Begumpet Airport
Begumpet Airport : హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్టులో నాలుగు రోజులు విమనాల ప్రదర్శన కొనసాగనుంది. వింగ్స్ ఇండియా -2024 పేరుతో భారీ ప్రదర్శన నిర్వహించనున్నారు. ఏవియేషన్ షోను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సిందియా గురువారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి వీకే సింగ్, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ.. గడిచిన పదేళ్లలో ఎంతో ప్రగతి సాధించామని, 2047 నాటికి విమానయాన రంగం 20 ట్రియన్ డాలర్ల వృద్ధిని సాధించే దిశగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. కేంద్రపౌర విమానయాన శాఖ సహకారంతో ఫిక్కీ ఆధ్వర్యంలో విమాన ప్రదర్శన జరగనుంది. గురువారం నుంచి ఈనెల 21వ తేదీ వరకు వింగ్స్ ఇండియా-2024 వైమానిక ప్రదర్శన కార్యక్రమం జరగనుంది.
అంతర్జాతీయ విమానాల ప్రదర్శనలో పాల్గొనేందుకు ప్రపంచంలోనే అతిపెద్దదైన బోయింగ్ 777-9 విమానం రానుంది. ఇప్పటికే విమానం బేగంపేట విమనాశ్రయానికి చేరుకుంది. ఈ నాలుగు రోజుల పాటు బేగంపేటలో ఈ విమానం సందడి చేయనుంది. వింగ్స్ ఇండియా -2024 కార్యక్రమం కారణంగా బేగంపేట రోడ్డు మార్గంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇదిలాఉంటే గతంలో 15 నిమిషాల చొప్పున రోజుకు రెండు పర్యాయాలు విమాన విన్యాసాలు నిర్వహించగా.. ఈసారి 45 నిమిషాల చొప్పున రోజుకు రెండు సార్లు విన్యాసాలు చేయనున్నారు. చివరి రోజు ఆదివారం సందర్శకులు ఎక్కువగా వచ్చేఅకాశం ఉన్నందున ఆ రోజు మూడుసార్లు విన్యాసాలు నిర్వహించనున్నారు. భారత వాయుసేనకు చెందిన సారంగ్ బృందం గురువారం నుంచి 21వ తేదీ వరకు విన్యాసాలు నిర్వహించనుంది.