candidate affidavit for elections rules and other details in telugu
Candidate Affidavit : ఎన్నికల్లో టిక్కెట్ రావడం, నామినేషన్ వేయడం ఎంత ముఖ్యమో.. అఫిడవిట్ అంతకంటే ఇంపార్టెంట్. నామినేషన్ సందర్భంగా సమర్పించే అఫిడవిట్ విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా చిక్కులు తప్పవు. అందులో రాసే ప్రతి అక్షరం, పొందుపర్చే ప్రతి విషయం అభ్యర్థిని నీడలా వెంటాడుతుంటాయి. ఎలాంటి పొరపాటు జరిగినా ఎన్నిక రద్దవడమే కాదు.. ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా వీలుండదని హెచ్చరిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం.
తాము ఎన్నుకోబోయే అభ్యర్థికి సంబంధించిన అన్ని వివరాలను తెలుసుకోవడం ఓటర్ల హక్కు. అందుకే పోటీ చేసే అభ్యర్థులు తమ ఆస్తులు, అప్పులు, తమపై ఉన్న కేసుల వివరాలను ఎన్నికల అధికారికి ఇవ్వడంతో పాటు మీడియా ద్వారా ప్రజలకు తెలపాలన్నది ఈసీ నిబంధన. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు ఎమ్మెల్యేలుగా గెలిచినప్పటికీ, అఫిడవిట్లలో చేసిన కొన్ని పొరపాట్ల కారణంగా కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. దీంతో ఈ సారి అలాంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడాలని భావిస్తున్నారు పోటీలో నిలుస్తున్న అభ్యర్థులు.
పత్రికలు, ఛానల్స్‌లో స్పష్టంగా కనిపించేలా..
అఫిడవిట్ల విషయంలో కఠిన నిబంధనలు విధించిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఏ ఒక్క కాలమ్‌ను కూడా ఖాళీగా ఉంచవద్దని స్పష్టం చేసింది. అభ్యర్థులు తమపై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను ప్రజలకు కచ్చితంగా తెలపాలన్న నిబంధనలను 2013 నుంచి అమల్లోకి తెచ్చింది ఈసీ. నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు తమపై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలపై ప్రముఖ పత్రికలు, ఛానల్స్‌లో స్పష్టంగా కనిపించేలా మూడు సార్లు ప్రకటనలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది కూడా నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచి పోలింగ్‌కు రెండు రోజులలోపు పూర్తి చేయాలి. ఉద్దేశపూర్వంగా ఏవైనా వివరాలు దాచిపెడితే.. ప్రజాప్రతినిధ్య చట్టం 1951 ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హతకు గురవుతారు.
Also Read: తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకపోతే ప్రత్యామ్నాయమేంటి?
అధికారులు చెక్ చేయాలి
అటు అభ్యర్థులే కాదు.. అఫిడవిట్‌లో అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయా, లేదా? అన్న విషయాలు అధికారులు కూడా చెక్ చేసుకోవాలని ఆదేశించింది ఈసీ. లేకపోతే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. చాలా రాష్ట్రాల్లో అఫిడవిట్ల విషయంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కేసులు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే నామినేషన్ల పరిశీలనలో ఎక్కువ సమయం అఫిడవిట్లకే కేటాయిస్తారు అధికారులు.
Also Read: కాంగ్రెస్ నేత, ఎన్నారై ఝాన్సీ రెడ్డికి షాక్.. భారత పౌరసత్వం నిరాకరణ
అఫిడవిట్‌తో పాటు ఎన్నికల ప్రచారం సందర్భంగా చేసే ఖర్చుల విషయంలోనూ అభ్యర్థులు చాలా జాగ్రత్తగా ఉండాలని ఈసీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రధాన పార్టీల అభ్యర్థులంతా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండేందుకు ఇద్దరు, ముగ్గురు నిపుణులతో కూడిన స్పెషల్ టీమ్స్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు.