చేవెళ్ల నియోజకవర్గంలో ఆసక్తికర పోటీ.. ఎవరిదో పైచేయి?

జాతీయ పార్టీల నుంచి పోటీ చేస్తున్న మాజీ బీఆర్ఎస్ నేతలను ఎదుర్కొనేందుకు గులాబీ పార్టీ మూడోసారి కొత్త అభ్యర్థిని ఎంపిక చేసింది.

చేవెళ్ల నియోజకవర్గంలో ఆసక్తికర పోటీ.. ఎవరిదో పైచేయి?

Chevella Lok Sabha Constituency: చేవెళ్ల రాజకీయాలు ఈసారి ఆసక్తికరంగా మారాయి. అక్కడ పోటీ చేయబోతున్న కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు గతంలో బీఆర్ఎస్ నుంచి గెలిచినవారే. ఈసారి ఆ ఇద్దరు అభ్యర్థులనే ప్రత్యర్థులుగా ఎదుర్కోబోతుంది బీఆర్ఎస్. కాంగ్రెస్, బీజేపీ రెడ్లకు టికెట్లు ఇస్తే.. బీఆర్ఎస్ బీసీని బరిలోకి దించుతోంది.

2014, 19 లోక్‌సభ ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గం నుంచి రెండుసార్లు బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. 2014లో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌పై గెలుపొందారు. 2019లో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన రంజిత్ రెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డిపై విజయం సాధించారు. మారిన రాజకీయ పరిణామాలతో కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలోకి వెళ్లగా, రంజిత్ రెడ్డి లేటెస్ట్‌గా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు ఇద్దరు నేతలు కూడా ఆయా పార్టీల నుంచి అభ్యర్థులుగా రంగంలోకి దిగనున్నారు.

ప్రస్తుతం జాతీయ పార్టీల నుంచి పోటీ చేస్తున్న మాజీ బీఆర్ఎస్ నేతలను ఎదుర్కొనేందుకు గులాబీ పార్టీ మూడోసారి కొత్త అభ్యర్థిని ఎంపిక చేసింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రాజకీయంగా గుర్తింపు ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్‌ను అభ్యర్థిగా ఖరారు చేసింది. బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ బీఆర్ఎస్ నేతలను ఎదుర్కొనేందుకు అనుగుణంగా వ్యూహాలను సిద్ధం చేసే పనిలో పడ్డారు.

బీఆర్ఎస్‌ వ్యూహ రచన రెడీ
జిల్లాకు చెందిన సీనియర్ నేత మాజీమంత్రి సబిత ఇంద్రారెడ్డి నివాసంలో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. గతంలో బీఆర్ఎస్‌ నుంచి గెలిచిన ఆ ఇద్దరు నేతలను ఎదుర్కొనేందుకు వ్యూహ రచన రెడీ చేశారు. ప్రత్యర్థులుగా ఉన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రంజిత్‌రెడ్డిని ఓడించి.. చేవెళ్ల ఎంపీ నియోజకవర్గంలో పార్టీకి ఉన్న పట్టును కొనసాగించాలని భావిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు.

Also Read: ఆఫర్స్‌తో బలమైన నేతలకు గాలం.. తెలంగాణలో వేడెక్కిన రాజకీయం

చేవెళ్ల ఎంపీ నియోజకవర్గ పరిధిలోని.. శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మహాశ్వరం, చేవెళ్ల అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. గ్రామీణ ప్రాంతంలోని వికారాబాద్, తాండూర్, పరిగి నియోజకవర్గాల్లో హస్తం పార్టీ ఎమ్మెల్యేలు గెలుపొందారు. మెజారిటీ ఓటర్లు పట్టణ ప్రాంతంలోనే ఉండటంతో కచ్చితంగా తమకు కలసి వస్తుందని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది.

Also Read: ఎన్నికల వేళ కాంగ్రెస్‌లో పదవుల చిచ్చు.. సీనియర్లు సీరియస్

గతంలో బీఆర్ఎస్ అభ్యర్థులుగా పోటీ చేసిన ఇద్దరు నేతలు ఇప్పుడు ఇతర పార్టీల నుంచి పోటీ చేస్తుండటం బీఆర్ఎస్ కు కాస్త ఇబ్బందికరంగా మారింది. కొంత క్యాడర్, లీడర్లు ఆ నేతలతో వెళ్లిపోయారు. ఇప్పుడున్న సొంత పార్టీ నేతలు సంపూర్ణంగా సహకరిస్తే తప్ప గెలుపు అంత ఈజీ కాదన్న అనుమానాలు కూడా బీఆర్ఎస్ నేతల్లో వ్యక్తం అవుతున్నాయి.