Jupally Krishna Rao : కాపలాగా ఉంటానని చెప్పిన వ్యక్తి దోచుకుంటున్నాడు, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాడు-జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు
Jupally Krishna Rao : బీఆర్ఎస్ భారతదేశానికి ఎందులో ఆదర్శమో చెప్పాలి. హైదరబాద్ ధర్నా చౌక్ ను ఎత్తేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు.

Jupally Krishna Rao
Jupally Krishna Rao : తెలంగాణ రాష్ట్రానికి కాపలాగా ఉంటానని చెప్పిన వ్యక్తి నేడు దోచుకుంటున్నాడని మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా కొత్తగూడంలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు హాట్ కామెంట్స్ చేశారు. జై తెలంగాణ నినాదంతో తన ప్రసంగాన్ని ప్రారంభించారు జూపల్లి. తెలంగాణలో ప్రజాస్వామ్యం పరిడవిల్లడం లేదన్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై ఎవరు వచ్చినా బాగా రిసీవ్ చేసుకునే వారని, ఇప్పుడా పరిస్థితి లేదని జూపల్లి అన్నారు. తిండి లేకున్నా ఉండొచ్చు కానీ ఆత్మగౌరవం లేని చోట ఉండలేము అన్నారు. తొలి-మలి దశ తెలంగాణ ఉద్యమ బలిదానాలతోనే తెలంగాణ ఏర్పాటైందన్నారు. బలిదానాల పునాదులపై ఏర్పడ్డ తెలంగాణ లక్ష్యం నెరవేరడం లేదన్నారు. ముఖ్యమంత్రి అంటే ట్రస్టీ అనే విషయాన్ని మరిచిపోయి నాది అనే ధోరణితో వ్యవహరిస్తున్నారు అని మండిపడ్డారు.
”కుల, మతాలకు అతీతంగా యావత్తు తెలంగాణ సంఘటితం అయితేనే తెలంగాణ ఏర్పడింది. ఏది చదివినా నిజాయితీ అనేది ఉండాలి. తెలంగాణలో ఉద్యమకారులను అణచివేసే, అవమానించే కార్యక్రమం నడుస్తుంది. 12 మంది MLA లను అప్రజాస్వామికంగా చేర్చుకొని 1986లో 5 లక్షల కాంట్రాక్టుకు 26 కోట్ల రూపాయలను కాంట్రాక్టర్ కు చెల్లించారు. అంబేద్కర్ స్పూర్తికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు.
కావలి కుక్కగా ఉంటానని చెప్పిన వ్యక్తి దోచుకుంటున్నాడు. ప్రాంతం వాడే దోచుకుంటే పొలిమేర దాటే వరకు తరుముతామని చెప్పిన మాటను మరిచారు. గ్రామ సర్పంచులకు బిల్లులు చెల్లించడంలో జాప్యం చేస్తున్నారు. బీఆర్ఎస్ భారతదేశానికి ఎందులో ఆదర్శమో చెప్పాలి. హైదరబాద్ ధర్నా చౌక్ ను ఎత్తేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసారు. సర్పంచ్ లను హింసిస్తున్నారు. మూడున్నర సంవత్సరాల ముందు నా పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొన్నా.
సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు, తెలంగాణ మంత్రులు పదవి లేకుండా ఉండలేరని విమర్శిస్తే రాజీనామా చేశాను. సమైక్యవాది కిరణ్ కుమార్ రెడ్డిని వ్యతిరేకించి బయటికి వచ్చాను. వెయ్యి కోట్లు పెట్టినా కొనలేవని చెప్పి బయటకు వచ్చాను. 2011లో రాజీనామా చేసి యావత్తు జిల్లాలో పాదయాత్ర చేసి గెలిచాను. 2018 లో టీఆర్ఎస్ కు 13 స్థానాలు గెలిపించాను. పోలీసుల వేధింపుల వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరితే వినే పరిస్థితి లేదు. ప్రగతి భవనం నుంచి జీరో యాక్షన్ ఉంది.
Also Read..Jupalli Krishna Rao : బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి : జూపల్లి కృష్ణారావు
తెలంగాణలో ప్రతిపక్ష నాయకులకు కూడా కలిసే అవకాశం లేదు. ప్రభుత్వ ఖజానా, ఆస్తిని ఇష్టమొచ్చినట్లు ఖర్చు పెడుతున్నారు. మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రం, ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయింది. టెండర్ల ద్వారా కాంట్రాక్టర్ల నుంచి దోచుకున్నారు. గడిచిన పదేళ్ల నుంచి దోచుకుంటున్నారు. 1600 ఎకరాలు ఉన్న వ్యక్తికి ఆర్డీవో, జాయింట్ కలెక్టర్ కలిసి ధరణిలో ఎక్కించారు. పేపర్ లీకేజీ అంశంలో ప్రభుత్వం బాధ్యత వహించాలి. దళితబంధు అంశంలో ప్రజలను మభ్య పెట్టడం సరైనది కాదు” అని మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.