Ponguleti and Jupalli
BRS Suspends Ponguleti: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao), మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy)లపై బీఆర్ఎస్ పార్టీ (BRS Party) అధిష్టానం సస్పెన్షన్ (Suspension) వేటు వేసింది. పార్టీ వ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఇద్దరిపై వేటు వేసింది. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది. కొద్దికాలంగా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు వీరిద్దరు దూరంగా ఉంటున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గత నెలరోజులుగా బీఆర్ఎస్ అధిష్టానం, సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్న విషయం విధితమే. ఖమ్మం, భద్రాచలం జిల్లాల్లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు పొంగులేటి స్పష్టం చేశారు. అయితే, ఆయన ఏ పార్టీలో చేరుతారనేది స్పష్టత రాలేదు.
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుది నాగర్‍కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం. గత అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీచేసిన జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యాడు. ఆ తరువాత కాలంలో హర్షవర్ధన్ రెడ్డిసైతం బీఆర్ఎస్‌లో చేరారు. దీంతో నియోజకవర్గంలో ఇరు నేతల వర్గీయుల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. ఈ క్రమంలో జూపల్లి బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిసైతం కొంతకాలంగా జిల్లాలో నెలకొన్న వర్గ విబేధాలతో పార్టీకి దూరంగా ఉంటూ, తన సొంత ఎజెండాతో ఖమ్మం ఉమ్మడి జిల్లాలో తన వర్గీయులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్నారు.
కొత్తగూడెం నియోజకవర్గంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన మద్దతుదారులతో ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనంకు జూపల్లి కృష్ణారావుకూడా పాల్గొన్నారు. అంతేకాదు. ఇద్దరు నేతలు ఏకదాటిగా ప్రభుత్వంపైన, సీఎం కేసీఆర్ పైన విమర్శల దాడి చేశారు. అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో, బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల సహకారంతో సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన కొనసాగుతోందని పొంగులేటి విమర్శించారు. ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో అసంతృప్తి నెలకొందని, కేసీఆర్ పాలన గాడితప్పిందంటూ విమర్శలు చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో సీఎం లెస్ టెండర్ల మాయాజాలం ప్రదర్శిస్తూ రూ. వేల కోట్లు దోచుకుంటున్నారని, మరోసారి కేసీఆర్ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదంటూ జూపల్లి విమర్శించారు.
Ponguleti Srinivasa Reddy: పార్టీ ఏదైనా సరే.. సీఎం కేసీఆర్‌ను గద్దె దించుతాం
కొత్తగూడెం సభలో జూపల్లి, పొంగులేటి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వారిద్దరూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పేర్కొంటూ వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కేంద్ర పార్టీ కార్యాలయం లేఖను విడుదల చేసింది.