Telangana Panchayat Elections: తెలంగాణలో మొదటి దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఇంట్రెస్టింగ్‌గా మారాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న అధికార పార్టీకి..బీఆర్ఎస్ కంటే ఎక్కవ స్థానాలే వచ్చాయి. అయితే ఫస్ట్ ఫేజ్ సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై అధికార కాంగ్రెస్ అంత స్యాటిస్‌ఫైగా లేదట. మొదటి విడతలో 4వేల 230 సర్పంచ్ స్థానాల్లో..ఏకగ్రీవాలతో కలిపి అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 2వేల 425 స్థానాల్లో గెలిచారు.
ఇక బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 1,168 స్థానాల్లో గెలిచారు. బీజేపీ మద్దతు ఇచ్చిన స్థానాల్లో 189 మంది విజయం సాధించారు. సీపీఎం 24 సీట్లు, సీపీఐ 23 స్థానాలను గెలుచుకున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్రులు 401 స్థానాల్లో సత్తా చాటారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన స్థానాలపై అధికార కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తోంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం ఆశ్చర్యపోతోందన్న చర్చ జరుగుతోంది.
ఫస్ట్ ఫేజ్ పంచాయతీ ఎన్నికల్లో కనీసం 80 నుంచి 90 శాతం స్థానాల్లో గెలవాల్సిందని కాంగ్రెస్ అనుకుంటుంటే, అసలు ఏ మాత్రం పోటీ ఇవ్వలేమని భావించిన బీఆర్ఎస్ లోలోన తెగ హ్యాపీగా ఫీల్ అవుతోందట. అవును..పంచాయితీ ఎన్నికలను పెద్దగా పట్టించుకోకపోయినా ఫస్ట్ ఫేజ్‌లో సానుకూల ఫలితాలు రావడంతో ఇప్పుడు సీరియస్‌గా దృష్టి పెట్టిందట కారు పార్టీ.
Also Read: మెస్సీ జట్టుపై రేవంత్ రెడ్డి టీమ్ ఘనవిజయం.. తెలంగాణ సీఎం ఎలా ఆడారో చూడండి..
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎప్పుడైనా అధికార పార్టీదే అప్పర్ హ్యాండ్ ఉంటుంది. పవర్‌లో ఉన్న పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులే మెజార్టీ స్థానాలను గెలవడం సర్వ సాధారణం. ఈ హోప్‌తోనే ఈ సారి పంచాయితీ ఎన్నికల్లో కనీసం 80 నుంచి 90 శాతం స్థానాల్లో విజయం సాధిస్తామని హస్తం పార్టీ ఆశించింది. కానీ మొదటి విడత ఎన్నికల్లో 57 శాతం స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందట. ఇదే ఇప్పుడు కాంగ్రెస్‌లో అసంతృప్తికి కారణంగా తెలుస్తోంది. ఇదే సమయంలో ఫస్ట్ ఫేజ్ పంచాయితీ ఎన్నికల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్‌కు 27 శాతం అనుకూల ఫలితాలు వచ్చాయి.
ఓ రకంగా ఇది గులాబీ పార్టీ కూడా ఊహించలేదని అంటున్నారు. ఎందుకంటే అసలు బీఆర్ఎస్ పార్టీ పంచాయతీ ఎన్నికలను అంత సీరియస్‌గా తీసుకోలేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమితో కాస్త నిరాశలో ఉన్న గులాబీ పార్టీ లీడర్లు, క్యాడర్..పల్లె పోరుపై పెద్దగా దృష్టి పెట్టలేదు. కనీసం పార్టీ అధిష్టానం ఒక రివ్యూ కూడా చేయలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నచోట మినహా మిగతా నియోజకవర్గాల్లో సర్పంచ్ ఎన్నికలను కారు పార్టీ పెద్దగా పట్టించుకోలేదని ముందు నుంచి ప్రచారం జరుగుతోంది.
కాంగ్రెస్ పార్టీదే పైచేయి ఉంటుందని పట్టించుకోలేదా?
స్థానిక సంస్థల ఎన్నికలను మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజా ప్రతినిధులు, ఇంచార్జీలు చూసుకుంటారులే అని బీఆర్ఎస్ అధిష్టానం లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు స్థానిక ఎన్నికల్లో ఎలాగూ అధికార కాంగ్రెస్ పార్టీదే పైచేయి ఉంటుందన్న ఉద్దేశంతో పెద్దగా పట్టించుకోలేదని అంటున్నారు. దీంతో గులాబీ పార్టీ అధిష్టానంతో పాటు..మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇంచార్జీలు కూడా లోకల్ బాడీ ఎన్నికలను లైట్ తీసుకున్నట్లే పార్టీలో చర్చ జరిగింది.
గ్రామాల్లో జోరుగా పంచాయతీ ఎన్నికల రాజకీయం నడుస్తోంటే ఎమ్మెల్యేలు, ఇంచార్జీలు ఏ మాత్రం పట్టించుకోకుండా హైదరాబాద్‌లో ఉన్నారని తెలంగాణ భవన్ వర్గాల్లోనే టాక్ వినిపించింది. అయితే అధిష్టానం నుంచి అండ లేకపోయినా, ఎమ్మెల్యేలు, ఇంచార్జీలు పట్టించుకోకపోయినా..లోకల్ బీఆర్ఎస్ లీడర్లు మాత్రం పట్టుబట్టి..ఎన్నికల్లో ఫైట్ చేశారు. దీని ఫలితమే మొదటి విడత ఎన్నికల్లో 1,168 సర్పంచ్‌లను గెలిచేలా చేసిందని చెబుతున్నారు.
ఏ మాత్రం ఊహించనట్లుగా ఫస్ట్ ఫేజ్ పంచాయతీ ఎన్నికల్లో 1,168 సర్పంచ్ స్థానాలను గెలవడంతో బీఆర్ఎస్ అధిష్టానం అలర్ట్ అయ్యిందట. సీరియస్‌గా తీసుకోకపోయినా ఇన్ని స్థానాల్లో గెలిచామంటే అదే ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే మరింత మెరుగ్గా రిజల్ట్స్ వచ్చేవని చర్చించుకుంటున్నారట. అందుకే సెకండ్, థర్డ్ ఫేజ్ పంచాయతీ ఎన్నికలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సీరియస్‌గా దృష్టి పెట్టారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మాజీ మంత్రులు, ఇంచార్జీలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన కేటీఆర్..మిగతా రెండు విడత ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్ధుల గెలుపుకు కృషి చేయాలని చెప్పినట్లు తెలుస్తోంది.
దీంతో వెంటనే జిల్లాల్లో ముఖ్యనేతలంతా రంగంలోకి దిగినట్లు తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ రెండు విడతల్లో మరిన్ని ఎక్కువ సర్పంచ్ స్థానాలను గెలుచుకునే పట్టుదలతో నేతలు పనిచేస్తున్నారట. కాస్త ఆలస్యంగా మేలుకున్న బీఆర్ఎస్‌కు సర్పంచ్ ఎన్నికల సమరం ముగిసే నాటికి ఎంతవరకు అనుకూల ఫలితాలు వస్తాయో చూడాలి మరి.