Malkajgiri: మల్కాజిగిరి బరి నుంచి మైనంపల్లిని తప్పించడం ఖాయమా?

పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించిన మైనంపల్లి అభ్యర్థిత్వాన్ని రద్దు చేసి.. ఆ స్థానంలో మరొకరిని టిక్కెట్లు ఇవ్వాలనే డిమాండ్ క్రమంగా పెరుగుతుండటంతో అధిష్టానం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని చెబుతున్నారు.

Malkajgiri: మల్కాజిగిరి బరి నుంచి మైనంపల్లిని తప్పించడం ఖాయమా?

BRS brass likely to drop rebel Mynampally Hanumanth Rao

Malkajgiri – Mynampally: ఒకేసారి 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసి రాష్ట్ర రాజకీయాల్లో జోరు పెంచిన అధికార బీఆర్ఎస్ బాస్.. సీఎం కేసీఆర్‌కు (CM KCR) గ్రేటర్ హైదరాబాద్ (Hyderabad) లో రెండు నియోజకవర్గాలు కొరకరాని కొయ్యగా మారాయట. నగరంలో నాంపల్లి, గోషామహల్ (Goshamahal) నియోజకవర్గాలకు మినహాయించి మిగిలిన అభ్యర్థులను ఖరారు చేసినా.. తన వారసుడికి మెదక్ టిక్కెట్ ఇవ్వలేదంటూ మల్కాజ్‌గిరి అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావు (Mynampally Hanumanth Rao) ఎదురుతిరగడం.. గులాబీ దళపతికి ఆగ్రహం తెప్పించింది. కారు పార్టీలో కలకలం రేపేలా కామెంట్లు చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించొద్దని క్యాడర్ మొత్తం పట్టుబడుతుండటంతో ప్రత్యమ్నాయంపై దృష్టిసారించారట సీఎం కేసీఆర్. ఇక మరోవైపు ఎంఐఎం (AIMIM) అడ్డా నాంపల్లిపై పెద్దగా ఆశలు పెట్టుకోకపోయినా గోషామహల్‌లో పాగా వేసే లక్ష్యంగా కదులుతోంది గులాబీదళం. దీంతో ఇప్పుడు మల్కాజిగిరి, గోషామహల్ అభ్యర్థులెవరన్నది ఆసక్తిరేపుతోంది.

రాష్ట్ర రాజకీయాల్లో స్పీడ్ పెంచిన సీఎం కేసీఆర్ మల్కాజ్‌గిరి మంట చిర్రెత్తిస్తోందట. మెదక్లో తన కుమారుడికి టిక్కెట్ ఇవ్వకపోవడంపై మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తీవ్రంగా స్పందించడం.. బీఆర్ఎస్ క్రమశిక్షణను ఉల్లంఘించడమేనని అంటున్నారు. పార్టీలో క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించొద్దని.. మైనంపల్లిపై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ కార్యకర్తల నుంచే డిమాండ్లు వినిపిస్తుండటంతో ఆయనపై వేటుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాల సమాచారం. మెదక్‌లోని ప్రత్యేక పరిస్థితులు.. సిట్టింగ్లకు మళ్లీ అవకాశం ఇవ్వాలని పార్టీ లైన్ తీసుకుంటే.. తన కుమారుడికి టిక్కెట్ రాకుండా మంత్రి హరీశ్రావు అడ్డుకున్నారని ఆరోపించడమే కాకుండా.. పార్టీపై సైతం అనుచిత వ్యాఖ్యలు చేశారు మైనంపల్లి. అప్పటికీ పెద్దగా పట్టించుకోని కారు పార్టీ అధినేత మల్కాజ్‌గిరి సీట్‌ను మైనంపల్లికే ఇచ్చారు. లిస్టు చూశాకైనా ఆయన మనసు మారుతుందని, కామెంట్లు వెనక్కి తీసుకుంటారని గులాబీదళం భావించింది. కానీ, మైనంపల్లి తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోకపోగా.. కాంగ్రెస్తో సంప్రదిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని సీరియస్గా పరిగణిస్తున్నారు సీఎం కేసీఆర్.

Also Read: టికెట్‌ రాలేదని వెక్కి వెక్కి ఏడ్చిన బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే

పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించిన మైనంపల్లి అభ్యర్థిత్వాన్ని రద్దు చేసి.. ఆ స్థానంలో మరొకరిని టిక్కెట్లు ఇవ్వాలనే డిమాండ్ క్రమంగా పెరుగుతుండటంతో అధిష్టానం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని చెబుతున్నారు. మైనంపల్లిని తప్పించి ఆ స్థానంలో బలమైన అభ్యర్థులు ఎవరెవరు ఉన్నారో ఆరా తీస్తోంది. గత ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేసిన మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖరరెడ్డి, కంటోన్మెంట్ టిక్కెట్ ఆశించిన సీనియర్ నేత క్రిశాంక్ (Manne Krishank), డిప్యూటీ మేయర్ శ్రీలత భర్త శోభన్ రెడ్డి, అల్వాల్ కార్పొరేటర్ విజయశాంతి పేర్లను పరిశీలిస్తోంది బీఆర్ఎస్ అధిష్టానం. మర్రి రాజశేఖరరెడ్డికి అంగ, అర్థ బలాలు ఉండటం.. క్రిశాంక్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తుండటంతో ఆ ఇద్దరి పేర్లను సీరియస్ గా పరిశీలిస్తున్నారు. ఇక ముదిరాజ్లకు టిక్కెట్ ఇవ్వకపోవడంతో ఆ లోటును మల్కాజిగిరిలో భర్తీ చేయాలని అనుకుంటోంది గులాబీ పార్టీ. దీంతో ముదిరాజ్ వర్గానికి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే పేరును సైతం పరిశీలిస్తున్నట్లు చర్చ సాగుతోంది. ఏదిఏమైనా మైనంపల్లిని మల్కాజిగిరి బరి నుండి తప్పించడం మాత్రం ఖాయమనే టాక్ విన్పిస్తోంది.

Also Read: గులాబీ బాస్ టాప్‌గేర్.. కేసీఆర్ మార్కు చాణక్యం.. ఒకే దెబ్బతో అంతా సెట్!

మల్కాజిగిరి అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీకి మంచి ఆదరణ ఉంది. గత ఎన్నికల్లో 70 వేల ఓట్ల మెజార్టీ వచ్చింది. ద్వితీయస్థానం అభ్యర్థికి వచ్చిన ఓట్లు కన్నా రెట్టింపు ఓట్లు మెజార్టీగా రావడంతో అభ్యర్థి ఎవరైనా ఈజీగా గెలుస్తామని బీఆర్ఎస్ నాయకత్వం అంచనా. అందుకే పార్టీ విధేయులు.. ఇంతవరకు అవకాశం దొరకని వారు.. సామాజిక వర్గ విశ్లేషణలను బేరీజు వేసుకుని తుది నిర్ణయానికి రావాలనుకుంటోంది. ఇదే సమయంలో గోషామహల్ నియోజకవర్గం అభ్యర్థి ఇంకా డిసైడ్ కాకపోవడంతో రెండింటికి ఒకేసారి అభ్యర్థులను ప్రకటించే విషయాన్ని పరిశీలిస్తోంది. గోషామహల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్ మళ్లీ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తామంటున్నారు. ఒకవేళ బీజేపీ టిక్కెట్ దక్కకపోతే ఇండిపెండెంట్గా రంగంలోకి దిగుతానంటున్నారు.

Also Read: కామారెడ్డిలో కేసీఆర్ పై విజయశాంతి పోటీ..?

గోషామహల్ బరిలో దిగబోయే బిజేపీ నాయకుడెవరన్నది తేలాకే ఇక్కడి బీఆర్ఎస్ అభ్యర్థిని ఖరారు చేసే ఆలోచనలో ఉన్నారు గులాబీబాస్. దీంతో సామాజిక న్యాయం జరిగేలా గోషామహల్, మల్కాజ్‌గిరి నియోజకవర్గాల అభ్యర్థులను ఎంపిక చేయాలని భావిస్తోంది బీఆర్ఎస్ అధిష్టానం. జనగామ, నర్సాపూర్, నాంపల్లి అభ్యర్థులతో రెండో జాబితా ప్రకటించి.. మల్కాజ్‌గిరి, గోషామహల్‌పై లాస్ట్‌లో నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు సీఎం కేసీఆర్. ఎన్నికలు కాకమీదకు వచ్చే వరకు మల్కాజ్‌గిరిపై సస్పెన్స్ కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది.