Hyderabad 50% on HRA : హైదరాబాద్ వేతన జీవులకు భారీ ఊరట.. ఇకపై వారికి కూడా 50 శాతం HRA మినహాయింపు
Hyderabad 50% on HRA : హైదరాబాద్ వేతన జీవులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఇకపై వారికి కూడా 50 శాతం HRA మినహాయింపు లభించనుంది.
Central Board of Direct Taxes (CBDT) Income Tax Rules 2026 expanded the eligibility for a 50 pc HRA exemption to additional cities
Hyderabad 50% on HRA : హైదరాబాద్లో ఉంటున్న వేతన జీవులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ) కింద ఉద్యోగి మూల వేతనంలో 50 శాతం మినహాయింపు పొందే నగరాల జాబితాలో ఇప్పుడు హైదరాబాద్ కూడా చేరింది. కేంద్రం నిర్ణయంతో నగరంలోని వేతన జీవులకు భారీ ఊరట లభించబోతోంది. గతంలో 50 శాతం ఇంటి అద్దె భత్యం పొందే నగరాలు దేశవ్యాప్తంగా 4 మాత్రమే ఉండగా.. తాజాగా కేంద్రం వీటి సంఖ్యను 8కి పెంచింది.
ఇంటి అద్దె భత్యం కింద 50 శాతం మినహాయింపు పొందే నగరాలు చెన్నై, ముంబై, ఢిల్లీ, కోల్కతా మాత్రమే ఉండేవి. అయితే కొత్త నిబంధనల తర్వాత ఈ మినహాయింపు హైదరాబాద్, బెంగళూరు, పుణె, అహ్మదాబాద్ నగరాలకు కూడా వర్తింపజేయనున్నారు. ఇవి కాక మిగతా నగరాలు, పట్టణాల్లో నివసించే వారికి 40 శాతం పరిమితి కొనసాగుతుందని కేంద్రం తెలిపింది. అయితే ఉద్యోగులు ఈ పన్ను మినహాయింపులు పొందాలంటే అద్దెకు ఉంటున్న వారు.. ఇంటి యజమాని మధ్య ఉన్న అద్దె ఒప్పందం (రెంటల్ అగ్రిమెంట్) వివరాలను తప్పనిసరిగా వెల్లడించాల్సి ఉంటుంది. ఇక్కడ మరో ముఖ్యమైన అంశం ఏంటంటే.. కొత్త పన్ను విధానంలో ఉన్న వారికి హెచ్ఆర్ఏ మినహాయింపు ఉండదు. కేవలం పాత పన్ను విధానంలో ఐటీ రిటర్నులు దాఖలు చేసే వారికి మాత్రమే హెచ్ఆర్ఏ 50 శాతం మినహాయింపు వర్తిస్తుంది.
60 ఏళ్లుగా అమల్లో ఉన్న పాత పన్ను చట్టం-1961 స్థానంలో తీసుకొచ్చిన కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025 అమలుకు సమయం ఆసన్నమైంది. దీనికోసం కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) శుక్రవారం ఆదాయపు పన్ను నిబంధనలు-2026ను నోటిఫై చేసింది. 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనల ద్వారా వేతన జీవులు, సామాన్య పన్ను చెల్లింపుదారులకు కేంద్రం భారీ ఊరట కల్పించింది.
