Rithu Chowdary : పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో రీతూ చౌదరి.. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో విచారణ

గతేడాది తాను ప్రమోషన్ చేశానని, ఇప్పుడు అవి వైరల్ అవుతున్నాయని చెప్పుకొచ్చారు.

Rithu Chowdary : పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో రీతూ చౌదరి.. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో విచారణ

Updated On : March 20, 2025 / 7:16 PM IST

Rithu Chowdary : సెలబ్రిటీల మెడకు బెట్టింగ్ ప్రమోషన్ కేసు చుట్టుకుంటోంది. ఒకరి తర్వాత ఒకరు విచారణకు హాజరవుతున్నారు. హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ప్రముఖ యూట్యూబర్ రీతూ చౌదరి విచారణకు హాజరయ్యారు. పంజాగుట్ట పోలీసులు రీతూని విచారించారు. మరోవైపు ఇటీవలే సే నో టు బెట్టింగ్ యాప్స్ అంటూ ఆమె ఒక వీడియోని రిలీజ్ చేశారు.

గతేడాది తాను ప్రమోషన్ చేశానని, ఇప్పుడు అవి వైరల్ అవుతున్నాయని చెప్పుకొచ్చారు. తెలిసో, తెలియకో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశానన్నారు. ఇప్పుడు ఇదే వ్యవహారంలో పంజాగుట్ట పోలీసుల ఎదుట హాజరయ్యారు రీతూ చౌదరి. ఇటు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులోనే పోలీసుల విచారణకు విష్ణుప్రియ హాజరయ్యారు. ఆమె స్టేట్ మెంట్ ను నమోదు చేసిన పోలీసులు సంచలన విషయాలను రాబట్టారు. మొత్తం 15 బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినట్లుగా గుర్తించారు. ఒక్కొ ప్రమోషన్ కు 90వేల రూపాయలు తీసుకున్నట్లు పోలీసుల విచారణలో విష్ణుప్రియ అంగీకరించినట్లు సమాచారం.

ప్రముఖ సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్ వేదికగా విష్ణుప్రియ బెట్టింగ్ ప్రమోషన్ చేసినట్లుగా గుర్తించారు. ఎంత డబ్బు తీసుకున్నారు? ఏ ఖాతాకు ఆ నగదును బదిలీ చేశారు? అనేదానిపై ఆమె బ్యాంక్ స్టేట్ మెంట్ ను తీసుకున్నారు. విచారణ తర్వాత విష్ణుప్రియ మొబైల్ ఫోన్ ను పోలీసులు సీజ్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే టేస్టీ తేజ, కానిస్టేబుల్ కిరణ్ ను విచారించారు పోలీసులు.

Also Read : బెట్టింగ్ యాప్స్ ఎఫెక్ట్.. రానా, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మితో పాటు వాళ్లందరిపై కేసు నమోదు..

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారిపై హైదరాబాద్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. ఇప్పటికే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో 11 మంది సినీ సెలబ్రిటీలపై కేసులు నమోదయ్యాయి. అటు మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు 25 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. గతంలో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసి ఇన్ ఫ్లుయన్స్ చేసిన వారిపై పోలీసులు సీరియస్ గా ఉన్నారు. పంజాగుట్ట పీఎస్ లో 11మందిపై కేసులు నమోదవగా.. ఒక్కొక్కరికి ఒక్కో తేదీ ఇచ్చి విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు పోలీసులు.