MP Chamala Kiran: తండ్రిని కాపాడుకోవడానికే.. హరీశ్, సంతోష్ ల పేర్లు చెప్పారు.. కవితపై ఎంపీ చామల ఫైర్
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవినీతి జరిగినట్లు కవిత ఒప్పుకున్నారు.

MP Chamala Kiran: కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసును సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ శ్రేణుల్లో కలకలం రేపాయి. రాజకీయవర్గాల్లో హీట్ పెంచాయి. హరీశ్ రావు, సంతోష్ రావులను టార్గెట్ చేస్తూ కవిత నిప్పులు చెరిగారు. కేసీఆర్ బద్నాం కావడానికి ఆ ఇద్దరే కారణం అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఆ ఇద్దరి వల్లే తన తండ్రికి చెడ్డ పేరు వచ్చిందని కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తే ఆయన చుట్టూ ఉన్న వాళ్లు ఆస్తుల పెంచుకోవడం కోసం పనిచేశారని ఆమె ఆరోపించారు.
కాళేశ్వరం విషయంలో కవిత చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. కాళేశ్వరంలో అవకతవకలు జరిగినట్లు ఎమ్మెల్సీ కవిత ఒప్పుకున్నారని ఆయన అన్నారు. కేసీఆర్ అనుమతి లేకుండానే హరీశ్ రావు కాళేశ్వరం నిర్మాణం చేపట్టారా? అని కవితను ప్రశ్నించారు. తండ్రిని కాపాడుకోవడం కోసమే హరీశ్ రావు, సంతోష్ రావు పేర్లను కవిత ప్రస్తావించారని ఆయన ఆరోపించారు. కాళేశ్వరం అవినీతి మొత్తం కేసీఆర్ వల్లే జరిగిందన్నారు.
”కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవినీతి జరిగినట్లు కవిత ఒప్పుకున్నారు. ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆమె చెప్పకనే చెప్పారు. పీసీ ఘోష్ నివేదికను కవిత బలపరుస్తున్నట్లుగా మాట్లాడారు. కారకులు ఎవరనే విషయం పక్కన పెడితే కాళేశ్వరంలో స్కామ్ జరిగింది అనేది వాస్తవం” అని ఎంపీ చామల అన్నారు.
సీబీఐ విచారణలో ముందు కవితను ప్రశ్నించాలి..
కవిత చేసిన కామెంట్స్ పై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పందించారు. కాళేశ్వరంలో హరీశ్ రావు, సంతోష్ రావులకు వందల కోట్లు వచ్చాయని.. కవిత ఓపెన్ గా చెబుతోందన్నారు. సీబీఐ విచారణ సమయంలో ముందుగా కవితను విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. ” కవిత కుటుంబసభ్యురాలు, మాజీ ముఖ్యమంత్రి కూతురు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చెల్లెలు. ఆనాటి ఇరిగేషన్ శాఖ మినిస్టర్ కజిన్. ఆమె అంత బాగా చెబుతుంటే.. రేపు సీబీఐ దర్యాఫ్తును టేకప్ చేయగానే.. ముందు కవితను విచారించాలి. అప్పుడు టాస్క్ ఈజీ అయిపోతుంది” అని ఎంపీ అర్వింద్ అన్నారు.
Also Read: కేసీఆర్పై సీబీఐ విచారణ.. హరీశ్ రావు, సంతోశ్ రావుపై కవిత సంచలన వ్యాఖ్యలు..