Bhupal Naik Scam : షేర్ బజార్ స్కాం.. హైదరాబాద్‌లో నిందితుడు అరెస్ట్.. అమెరికాలో యువతి యాక్సిడెంట్లో మృతి.. ఏం జరిగింది?
Bhupal Naik Scam : షేర్స్ బజార్, కిసాన్ పరివార్ పేర్లతో పెట్టుబడిదారులను ఆకర్షించి వేల కోట్ల రూపాయల మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భూపాల్ నాయక్ కేసులో ఈవోడబ్ల్యూ దర్యాప్తు కొనసాగుతోంది. ఇదే సమయంలో ఈ సంస్థల్లో డైరెక్టర్‌గా ఉన్న అట్లూరి ప్రసన్న అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం చర్చనీయాంశంగా మారింది.
Bhupal Naik Scam
Bhupal Naik Scam : రూ.లక్ష పెట్టుబడి పెట్టండి.. ఏడాదికి 48శాతం లాభం చెల్లిస్తాం అంటూ నమ్మించి దేశవ్యాప్తంగా వేలాది మంది నుంచి కోట్లాది రూపాయలు సేకరించి వేల కోట్ల రూపాయల ఆర్థిక కుంభకోణానికి పాల్పడిన నానావత్ భూపాల్ నాయక్ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. షేర్స్ బజార్ ప్రైవేట్ లిమిటెడ్, కిసాన్ పరివార్ లిమిటెడ్ పేర్లతో నడిచిన ఈ సంస్థల ద్వారా భారీ మోసం జరిగినట్లు తేలింది. ఇప్పటికే భూపాల్ నాయక్ అరెస్టై ఈవోడబ్ల్యూ విచారణను ఎదుర్కొంటుండగా, సంస్థ డైరెక్టర్ అట్లూరి ప్రసన్న అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఈ కేసుపై మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో వేల కోట్ల కుంభకోణం వెనుక ఉన్న అసలు నిజాలు ఏమిటన్న దానిపై దర్యాప్తు కొనసాగుతోంది.
Also Read : Minor Driving License: కొత్త రూల్స్.. అందరికీ 18 ఏళ్లకే డ్రైవింగ్ లైసెన్స్.. వీళ్లకి మాత్రం 25 వచ్చాకే..
మహబూబాబాద్ జిల్లాకు చెందిన నానావత్ భూపాల్ నాయక్ సాధారణ పెట్రోల్ బంక్ కార్మికుడిగా జీవితాన్ని ప్రారంభించాడు. అనంతరం షేర్స్ బజార్, కిసాన్ పరివార్ పేర్లతో సంస్థలు ఏర్పాటు చేసి అధిక లాభాల ఆశ చూపిస్తూ ప్రజల నుంచి కోట్లాది రూపాయలు పెట్టుబడుల రూపంలో సేకరించాడు. కూకట్పల్లి, కొండాపూర్‌లలో 2020లో షేర్స్ బజార్, కిసాన్ పరివార్ సంస్థలను ప్రారంభించాడు. ఎస్బీపీల్… స్టాక్ ట్రేడింగ్ చేస్తోందని, కేపీఎల్.. రైతుల నుంచి భూములను సమీకరించి ప్రకృతి వ్యవసాయం చేస్తోందని ప్రచారం చేశాడు. వీటి ద్వారా భారీ లాభాలు ఆర్జించవచ్చునని నమ్మించాడు. అతన్ని నమ్మిన వందలాది మంది కోట్లలో డబ్బులు బదిలీ చేశారు. మొదట్లో లాభాలు పంచినా గతేడాది సెప్టెంబర్ నుంచి మోసానికి తెరలేపాడు.
భూపాల్ నాయక్ నకిలీ పత్రాలు, ఫోర్జరీలతో లేని భూములకు కూడా రికార్డులు సృష్టించి పెట్టుబడిదారులకు చూపించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ భూ రికార్డులను దుర్వినియోగం చేసి వేల ఎకరాల భూములు ఉన్నట్లు నమ్మించి కోట్ల రూపాయలు వసూళ్లు చేశాడు. ఈ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన వారిలో సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాలు మాత్రమే కాకుండా ఉన్నత విద్యావంతులు, ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నారు. 2022 నాటికే 1,200 మందికి పైగా బాధితులు ఉన్నారు. దేశవ్యాప్తంగా వేలాది మంది భూపాల్ నాయక్ చేతిలో మోసపోయారు.
మొదట్లో పెట్టుబడిదారులకు రాబడులు చెల్లించిన సంస్థలు, తర్వాత చెల్లింపులు నిలిపివేయడంతో బాధితులకు అనుమానం వచ్చింది. డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి పెరగడంతో భూపాల్ నాయక్ విదేశాలకు పారిపోవడానికి ప్రయత్నించాడు. మోకిలకు చెందిన విశ్రాంత నేవీ అధికారి సంజీవ్ గుప్తా సహా పలువురు రూ.1.51 కోట్ల పెట్టుబడులు పెట్టామని ఫిర్యాదు చేయడంతో సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం (EOW) జూన్ 15న కేసు నమోదు చేసింది. ఇదే సమయంలో గుజరాత్లో నమోదైన మరో కేసు నేపథ్యంలో లుకౌట్ నోటీసులు జారీ చేయగా, విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో భూపాల్ నాయక్‌ను గుజరాత్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పీటీ వారెంట్‌పై హైదరాబాద్‌కు తీసుకొచ్చి విచారిస్తున్నారు.
అట్లూరి ప్రసన్న మృతి.. కొత్త అనుమానాలు..
ఈ సంస్థల్లో డైరెక్టర్‌గా ఉన్న అట్లూరి ప్రసన్న అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం కేసులో కొత్త చర్చకు దారితీసింది. ఆమె పేరుతో భారీ లావాదేవీలు జరిగాయని, విచారణలో కీలక సమాచారం బయటపడే అవకాశమున్న సమయంలో ఈ ఘటన జరగడం అనుమానాలకు తావిస్తోందని కొందరు బాధితులు చెబుతున్నారు. షేర్ బజార్ కంపెనీ డైరెక్టర్ అట్లూరి ప్రసన్న(30) ఈనెల 5వ తేదిన అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామానికి చెందిన అట్లూరి వసంతరావు, మల్లేశ్వరి దంపతుల కుమార్తె ప్రసన్న. చార్టర్డ్ అకౌంటెన్సీ పూర్తి చేసిన ఆమె న్యూయార్క్‌లో మాస్టర్ ఫైనాన్స్ చేసి కొద్ది రోజుల క్రితమే ఉద్యోగం సంపాదించారు. ఉద్యోగం వచ్చిందన్న ఆనందంలో ఆమె తన స్నేహితులతో కలిసి ఒక దేవాలయానికి బయల్దేరారు. దారిలో సిగ్నల్ వద్ద ఆగిన వారి కారును వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రసన్న, మరో అమ్మాయి మరణించినట్టు న్యూయార్క్ పోలీసులు ప్రకటించారు. కాగా, షేర్బజార్ స్ధాపన, రిజిస్ట్రేషన్ వ్యవహారాలను ప్రసన్న చక్కదిద్దారని, పెట్టుబడిదారులతో కుదుర్చుకున్న అనేక ఒప్పందాల్లో ప్రసన్న సంతకాలు ఉన్నాయని దర్యాప్తు అధికారులు పేర్కొంటున్నారు.
