Anchor Shyamala
Anchor Shyamala: బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన పలువురు సినిమా, బుల్లితెర నటులు, యూట్యూబ్ ఇన్‌ఫ్లూయెన్సర్లుపై తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిలో వైసీపీ మహిళా నేత, యాంకర్ శ్యామల కూడా ఉన్నారు. అయితే, ఈ వ్యవహారంపై ఆమె తాజాగా హైకోర్టును ఆశ్రయించారు.
బెట్టింగ్ యాప్ వ్యవహారంలో యాంకర్ శ్యామల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. బెట్టింగ్ కేసులో తన మీద నమోదైన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని శ్యామల తన పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే, ఆ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినందుకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో శ్యామలపై కేసు నమోదైంది. Andhra365 అనే ఆన్ లైన్ గేమింగ్ యాప్ కు యాంకర్ శ్యామల ప్రమోషన్ చేశారు.
Also Read: Rana Daggubati: రానాపై కేసు.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఆయన టీమ్
నిషేధిత బెట్టింగ్ యాప్ లకు ప్రచారం చేసిన వ్యవహారంలో యాంకర్లు, బుల్లితెర నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల నుంచి సినీ ప్రముఖుల దాకా వెళ్లింది. గురువారం మియాపూర్ పోలీస్ స్టేషన్ లో నటులు దగ్గుబాటి రానా, ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగళ్లతో పాటు బుల్లితెర నటి, యాంకర్ శ్యామలపైకూడా కేసు నమోదైంది. వీరితోపాటు ఇన్‌ఫ్లూయెన్సర్లు, బుల్లితెర నటులు విష్ణు ప్రియ, హర్ష సాయి, భయ్యా సన్నీ యాదవ్, టేస్టీ తేజ, రీతూ చౌదరి, బండారు సుప్రీత, శ్రీముఖి, వర్షిణి, సౌందరరాజన్, సిరి హనుమంతు, వసంతి కృష్ణన్, శోభాశెట్టి, అమృతా చౌదరి, నయని పావని, నేహాపఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్ తదితరుల పేర్లను పోలీసులు ఎఫ్ఆర్ఐలో చేర్చారు. మియాపూర్ కు చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Also Read: Rithu Chowdary : పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో రీతూ చౌదరి.. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో విచారణ
ఇదిలాఉంటే.. శ్యామల, విష్ణు ప్రియతోపాటు 11 మందిపై ఈనెల 17న పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అయితే, విచారణకు హాజరు కావాలని పోలీసులు వీరికి నోటీసులు ఇచ్చారు. వీరిలో విష్ణుప్రియ, రీతూచౌదరిలు గురువారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. విష్ణు ప్రియను 10గంటలు, రీతూ చౌదరిని ఐదున్నర గంటలపాటు పోలీసులు సుదీర్ఘంగా విచారించారు.