Bharat Yadava Samithi
Governor Tamilisai : దేవుళ్ల రూపంలో ఉన్న మానవ విగ్రహాలను తొలగించాలని భారత యాదవ సమితి (BYS) నేతలు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కోరారు. ఈ మేరకు గురువారం గవర్నర్ కార్యాలయంలో ఆమెను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీవైఎస్ నేతలు మాట్లాడుతూ.. దేవుళ్ల రూపంలో ఉన్న మాన విగ్రహాలను తొలగించేలా దేశవ్యాప్తంగా ప్రత్యేక చట్టం తీసుకువచ్చేలా కృషి చేయాలని కోరారు. ఖమ్మంలో కృష్ణుని రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయకుండా నిలువరించాలని, ఫిలింనగర్ ఫిలిం ఛాంబర్ దగ్గర శ్రీకృష్ణుని రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించాలని గవర్నర్‌ను బీవైఎస్ నేతలు కోరారు.
Khammam NTR idol : ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు బ్రేక్.. హైకోర్టు అనుమతి నిరాకరణ
గవర్నర్‌ను కలిసిన వారిలో భారత యాదవ సమితి రాష్ట్ర అధ్యక్షులు దాసరి నాగేష్ యాదవ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్ది రమేష్ యాదవ్, లీగల్ అడ్వైజర్ బోర్రాజు శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర నాయకులు తోకల శ్రీనివాస్ యాదవ్‌లు ఉన్నారు. వీరి వినతికి గవర్నర్ తమిళిసై సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. ఇదిలాఉంటే ఖమ్మం జిల్లా కేంద్రంలోని లకారం ట్యాంక్‌బండ్ వద్ద శ్రీకృష్ణుడి రూపంలోఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరిగాయి. అయితే, ఈ విగ్రహం శ్రీకృష్ణుడి రూపంలో ఉండటంతో పలు యాదవ సంఘాల సభ్యులు, పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆదిభట్ల శ్రీకళాపీఠం, భారత యాదవ సమితి కోర్టుకు వెళ్లారు.
Khammam NTR Statue : ఖమ్మంలో శ్రీ కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్ టీఆర్ విగ్రహంలో మార్పులు
శ్రీ కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్‌టీఆర్ విగ్రహంలో మార్పులు చేయాలని తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అంతేకాక, తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టొద్దని స్టే ఇచ్చింది. దీంతో నీలిమేఘ శ్యాముడుగా ఉన్న శ్రీ కృష్ణుడి విగ్రహానికి నిర్వాహకులు కలర్ మార్చి గోల్డ్ కలర్ వేశారు. అలాగే విగ్రహంలోని కిరీటంలో ఉన్న నెమలి పించం, కిరీటం వెనుక భాగంలోఉన్న విష్ణు చక్రం, పిల్లన గ్రోవీలను తొలగించారు. కోర్టు, యాదవ సంఘాల అభ్యంతరాలను గౌరవిస్తూ ఎన్‌టీఆర్ విగ్రహంలో మార్పులు చేయడం జరిగిందని గతంలో నిర్వాహకులు పేర్కొన్నారు.
లకారం ట్యాంక్‌బండ్‌పై ఉన్న ఈ విగ్రహావిష్కరణ గతనెల 28న ఎన్టీఆర్ 100వ జయంతి సందర్భంగా జరగాల్సి ఉంది. కానీ, విగ్రహ ప్రారంభ కార్యక్రమం వాయిదా పడిన విషయం విధితమే. అయితే, తాజాగా గవర్నర్‌ను భారత యాదవ సమితి నేతలు కలవడం, ఫలింనగర్ ఛాంబర్ దగ్గర ఉన్న శ్రీకృష్ణుని రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించాలని కోరుతూ గవర్నర్‌కు బీవైఎస్ నేతలు వినతిపత్రం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.