Bombay High Court : తెలంగాణ యువతి వ్యవహారంలో బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు
Bombay High Court : తెలంగాణ యువతి వ్యవహారంలో బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పుట్టింటికి వెళ్లాలని మహిళను బలవంతపెట్టలేరని పేర్కొన్న కోర్టు.. మిస్సింగ్ కేసు మూసివేయాలని రాష్ట్ర పోలీసులకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది.
Bombay High Court
Bombay High Court : తెలంగాణ యువతి వ్యవహారంలో బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పుట్టింటికి వెళ్లాలని మహిళను బలవంతపెట్టలేరని పేర్కొన్న కోర్టు.. మిస్సింగ్ కేసు మూసివేయాలని రాష్ట్ర పోలీసులకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. వయోజనురాలైన మహిళ తాను ఎక్కడ నివసించాలో స్వయంగా నిర్ణయించుకునే పూర్తి చట్టబద్ధమైన హక్కు ఉంటుందని, ఆమెను బలవంతంగా తల్లిదండ్రుల వద్దకు పంపించే అధికారం ఎవరికీ లేదని కోర్టు పేర్కొంది. ఆ యువతి పై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని తెలంగాణ పోలీసులను కోర్టు ఆదేశించింది.
హైదరాబాద్కు చెందిన 21ఏళ్ల యువతి, తాను జూన్ నెలలో స్వచ్ఛందంగానే ముంబయికి వచ్చానని కోర్టుకు తెలిపింది. ప్రస్తుతం ఓ స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్నానని, తనకంటే పదేళ్లు పెద్దవారితో వివాహం చేసుకోవాలని ఒత్తిడి రావడంతో దత్తత తల్లిదండ్రుల ఇంటిని విడిచివచ్చినట్లు వెల్లడించింది. విచారణ సందర్భంగా దత్తత తల్లి అఫిడవిట్ దాఖలు చేస్తూ, వివాహం విషయంలో బలవంతం చేయబోమని, ఆమె ఉన్నత విద్యకు ఎలాంటి అడ్డంకులు సృష్టించబోమని తెలిపింది. రెండు నెలల వయసు నుంచే ఆ యువతిని తాము పెంచుకున్నామని కోర్టుకు వివరించింది.
ఈ కేసును విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రవీంద్ర ఘుగే, జస్టిస్ గౌతమ్ల ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. వయోజనురాలైన మహిళకు తన నివాసం, వివాహం, ఉన్నత విద్య వంటి అంశాల్లో స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే హక్కు రాజ్యాంగం కల్పించిందని పేర్కొంది. అలాగే కుటుంబ సభ్యుల బెదిరింపుల నుంచి రక్షణ పొందే హక్కు కూడా ఆమెకు ఉంటుందని స్పష్టం చేసింది. అయితే తాను తిరిగి పుట్టింటికి వెళ్లే ఉద్దేశం లేదని యువతి స్పష్టంగా చెప్పడంతో, ఆమెపై నమోదైన మిస్సింగ్ కేసును మూసివేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ పోలీసులను బాంబే హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు జూలై 2న జారీ చేసిన ఉత్తర్వుల ప్రతులు తాజాగా అందుబాటులోకి వచ్చాయి.
