TTDP: తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకపోతే ప్రత్యామ్నాయమేంటి?

తెలంగాణలో ఓ వెలుగు వెలిగిన టీడీపీలో అసలు ఎన్నికల వాతావరణమే కనిపించడం లేదు. పోటీకి పార్టీ అధినేత గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? నో అంటారా?

TTDP: తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకపోతే ప్రత్యామ్నాయమేంటి?

telangana assembly elections 2023 telugu desam party yet to decide contest

Telugu Desam Party: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామా.. లేదా? పోటీకి పార్టీ అధినేత గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? నో అంటారా? ఎన్నికల్లో పోటీ చేయకపోతే ప్రత్యామ్నాయమేంటి? పార్టీకి గుడ్ బై చెప్పేయడమే మార్గమా? తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ను వేధిస్తున్న ప్రశ్నలివే. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి చంద్రబాబు నో చెబితే ఇక టీడీపీని వీడి.. మరో పార్టీలో చేరేందుకు కాసాని రంగం సిద్ధం చేసుకుంటున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

నెల రోజుల్లో తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. వారం రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవ్వనుంది. అధికార బీఆర్ఎస్ దాదాపు అన్ని నియోజకవర్గాల అభ్యర్ధులను ప్రకటించగా, కాంగ్రెస్, బీజేపీ మొదటి జాబితాను విడుదల చేశాయి. ఒకటి రెండు రోజుల్లో మిగిలిన అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేయనున్నాయి. ఇక చిన్నాచితకా పార్టీల్లోనూ ఎన్నికల హడావుడి కనిపిస్తోంది.. కానీ తెలంగాణలో ఓ వెలుగు వెలిగిన టీడీపీలో అసలు ఎన్నికల వాతావరణమే కనిపించడం లేదు.

అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని గతంలో ప్రకటించారు టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్. ఆయన స్వయంగా 30 మంది అభ్యర్ధుల జాబితాను రెడీ చేసి.. వారిని పోటీకి పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. మరో 63 నియోజకవర్గాల అభ్యర్థులపైనా చర్చించి.. ఆ జాబితాపై అధినేత చంద్రబాబు ఆమోదం తీసుకోవాలని చూస్తున్నారు. కానీ, బాబు జైల్లో ఉండటం.. ఆయన అనారోగ్యం కారణంగా కాసానితో ములాఖత్ కూడా కుదరడం లేదు. చంద్రబాబు ఆర్డర్ లేకుండా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోలేక తీవ్ర తర్జనభర్జన పడుతున్నారు కాసాని..

అయోమయంలో క్యాడర్
తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తామని కాసానితోపాటు చంద్రబాబు కూడా గతంలో ప్రకటించారు. కానీ, ఎన్నికల షెడ్యూల్‌కు నెల రోజుల ముందు అనూహ్యంగా జైలుకు వెళ్లారు చంద్రబాబు. ఆ తర్వాత తెలంగాణ ఎన్నికలపై బాలకృష్ణకు బాధ్యతలు అప్పగించారు. బాలయ్య కూడా తెలంగాణ ఎన్నికల బాధ్యతలను తాను తీసుకుంటానని.. తెలంగాణలో పార్టీని ముందుండి నడిపిస్తానని ప్రకటించారు. ప్రతిరోజు ఎన్టీఆర్ భవన్‌కి వస్తానని చెప్పారు.. కానీ ఎన్నికల్లో పోటీపైనే క్లారిటీ లేకపోవడంతో క్యాడర్ అయోమయాన్ని ఎదుర్కొంటోంది. తెలంగాణవ్యాప్తంగా కాకపోయినా.. టీడీపీకి పట్టున్న నియోజకవర్గాల్లోనైనా పోటీ చేయాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.

టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ స్వయంగా కుత్బుల్లాపూర్ నుంచి.. ఆయన తనయుడు పరిగి నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే టీడీపీ సానుభూతి ఓటర్లు ఎక్కువగా ఉండే నియోజకవర్గాలు ఓ పది పదిహేను వరకు ఉంటాయి. ఆయా నియోజకవర్గాల్లోనైనా పోటీ చేసి సత్తా చాటాలని కోరుకుంటోంది క్యాడర్. కానీ.. అధినేత అందుబాటులో లేకపోవడం, ప్రచారం.. ఇతర ఎన్నికల ఏర్పాట్లపై స్పష్టత లేకపోవడంతో పోటీకి దూరంగా ఉండటమే మేలని పార్టీలోని ఓ వర్గం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Also Read: ఎన్నికల్లో వైఎస్ఆర్ టీపీకి బైనాక్యులర్ గుర్తు.. మరో గుర్తు కేటాయించాలని ఈసీకి విజ్ఞప్తి

అభ్యర్ధుల ఎంపిక, పొత్తులు, మ్యానిఫెస్టో వంటి అంశాలన్నింటిపైనా చంద్రబాబే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అభ్యర్ధులకు కాసాని బీఫామ్ ఇవ్వాలంటే.. ముందు ఆయనకు చంద్రబాబు ఏ ఫామ్ ఇవ్వాల్సిఉంటుంది. కానీ చంద్రబాబు జైల్లో ఉండటం.. ఆయనతో ములాఖత్‌కు కుదరడం లేదని చెబుతున్నారు. చంద్రబాబుకు పరిమిత ములాఖత్‌లనే అనుమతిస్తున్నారు. ఈ ములాఖత్‌ల్లో న్యాయవాదులు, కుటుంబ సభ్యులు.. ఇంకా అత్యవసరమైతే ఏపీ నాయకులే కలుస్తున్నారు. టీటీడీపీ అధ్యక్షుడు కాసానికి మాత్రం బాబుతో ములాఖత్ చాన్స్ రావడం లేదు. ఇక చంద్రబాబు అనారోగ్య కారణాలతో ఎన్నికలకు ముందు విడుదలైనా ప్రచారం చేసే పరిస్థితి లేకపోవడంతో పోటీకి దూరంగా ఉండటమే మేలన్న వాదన క్రమంగా విస్తరిస్తోంది.

చంద్రబాబు నిర్ణయమే ఫైనల్
ఐతే ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. అధినేత చంద్రబాబు నిర్ణయమే ఫైనల్.. దీంతో చంద్రబాబు ఏమంటారన్న ఆంశంపైనే ఉత్కంఠ పెరుగుతోంది. బాబుతో ములాఖత్ కోసం కాసాని గురువారం రోజంతా వేచిచూశారు. కానీ, ఆయనకు అవకాశం దక్కలేదు. ఈ పరిస్థితుల్లో తన రాజకీయ భవితవ్యంపైనా నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్యతను ఎదుర్కొంటున్నారు కాసాని. ఈ ఎన్నికలకు దూరంగా ఉంటే.. తన వయసు.. ఆరోగ్యం దృష్ట్యా వచ్చే ఎన్నికల వరకు వేచిచూడాల్సిరావడం కష్టమని.. కుమారుడికి తన రాజకీయ వారసత్వం ఇవ్వాలంటే ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయడంతోపాటు తన కుమారుడిని ఎమ్మెల్యే చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు కాసాని. ఈ పరిస్థితుల్లో తన ముందున్న అనేక ప్రత్యామ్నాయాలు పరిశీలిస్తున్నారు కాసాని.. అందులో పార్టీకి గుడ్‌బై చెప్పి.. ఇతర పార్టీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేయడమన్న ప్రతిపాదన ఉండటంతో తెలంగాణ టీడీపీలో కలకలం రేగుతోంది.