీలోనే సభ పెట్టి సత్తా చూపినం.. ఈ బోరబండ మాది. బరాబర్ సభ పెడతం. కాషాయ జెండాను రెపరెపలాడిస్తామని బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ముస్లీంల లెక్క టోపీ పెట్టుకున్నారు.. నమాజ్ పేరుతో డ్రామాలాడుతున్నారు. నేను అట్లాంటి పని చేయను. ఎందుకంటే నేను హిందువును. ఇతర మతాలను గౌరవిస్తా తప్ప కించపర్చను. ముస్లీంలలెక్క టోపీ పెట్టుకునే పరిస్థితే వస్తే తల నరుక్కుంటా అంటూ సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read: Wine Shops Close : మందు బాబులకు బిగ్ అలర్ట్.. నాలుగు రోజులు వైన్ షాపులు బంద్ ..
కేసీఆర్ పెద్ద మూర్ఖుడు.. ఆయన కొడుకు ఇంకా మూర్ఖుడు. ఈ మధ్య జనతా గ్యారేజ్ డైలాగ్ కొడుతున్నడు. మూడేళ్ల తరువాత కేసీఆర్ బయటకు వస్తడట.. సీఎం అవుతాడట.. జనం చస్తుంటే మాత్రం రాడు.. రైతులు అల్లాడుతుంటే రాడు.. యాక్సిడెంట్స్ అయి ప్రజలు చనిపోతుంటే రాడు.. ఇక మళ్లీ సీఎం ఎక్కడైతడు. అసలు కేటీఆర్‌కు ఆయన తండ్రి కేసీఆర్ మళ్లీ సీఎం కావాలనే ఆశ లేనేలేదు.. తండ్రిని పక్కకుతోసి ఎప్పుడెప్పుడు సీఎం కావాలని కేటీఆర్ చూస్తున్నాడని సంజయ్ అన్నారు.
కవితకు సంజయ్ ఓ సూచన చేశారు. మీ అన్న, మీ బావ, మీ బాబాయి కొడుకుతో జాగ్రత్త. అప్పుడప్పుడు కేసీఆర్ దగ్గరకు వెళ్లి బాగోగులు చూసుకో.. అంటూ సూచించారు. ఈ రెండేళ్లలో కేసీఆర్, ఆయన కొడుకు ఎన్నడైనా వచ్చారా..? ప్రజలు అల్లాడుతుంటే ఓదార్చింది మేము.. రైతుల బాధను పంచుకుంది మేము. అందుకే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రజలిచ్చే తీర్పు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు కనువిప్పు కావాలని బండి సంజయ్ అన్నారు.
మాగంటి గోపీనాథ్ చావుకు కేటీఆరే కారణం.. గోపీనాథ్ తల్లి చెప్పిన మాట ఇది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే గోపీనాథ్ చావుపై సమగ్ర విచారణ జరిపించాలని సంజయ్ అన్నారు. కాళేశ్వరంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగితే రూ.9వేల కోట్లపైనే సీబీఐ విచారణ ఎందుకు కోరినట్లు? రూ.లక్ష కోట్ల అవినీతిపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా? అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సంజయ్ ప్రశ్నించారు.
లక్ష ఓట్లకోసం ఒవైసీతో కలిసిన కాంగ్రెస్‌కు.. అజహరుద్దీన్ చేత వక్రతుండ అని గణేష్ మంత్రం చదవించే దమ్ముందా? ఒవైసీ సొదురులను భాగ్యలక్ష్మీ టెంపుల్‌కు తీసుకుపోయి బొట్టు పెట్టించి అమ్మవారి పాట పాడించే దమ్ముందా? అంటూ సంజయ్ కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. జూబ్లిహిల్స్ హిందువులారా.. 70శాతం ఓట్ల సత్తా ఏందో చూపించండి.. బీజేపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించండి అంటూ బండి సంజయ్ కోకారు.