Hyderabad Bald Head : బట్టతలపై జుట్టు మొలిపిస్తానంటే టెంప్ట్ అయ్యారు, కట్ చేస్తే ఆసుపత్రి పాలయ్యారు..! హైదరాబాద్‌లో ఘరానా మోసం..

ఒక్కొక్కరి నుంచి 220 రూపాయలు వసూలు చేశాడు. అందరికీ గుండ్లు కొట్టించాడు. బ్రష్​తో గుండుపై కెమికల్ అప్లయ్ చేశాడు.

Hyderabad Bald Head : బట్టతలపై జుట్టు మొలిపిస్తానంటే టెంప్ట్ అయ్యారు, కట్ చేస్తే ఆసుపత్రి పాలయ్యారు..! హైదరాబాద్‌లో ఘరానా మోసం..

Updated On : April 8, 2025 / 5:35 PM IST

Hyderabad Bald Head : హైదరాబాద్ పాతబస్తీలో ఘరానా మోసం వెలుగుచూసింది. కేవలం ఏడు రోజుల్లోనే బట్టతలపై జుట్టు మొలిపిస్తానని మాయమాటలు చెప్పి చివరికి ఉన్న వెంట్రుకలు కూడా పోయేలా చేశాడో మోసగాడు. వందలాది మందికి గుండ్లు కొట్టి డబ్బుతో పరార్ అయ్యాడు. అంతేనా.. గుండుపై ఏదో కెమికల్ పూయడంతో రియాక్షన్ అయి పలువురు ఆసుపత్రి పాలయ్యారు. హైదరాబాద్​ ఓల్డ్ సిటీలోని ఫతేదర్వాజలో ఈ ఘరానా మోసం జరిగింది. గుండుకు 200 రూపాయలు, బ్రష్​కు 20 రూపాయలు చొప్పున వసూలు చేసిన కేటుగాడు.. రియాక్షన్ అయిన విషయం తెలుసుకుని దుకాణం బంద్ చేసి ఎస్కేప్ అయ్యాడు.

ఆ మోసగాడి పేరు వకీల్. ఢిల్లీకి చెందిన వకీల్ 2013 నుంచి హెయిర్ కట్ పని చేస్తున్నాడు. బిగ్‌‌బాస్ ఫేమ్‌‌కు కూడా తాను బట్టతలపై జుట్టు మొలి పించానని బిల్డప్ ఇచ్చాడు. దీనిపై వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌‌ అయ్యాయి. ఏప్రిల్‌‌ 6న తాను హైదరాబాద్‌‌ వస్తున్నానని వకీల్ చెప్పాడు.

తన స్నేహితుడికి హైదరాబాద్‌‌ పాతబస్తీలో సెలూన్‌‌ షాపు ఉందని, అక్కడికి వస్తే బట్టతల బాధితుల సమస్య పరిష్కరిస్తానని సోషల్‌‌ మీడియాలో ప్రకటించాడు. చెప్పినట్టుగానే వకీల్‌‌ ఆదివారం హైదరాబాద్‌‌కు వచ్చాడు. వకీల్ ప్రచారం చూసి బట్టతల బాధితులు అతడిని గుడ్డిగా నమ్మేశారు. బట్టతలపై జుట్టు మొలుస్తుందనే ఆశతో వందలాది మంది వకీల్‌‌ చెప్పిన సెలూన్‌‌ షాపుకి క్యూ కట్టారు.

Also Read : పెద్ద భూ కుంభకోణం.. ఒక బీజేపీ ఎంపీ కూడా.. 3 రోజుల్లో బయటపెడతా: కేటీఆర్

బట్టతలపై మందు పూయాల్సి ఉంటుందని, అందరూ గుంటు కొట్టించుకోవాలని చెప్పాడు. ఒక్కొక్కరి నుంచి 200 రూపాయలు వసూలు చేశాడు. ఆ తర్వాత వారందరితో బ్రష్ కొనిపించాడు. ఇందుకోసం ఒక్కొక్కరి నుంచి 20 రూపాయలు తీసుకున్నాడు. ఆ బ్రష్​తో గుండుపై కెమికల్ రుద్దాడు వకీల్. ప్రారంభించాడు. వందలాది మంది వ్యక్తులు గుండు చేయించుకుని బట్టతలపై కెమికల్ పూయించుకున్నారు.

తాను గుండుపై అందరికీ మందు రాశానని వకీల్ చెప్పాడు. అంతేకాదు గుండు ఆరకూడదని షరతు పెట్టాడు. ఎప్పటికప్పుడు నీళ్లు చల్లుతూ ఉండాలన్నాడు. గుండుపై క్లాత్ కట్టుకుని ఉండాలన్నాడు. 5 రోజుల వరకు చల్లటి నీళ్లతోనే స్నానం చేయాలని కండీషన్ పెట్టాడు. ఆదివారం ఉదయం గుండుపై కెమికల్ పూయించుకుని వెళ్లిన వారిలో చాలామందికి సాయంత్రం కల్లా రియాక్షన్ మొదలైంది. బట్టతలపై మంట పుట్టింది. తర్వాత పెద్ద పెద్ద బొబ్బలు వచ్చాయి. దీంతో బట్టతల బాధితులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. ఏం జరిగిందో తెలియక కంగారుపడ్డారు. లబోదిబోమంటూ ఆసుపత్రికి పరుగులు పెట్టారు.

Also Read : మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలి.. పవన్ కొడుకుపై చంద్రబాబు, జగన్ ట్వీట్స్

వారిని పరిశీలించిన డాక్టర్లు.. అసలు నిజం చెప్పారు. గుండు గీసి కెమికల్స్ రాయడం వల్లే ఇన్​ఫెక్షన్ అయ్యిందని డాక్టర్లు చెప్పడంతో బాధితులు షాక్ కి గురయ్యారు. తాము మోసపోయామని లబోదిబోమన్నారు. వకీల్​ను నిలదీసేందుకు రెడీ అయిపోయారు. ఈ విషయం ముందే తెలుసుకున్న వకీల్ దుకాణం బంద్ చేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. వందల మందికి గుండ్లు కొట్టి డబ్బు వసూలు చేసిన వకీల్‌.. బిచానా ఎత్తేశాడు.

లేని జుట్టు కోసం ఆశపడితే ఉన్నది కూడా ఊడిపోయిందంటూ బాధితులు వాపోతున్నారు. ఇప్పుడీ వ్యవహారం స్థానికంగా సంచలనం రేపింది. బట్టతల మాటేమో కానీ.. ఉన్న వెంట్రుకలు కూడా పోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాయ మాటలతో వకీల్ చేసిన మోసాన్ని తలుచుకుని కుమిలిపోతున్నారు. పాపం.. బట్టతల బాధితులకు ఏడుపు ఒక్కటే తక్కువైంది.