డ్రైవింగ్ చేస్తుండగా హార్ట్ ఎటాక్.. కాల్వలోకి దూసుకెళ్లిన కారు..

వరంగల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సెలవురోజుల్లో సొంతూరిలో సరదాగా గడుపుదామనుకున్న వారిని మృత్యువు కబళించింది.

డ్రైవింగ్ చేస్తుండగా హార్ట్ ఎటాక్.. కాల్వలోకి దూసుకెళ్లిన కారు..

Car Accident

Updated On : March 9, 2025 / 7:04 AM IST

SRSP Canal Accident : వరంగల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సెలవురోజుల్లో సొంతూరిలో సరదాగా గడుపుదామనుకున్న వారిని మృత్యువు కబళించింది. డ్రైవింగ్ చేస్తుండగా గుండెపోటు రావడంతో కారు ఎస్సారెస్పీ కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఇద్దరు పిల్లలు సహా తండ్రి చనిపోగా.. తల్లిని స్థానికులు కాపాడారు.

 

వరంగల్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లికి చెందిన సోమారపు ప్రవీణ్ (35) హైదరాబాద్ లో ఉంటూ ఎల్ఐసీలో మేనేజర్ గా పనిచేస్తున్నారు. శని, ఆదివారాలు సెలవులు రావడంతో సరదాగా గడుపుదామని కారులో భార్య కృష్ణవేణి, కూతురు చైత్రసాయి (5), కుమారుడు సాయివర్ధన్ (2)తో కలిసి సొంతఊరికి బయలుదేరాడు. వరంగల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లి వద్ద కారు ప్రమాదానికి గురైంది.

 

తీగరాజుపల్లి జంక్షన్ నుంచి పర్వతగిరి వైపు కెనాల్ మీదుగా వెళ్తుండగా ప్రవీణ్ కు గుండెనొప్పి వచ్చింది. ఈ విషయాన్ని భార్యకు చెప్పడంతో గ్రామానికి కాకుండా హాస్పిటల్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ప్రవీణ్ నొప్పితోనే కారును వెనక్కి తిప్పేందుకు ప్రయత్నిస్తుండగా.. అదుపుతప్పి కారు ఎస్సారెస్పీ కెనాల్ లోకి దూసుకెళ్లింది. చివరి నిమిషంలో కారు డోరు తెరుచుకోవడంతో ప్రవీణ్ భార్య కృష్ణవేణి ప్రాణాలతో బయటపడింది.

 

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి వారిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అధికారులకు సమాచారం ఇవ్వగా వారు అక్కడకు చేరుకొని ఎస్ఆర్ఎస్పీ కాలువలోనుంచి ప్రమాదానికి గురైన కారును జేసీబీ సహాయంతో బయటకు తీశారు. కారు డోర్స్ లాక్ అవడంతో తండ్రి, కూతురు బయటికి రాలేక పోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. లెఫ్ట్ సైడ్ కారు డోర్ ఓపెన్ కావడంతో కృష్ణవేణిని స్థానిక రైతులు బయటకు లాగారు. దీంతో ఆమె సురక్షితంగా బయటపడింది. ఈ ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి 100 మీటర్ల దూరంలో కారును గుర్తించారు. కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో వారి స్వగ్రామం మేచరాజుపల్లిలో విషాదఛాయలు అలముకున్నాయి.