భూమా అఖిలప్రియ భర్తే కిడ్నాప్‌లో కీలకమా?

భూమా అఖిలప్రియ భర్తే కిడ్నాప్‌లో కీలకమా?

Updated On : January 6, 2021 / 7:23 AM IST

Bowenpally Kidnap Case : హైదరాబాద్‌ బోయిన్‌పల్లిలో కిడ్నాప్‌ కలకలంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మాజీ హాకీ ప్లేయర్‌ ప్రవీణ్‌రావు కుటుంబ సభ్యులు కిడ్నాప్‌నకు గురవగా.. ప్రవీణ్‌రావుతో పాటు సోదరులు నవీన్‌రావు, సునీల్‌రావును కూడా కిడ్నాప్ చేశారు. అయితే గంటల వ్యవధిలోనే కిడ్నాప్ కథ సుఖాంతం అయ్యింది.

ప్రవీణ్‌రావుతో పాటు ఆయన సోదరులు నవీన్‌రావు, సునీల్‌ రావును ముగ్గురు సేఫ్‌గా ఇంటికి తీసుకొని వచ్చినా.. వీరి కిడ్నాప్‌పై నెలకొన్న సందేహాలు మాత్రం కొనసాగుతున్నాయి. వీరిని ఎవరు కిడ్నాప్‌ చేశారు? ఎందుకు చేశారు అనేదానిపై మాత్రం సస్పెన్స్‌ కొనసాగుతోంది. కిడ్నాప్‌ వెనుక దాగి ఉన్న అసలు కథ ఏంటనేది మాత్రం తెలియట్లేదు. పోలీసులుగానీ, కుటుంబ సభ్యులుగానీ కిడ్నాప్‌ వెనుక దాగున్న గుట్టు ఏంటో బయటకు చెప్పట్లేదు.

కిడ్నాపర్లు ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్‌ పేరుతో బెదిరింపులకు పాల్పడినట్టు వారు పోలీసులకు తెలిపారు. కీలక నిందితుడిగా అనుమానిస్తున్న చంద్రబోస్‌.. భార్గవ్‌ రామ్‌ సోదరుడే అని పోలీసు విచారణలో తేలింది. దీంతో భూ వివాదాలే కిడ్నాప్‌కు కారణమా? భూమా అఖిలప్రియ భర్త భార్గవ్‌రామే కిడ్నాప్ వ్యవహారంలో కీలకమా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ దిశగా కూడా ఇప్పుడు పోలీసులు విచారణ చేపట్టారు.