Congress leaders: తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కొత్త టెన్షన్ మొదలైందట. లోకల్ బాడీ ఎన్నికల్లో.. బీసీ రిజర్వేషన్ అంశం ఉక్కిరిబిక్కిరి చేస్తోందట. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ.. ప్రభుత్వం జీవో ఇవ్వడమే కాకుండా.. ఎన్నికల రిజర్వేషన్లను కూడా ప్రకటించింది. ఈ వ్యవహారం కోర్టుకు చేరగా.. ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది.
న్యాయస్థానాల్లో ఏం జరుగుతుందనే టెన్షన్ ఓవైపు.. ప్రకటించిన రిజర్వేషన్‌ల వారీగా టికెట్ల్ ఇవ్వాలనే పార్టీ బీసీ నేతల డిమాండ్ మరోవైపు.. ఈ పరిణామాల మధ్య అధికార పార్టీ ఎమ్మెల్యేలకు టెన్షన్ మొదలైంది. దీంతో లోకల్ పోరు విషయంలో.. జిల్లా ఇంచార్జ్ మంత్రుల ముందు ఎమ్మెల్యేలు ఒక ఆప్షన్ పెట్టారట. ఇంతకీ ఏంటది.. వాళ్లకు ఎందుకు టెన్షన్?
తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం దూకుడుగా ముందుకు వెళ్తోంది. ఇచ్చిన మాట ప్రకారం.. స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ప్రకటిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఐతే ఇది రాజ్యాంగానికి విరుద్ధమంటూ కొందరు కోర్టు తలుపు తట్టారు. హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించగా.. విచారణ జరుగుతోంది. (Congress leaders)
Also Read: పార్టీ భవిష్యత్ కోసం పవన్ మాస్టర్‌ప్లాన్.. త్రిశూల వ్యూహం అంటే ఏంటి? ఎలా అమలు చేస్తారు?
కోర్టుల్లో విచారణ జరుగుతుండగానే.. ప్రభుత్వం మాత్రం లోకల్ బాడీ ఎన్నికలపై దూకుడుగానే వెళ్తోంది. స్థానిక సంస్థలకు షెడ్యూల్ ప్రకటించి.. ఆయా స్థానాలకు రిజర్వేషన్లను కూడా ఖరారు చేసింది. ఐతే రిజర్వేషన్ల విషయంలో.. కోర్టుల్లో భిన్నమైన తీర్పు వచ్చే అవకాశం ఉందనే చర్చ జోరుగా జరుగుతోంది. గతంలో మహారాష్ట్రలో రిజర్వేషన్లు పెంచి ఎన్నికలు నిర్వహిస్తే.. అక్కడి హైకోర్టు కొట్టేసింది. 50శాతం మించి రిజర్వేషన్లు పెంచిన బిహార్‌లోనూ ఇదే జరిగింది.
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి.. కోర్టుల్లో ఏం జరుగుతుందనే అనే దానిపై.. ఇప్పుడు తెలంగాణలో జోరుగా చర్చ నడుస్తోంది. ఇలాంటి పరిణామాల మధ్య.. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ రిజర్వేషన్లపై చేసిన కామెంట్స్‌తో.. అసలు లోకల్ బాడీ విషయంలో ఏం జరుగుతుందనే డిస్కషన్‌కు కారణమైంది. ఇప్పటికే స్థానిక సంస్థలకు రిజర్వేషన్లు ఖరారవగా.. కోర్టుల్లో భిన్నమైన తీర్పు వచ్చినా సరే.. ఈ విషయంలో వెనక్కి తగ్గొద్దని బీసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
న్యాయస్థానాల తీర్పుతో ఒకవేళ జీవో రద్దు అయినా.. పార్టీపరంగా సేమ్ ప్లేస్‌లో తమకు టికెట్లు ఇవ్వాలని బీసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఎలాగూ పార్టీపరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. అలాంటిది ఇప్పుడు రిజర్వేషన్ల విషయంలో వెనక్కి తగ్గితే.. బీసీల్లో నెగిటివ్ వస్తుందని హస్తం పార్టీ నేతలు చెప్తున్నారు. ఏది ఏమైనా సరే.. రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని పట్టుబడుతున్నారు.
పార్టీకి చెందిన బీసీ నేతల డిమాండ్‌తో .. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైంది. పార్టీపరంగా ఇచ్చే రిజర్వేషన్లు.. అందులోనూ ఇప్పుడు ప్రకటించినట్లుగా ఎన్నికలకు వెళ్తే.. తాము నిండా మునుగుతామని… ఉమ్మడి జిల్లాల ఇంచార్జ్ మంత్రులతో తెగేసి చెప్పారట. పార్టీపరంగా బీసీలకు ఇచ్చే 42శాతం రిజర్వేషన్ల విషయంలో తమకు స్వేచ్ఛ ఇవ్వాలని ఎమ్మెల్యేలు పట్టిన పట్టు వదలడం లేదని టాక్.
బీసీలకు ఇచ్చే రిజర్వేషన్లను.. నియోజకవర్గంలో ఎక్కడ ఛాన్స్ ఉంటే అక్కడ ఇస్తామని.. ఇప్పుడు ప్రకటించినట్లుగా చేస్తే పొలిటికల్‌గా తమకు ఇబ్బందులు ఎదురవుతాయని చెప్తున్నారు. కాదు ఖచ్చితంగా అలాగే వెళ్తామంటే.. ఫలితాల విషయంలో తమను ప్రశ్నించొద్దని క్లియర్‌కట్‌గా బయటకు అనేస్తున్నారట. ఐతే బీసీ నేతల వాదన మాత్రం ఇంకోలా ఉంది. రిజర్వేషన్ల విషయంలో ఇప్పుడు ప్రకటించినట్లుగా కాకుండా.. ఏ మాత్రం మార్చినా పార్టీకి నెగిటివ్ వస్తుందని అంటున్నారు.
లోకల్ బాడీ ఎన్నికల అంశం.. ఇప్పుడు అధికార కాంగ్రెస్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బీసీ రిజర్వేషన్ల విషయంలో ముందు నుయ్యి.. వెనక గొయ్యి అన్నట్లుగా మారింది. రిజర్వేషన్ల విషయంలో తమకు స్వేచ్ఛ ఇస్తే తప్ప అనుకున్న రిజల్ట్ రాదని ఎమ్మెల్యేలు తెగేసి చెప్తున్నారు. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వ పెద్దలు.. కాంగ్రెస్ పెద్దలు ఎలా డీల్ చేస్తారో చూడాలి మరి.