MLC Kavitha Suspension?: ఎమ్మెల్సీ కవితపై బీఆర్ఎస్ వేటు..? మరికొద్దిసేపట్లో అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్
MLC Kavitha : కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితపై సస్పెన్షన్ వేటు వేసేందుకు బీఆర్ఎస్ అధిష్టానం సిద్ధమైనట్లు తెలుస్తోంది.

MLC Kavitha
MLC Kavitha : కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితపై సస్పెన్షన్ వేటు వేసేందుకు బీఆర్ఎస్ అధిష్టానం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ నేతలు మరికొద్ది సేపట్లో అధికారిక ప్రకటన విడుదల చేస్తారని సమాచారం. కవితపై చర్యలు తీసుకోవాలని మెజార్టీ పార్టీ నేతలు సూచించినట్లు.. ఇదే సమయంలో బీఆర్ఎస్ శ్రేణుల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఆమెపై చర్యలు తీసుకునేందుకు పార్టీ అధిష్టానం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ విచారణ నివేదికను తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. సుదీర్ఘ చర్చ అనంతరం కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తూ తీర్మానించింది. ప్రభుత్వం నిర్ణయం తరువాత ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలోని కొందరు నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కాళేశ్వరంలో కేసీఆర్ కు అవినీతి మరక అంటడానికి హరీశ్ రావు, సంతోష్ రావులే కారణమంటూ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత వ్యాఖ్యలను బీఆర్ఎస్ లోని పలువురు నేతలు తప్పుబట్టారు.
హరీశ్ రావు, సంతోష్ రావులపై కవిత వ్యాఖ్యల అనంతరం కేటీఆర్, పలువురు బీఆర్ఎస్ నేతలు కేసీఆర్తో భేటీ అయినట్లు తెలిసింది. కవిత వ్యాఖ్యలపై పలువురు సీనియర్లతోపాటు పార్టీ శ్రేణులు గుర్రుగా ఉన్నారని, కవితపై చర్యలు తీసుకోకుంటే పార్టీకి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుందని వారు కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
బీఆర్ఎస్ పార్టీలోని ముఖ్యనేతలు, జిల్లా, మండల స్థాయి నేతల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్న అనంతరం కవితపై చర్యలు తీసుకునేందుకు బీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయించినట్లు పార్టీలో చర్చ జరుగుతుంది. అయితే, కవిత వ్యాఖ్యలకు గాను షోకాజ్ నోటీసులు ఇస్తారా..? లేదంటే పార్టీ నుంచే సస్పెండ్ చేస్తారా..? చర్యలు ఎలా ఉండబోతున్నాయనే అంశంపై తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది.
బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య జరుగుతున్న చర్చల ప్రకారం.. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని, పార్టీలోని మహిళా నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారని చెబుతున్నారు.