KTR: తెలంగాణలోని అన్నదాతలకు కేటీఆర్ బహిరంగ లేఖ

నిన్న ఎన్నికల్లో చెప్పిన మాటలేంటి.. ఇప్పుడు చేస్తున్న మాయలేంటని మంత్రులను ఎమ్మెల్యేలను నిగ్గదీసి ప్రశ్నించాలని కేటీఆర్ అన్నారు.

KTR: తెలంగాణలోని అన్నదాతలకు కేటీఆర్ బహిరంగ లేఖ

Updated On : December 22, 2024 / 5:29 PM IST

రైతన్నలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. రైతు భరోసా అంశాన్ని ఆయన లేఖలో ప్రస్తావించారు. ఎగవేతల మోసాన్ని ఎదిరించాలని, ఆంక్షలు.. కోతలతో సగం మందికి ఎగనామం పెట్టే ఎత్తులను చిత్తుచేయాలని అన్నారు.

“వాస్తవాలను కప్పిపుచ్చి.. రైతుబంధు మీద తప్పుడు ప్రచారం అందుకున్నారు. పంట పెట్టుబడి రైతు హక్కు.. భిక్ష కాదు. రైతుకు ఏమిచ్చినా ఎంతిచ్చినా తక్కువే. విత్తు వేసిన నాటి నుంచి పంట అమ్మేదాకా ఎన్ని గండాలో రైతుకు. రాష్ట్రంలో 47 శాతం మందికి ఉపాధినిచ్చే పెద్ద పరిశ్రమ వ్యవసాయం

రెతులు రైతు కూలీల బతుకుదెరువు బాగుండాలంటే వ్యవసాయానికి సబ్సిడీ ఇవ్వాల్సిందే కదా! రైతన్నకు ఇచ్చే సాయాన్ని దానధర్మంగా చూడొద్దు.. భారంగా చూడొద్దు బాధ్యతగా చూడాలి. సీఎం రేవంత్ రెడ్డి.. నాడు ప్రతిపక్షంలో వున్నప్పుడు 22 లక్షల మంది కౌలు రైతులకు పెట్టుబడి పైసలు గ్యారెంటీ ఇస్తామని బహిరంగ లేఖ రాసాడు! అసలు రైతుతో పాటు.. కౌలు తీసుకున్న రైతుకు కూడా ఎకరానికి 15వేలు తప్పకుండా ఇస్తామని హామీ ఇచ్చారు!

ఆ 22 లక్షల మంది కౌలు రైతులు కళ్లల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్నారు రైతు భరోసా కోసం..! సంక్రాంతి తర్వాత వేసే రైతు భరోసా కౌలు రైతులకు పడుతుందో లేదా అని అడిగితే సర్కారు నుంచి సమాధానం లేదు! చైతన్యవంతమైన తెలంగాణ రైతాంగం కాంగ్రెస్ సర్కారు ఎత్తులను నక్కజిత్తులను తిప్పికొట్టాలి!

నిన్న ఎన్నికల్లో చెప్పిన మాటలేంటి.. ఇప్పుడు చేస్తున్న మాయలేంటని మంత్రులను ఎమ్మెల్యేలను నిగ్గదీసి ప్రశ్నించాలి! రైతుల ఆకాంక్ష ఏంటో.. అభిప్రాయం ఏంటో తెలిసేలా సెగ పుట్టించాలి! మౌనంగా వుంటే దగా పడతాం..! నోరు విప్పకుంటే అన్యాయమైపోతాం..! సాధించుకున్న పెట్టుబడి హక్కు గంగలో కలిసిపోతుంది.

మీతో కలిసి మేము నడుస్తాం..! మీ ఆందోళనకు అండగా వుంటాం..! నమ్మించి నట్టేట ముంచే వంచన చేయడానికి చూస్తున్న కాంగ్రెస్ ను పల్లెల్లో దంచికొడదాం..! కొట్లాట మనకు కొత్తగాదు, బీఆర్ ఎస్ అంటే.. భారత రైతు సమితి..! రైతుకు కేసీఆర్ సర్కారు ఇచ్చిన రక్షణ కవచాలను కాంగ్రెస్ ప్రభుత్వం కబళిస్తుంటే చూస్తూ వూరుకోం..” అని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.

Mahesh Kumar Goud : పేద మహిళ చనిపోతే లేని బాధ సినిమా రంగంపై ఎందుకు? బండి సంజయ్ పై మహేశ్ కుమార్ గౌడ్ ఫైర్