Mahesh Kumar Goud : పేద మహిళ చనిపోతే లేని బాధ సినిమా రంగంపై ఎందుకు? బండి సంజయ్ పై మహేశ్ కుమార్ గౌడ్ ఫైర్
ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకే ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని ఎదురుదాడికి దిగారు మహేశ్ కుమార్ గౌడ్.

Mahesh Kumar Goud (Photo Credit : Facebook)
Mahesh Kumar Goud : అల్లు అర్జున్ వ్యవహారంలో రేవంత్ సర్కార్ పై విమర్శలు గుప్పించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ పై ఫైర్ అయ్యారు టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్. అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని.. తెలుగు సినిమా ఇండస్ట్రీపై పగబట్టినట్లుగా రేవంత్ తీరు ఉందని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు మహేశ్ కుమార్ గౌడ్.
అల్లు అర్జున్ వ్యవహారంలో అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన వివరణ సమంజసం అన్నారాయన. పేద మహిళ చనిపోతే లేని బాధ సినిమా రంగంపై ఎందుకు? అని బండి సంజయ్ కి సూటి ప్రశ్న వేశారాయన. సినీ పరిశ్రమపై మాకు కూడా ప్రేమ ఉంది.. కానీ ప్రజల ప్రాణాలే ముఖ్యం అని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకే ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని ఎదురుదాడికి దిగారు మహేశ్ కుమార్ గౌడ్.
చిత్ర పరిశ్రమ అంటే కాంగ్రెస్ పార్టీకి అభిమానం ఉందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సినీ వర్గం నుంచి చిరంజీవికి కేంద్రమంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని ఆయన గుర్తు చేశారు. సినీ ఇండస్ట్రీ మద్రాస్ నుంచి హైదరాబాద్ రావడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. మాకు ఏ వ్యక్తులపై ద్వేషాలు ఉండవని, ప్రభుత్వానికి అందరూ సమానమే అని తేల్చి చెప్పారు. రాష్ట్రాన్ని యధేచ్చగా దోచుకున్న కుటుంబం కేసీఆర్ కుటుంబం అని విరుచుకుపడ్డారు. ఫార్ములా ఈ రేసింగ్ లో అడ్డంగా దొరికిపోయిన నేత కేటీఆర్ అని ధ్వజమెత్తారు. మొన్నటివరకు జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పిన కేటీఆర్.. ఇపుడు కోర్టును ఆశ్రయిస్తున్నాడని విమర్శించారు.
Also Read : పుష్ప సినిమాకు సబ్సిడీ ఇచ్చిన ప్రభుత్వమే తొలి ముద్దాయి- సీపీఐ నారాయణ