ఓర్నీ తెలంగాణలో ఓ వ్యక్తి ఏకంగా చీటింగ్ కోసం బ్యాంకే పెట్టేశాడు.. 330 బ్రాంచులు కూడా.. మైండ్ బ్లాంక్ అయ్యే స్కామ్..
రాష్ట్రస్థాయి పత్రికల్లో ప్రకటనలు ఇస్తూ 2,000 "గవర్నమెంట్ మార్కెటింగ్ సూపర్వైజర్" పోస్టులు ఉన్నాయని ప్రచారం చేశారు. అభ్యర్థుల నుంచి ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకుని, షేర్ క్యాపిటల్, ఇన్వెస్ట్‌మెంట్ బాండ్‌ల పేరిట డబ్బులు వసూలు చేశారు.

తెలంగాణ సీఐడీ అధికారులు రూ.140 కోట్ల మోసం కేసులో ముద్రా అగ్రికల్చర్ స్కిల్ డెవలప్‌మెంట్ మల్టీ-స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ చైర్మన్ తిప్పెనేని రామదాసప్ప నాయుడు (61)ను అరెస్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకం పేరుతో రైతులు, నిరుద్యోగులను అతడు మోసం చేసినట్టు గుర్తించారు. అతడు దాదాపు 2,000 మందిని మోసగించాడు.
రామదాసప్ప నాయుడును మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతిలో అరెస్ట్ చేశారు. ప్రధాన్ మంత్రి ముద్రా యోజన పథకం పేరుతో ప్రజలను అతడు మోసం చేసినట్టు సీఐడీ తెలిపింది. సొసైటీ సభ్యుడైన అతని కుమారుడు తిప్పెనేని సాయికిరణ్ (43)ను కూడా హైదరాబాద్‌లో అధికారులు అరెస్ట్ చేశారు. ఇద్దరినీ న్యాయమూర్తి ముందు హాజరు పరచి రిమాండ్‌కు పంపారు.
సీఐడీ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు సొసైటీని ప్రభుత్వ అనుమతి పొందిన సంస్థగా చూపించారు. ఉద్యోగాలు, డిపాజిట్లపై అధిక లాభాలు ఇస్తామని చెప్పి ప్రజలను ఆకర్షించారు. సొసైటీను రెండు సంవత్సరాల్లో పూర్తి స్థాయి బ్యాంకుగా మార్చుతామని, సభ్యులను ప్రభుత్వ ఉద్యోగులుగా చేస్తామని ఆశచూపారు. దీంతో కూలీలు, రైతులు, చిన్న వ్యాపారులు తమ పొదుపు డబ్బులను జమ చేశారు.
రాష్ట్రస్థాయి పత్రికల్లో ప్రకటనలు ఇస్తూ 2,000 “గవర్నమెంట్ మార్కెటింగ్ సూపర్వైజర్” పోస్టులు ఉన్నాయని ప్రచారం చేశారు. అభ్యర్థుల నుంచి ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకుని, షేర్ క్యాపిటల్, ఇన్వెస్ట్‌మెంట్ బాండ్‌ల పేరిట డబ్బులు వసూలు చేశారు.
డిపాజిట్లు సేకరించాలని ఉద్యోగులకు టార్గెట్లు ఇచ్చారు. మొత్తం 330 బ్రాంచులు ప్రారంభించి, 1,600 మందిని ఉద్యోగాలలో నియమించారని వెల్లడైంది. సొసైటీలో డిపాజిట్ చేసిన వారికి రిటర్నులు, ఉద్యోగుల నుంచి తీసుకున్న సెక్యూరిటీ డిపాజిట్లు తిరిగి ఇవ్వలేదు.
అంతేగాక, వారిని బెదిరింపులకు గురిచేశారు. దీంతో బాధితులు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. వారి ఫిర్యాదుల ఆధారంగా మొత్తం 10 కేసులు నమోదయ్యాయి. అన్ని కేసులను సీఐడీ దర్యాప్తు చేస్తోంది. నగదు లావాదేవీలు, మిగిలిన నిందితులను గుర్తించడానికి అధికారులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.
ప్రజలు అధిక లాభాల పేరుతో ఆకర్షించే కేటుగాళ్ల వలలో పడకూడదని, నకిలీ పథకాలలో మోసపోకూడదని, ఆర్థిక సంస్థలు ఆర్‌బీఐలో నమోదయ్యాయో లేదో చెక్ చేయాలని సీఐడీ సూచించింది.