Bandi Sanjay: తెలంగాణ నూతన సచివాలయంపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Bandi Sanjay: తెలంగాణ నూతన సచివాలయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Bandi Sanjay: తెలంగాణ నూతన సచివాలయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే నూతన సచివాలయ గుమ్మటాలను కూల్చివేస్తామని ప్రకటించారు. 1500 కోట్ల రూపాయల భారీ ఖర్చుతో సీఎం కేసీఆర్ సచివాలయం నిర్మిస్తున్నారని తెలిపారు. ప్రస్తుత మోడల్ మన సంస్కృతిని ప్రతిబింబించడం లేదన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే సచివాలయాన్ని మన సంస్కృతిని ప్రతిబింబించేలా మార్పులు చేస్తామని బండి సంజయ్ అన్నారు. శుక్రవారం కార్నర్ మీటింగ్ లో భాగంగా ఓల్డ్ బోయినపల్లిలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సచివాలయాన్ని తాజ్ మహల్ తరహాలో నిర్మిస్తున్నారని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రశంసించిన నేపథ్యంలో బండి సంజయ్ ఇలా స్పందించారు.
కాగా, ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 17న నూతన సచివాలయాన్ని ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. 17న పరేడ్ గ్రౌండ్‌లో బహిరంగ సభ కూడా నిర్వహించనుంది. పలువురు జాతీయ స్థాయి నాయకులు ఈ సభకు హాజరుకానున్నారు. సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టినందున ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని బీఆర్ఎస్ శ్రేణులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు.
పాతబస్తీ నుంచి మొదలు పెట్టండి.. బండి సవాల్
అసెంబ్లీలో బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి డ్రామా ఆడుతున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. ఈ రెండు పార్టీలు ఒకటేనని అన్నారు. రహదారులకు విస్తరణకు అడ్డుగా ఉన్న ప్రార్థనాలయాల కూల్చివేతను పాతబస్తీ నుంచి ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన సవాల్ విసిరారు. రహదారుల విస్తరణకు అడ్డుగా ఉన్న ప్రార్థనాలయాల కూల్చివేతకు చట్టం చేయాలన్న ప్రతిపాదనను పరిశీలిస్తామని అసెంబ్లీలో కేటీఆర్ ప్రకటించిన నేపథ్యంలో బండి సంజయ్ ఈ విధంగా స్పందించారు.
ద్వేష భావంతోనే సంజయ్ వ్యాఖ్యలు
బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నూతన సచివాలయ డోమ్ లను కూల్చివేస్తామన్న బండి సంజయ్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత రావుల శ్రీధరరెడ్డి స్పందించారు. ఆయన 10టీవీతో మాట్లాడుతూ.. పరిపాలనా సౌలభ్యం కోసమే నూతన సచివాలయాలన్ని నిర్మిస్తున్నామని చెప్పారు. ద్వేష భావంతో, కేసీఆర్ ను వ్యతిరేకించాలన్న సింగిల్ అజెండాతో బండి సంజయ్ మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయన మాటలకు పెద్దగా విలువ లేదని కొట్టిపారేశారు. నూతన సచివాలయంపై ప్రజల నిర్ణయమే శిరోధార్యమని స్పష్టం చేశారు.