Kaushik Reddy Arrest: రాత్రంతా పోలీస్ స్టేష‌న్‌లోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి..

Kaushik Reddy Arrest: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు సోమవారం సాయంత్రం హైదరాబాద్ లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Kaushik Reddy in Karimnagar Three Town Police Station

Kaushik Reddy Arrest: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు సోమవారం సాయంత్రం హైదరాబాద్ లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 10టీవీ కార్యాలయంలో ఇంటర్వ్యూలో పాల్గొని బయటకు వచ్చిన వెంటనే ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్ ఏసీపీ నేతృత్వంలో దాదాపు 40 మంది పోలీసులు హైదరాబాద్ చేరుకొని నాటకీయ ఫక్కీలో కౌశిక్ రెడ్డిని అరెస్టు చేశారు. ప్రత్యేక వాహనంలో కరీంనగర్ కు తీసుకెళ్లారు. రాత్రి 10.35 గంటలకు కరీంనగర్ బైపాస్ రోడ్డులో ఉన్న పోలీస్ శిక్షణా కేంద్రానికి తీసుకెళ్లారు. రాత్రి 11.30 గంటల సమయంలో కౌశిక్ రెడ్డిని కరీంనగర్ త్రీటౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడే కౌశిక్ రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించారు.

Also Read: Mla Padi Kaushik Reddy : కౌశిక్ రెడ్డి అరెస్ట్.. కరీంనగర్ లో పోలీసుల భారీ బందోబస్తు.. ఎక్కడికక్కడ అరెస్టులు..

రాత్రంతా త్రీటౌన్ స్టేషన్ లోనే కౌశిక్ రెడ్డి ఉన్నారు. ఆయన కోసం పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా పరుపు తెప్పించారు. అయితే, లీగల్ టీం కూడా కౌశిక్ రెడ్డిని కలిసే అవకాశం కల్పించారు. బెయిలబుల్ సెక్షన్ల కిందనే కేసులు పెట్టడం జరిగిందని, కచ్చితంగా బెయిల్ వస్తుందనే అభిప్రాయాన్ని ఆయన లీగల్ టీం వ్యక్తంచేసినట్లు తెలిసింది. అయితే, ప్రస్తుతం పెట్టిన సెక్షన్లలో మార్పులు చేస్తే మాత్రం నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అర్థరాత్రి సమయంలోనే కౌశిక్ రెడ్డిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారని భావించారు. కానీ, పోలీసులు రాత్రంతా కౌశిక్ రెడ్డిని పోలీస్ స్టేషన్ లోనే ఉంచారు. మంగళవారం ఉదయాన్నే మరోసారి కౌశిక్ రెడ్డికి వైద్యులు వైద్య పరీక్షలు చేశారు. మరికొద్ది సేపట్లో మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయన రిమాండ్ ప్రాసెస్ ను పోలీసులు పూర్తిచేసినట్లు తెలిసింది.

Also Read: Aadi Srinivas : కౌశిక్ రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి- ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

ఇదిలాఉంటే.. కౌశిక్ రెడ్డి అరెస్టుతో బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌశిక్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ సోమవారం రాత్రి కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్దకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకొని ఆందోళనకు దిగారు. దీంతో ఆందోళన చేపట్టేందుకు వచ్చిన నాయకులను పోలీసులు అరెస్టు చేసి డీసీఎం వ్యాన్ లో కొత్తపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే, ఇవాళ కేటీఆర్, హరీశ్ రావులు కరీంనగర్ కు వెళ్లే అవకాశం ఉంది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతలను అరెస్టులు చేస్తున్నారు.

Also Read: బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టుపై హరీశ్ రావు ఫస్ట్ రియాక్షన్

కౌశిక్ రెడ్డి అరెస్టును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా ప్రభుత్వం తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ ట్వీట్ ప్రకారం.. ‘‘హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అక్రమంగా అరెస్టుచేయడం అత్యంత దుర్మార్గమైన చర్య. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి దిగజారుడు పనులకు దిగుతున్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను వెనకేసుకొచ్చి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఏకపక్షంగా అరెస్టుచేయడం పూర్తిగా అప్రజాస్వామికం. హుజూరాబాద్ నియోజకవర్గంలో రైతురుణమాఫీని ఎగ్గొట్టి, దళితబంధుకు పాతరేసిన కాంగ్రెస్ సర్కారును ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేకే ముఖ్యమంత్రి ఈ అణచివేత చర్యలకు దిగుతున్నారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన సీఎం రేవంత్ రెడ్డిపై చర్య తీసుకోవాల్సిందిపోయి ప్రజల పక్షాన ప్రశ్నించిన కౌశిక్ రెడ్డిపై కేసులు పెట్టడమే మీ ఇందిరమ్మ రాజ్యమా? పోరాటాలే ఊపిరిగా పుట్టిన గులాబీ పార్టీ నేతల ఆత్మస్థయిర్యాన్ని ఇలాంటి చిల్లర చేష్టలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ దెబ్బతీయలేదు. అక్రమంగా అరెస్టు చేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని వెంటనే భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం’’ అంటూ కేటీఆర్ ట్వీట్ లో పేర్కొన్నారు.