Egg Price Hike
Egg Price Hike : సామాన్యుడికి కోడి గుడ్డు ధరలు షాకిస్తున్నాయి. రోజురోజుకు ధరలు పెరుగుతుండటంతో కోడి గుడ్డు మధ్య తరగతి వర్గాల ప్రజలకు భారంగా మారింది. కొద్ది నెలల క్రితం బహిరంగ మార్కెట్లో కోడి గుడ్డు ధర రూ.5కాగా.. ఇటీవల రూ.6కు పెరిగింది. ప్రస్తుతం ఏకంగా ఒక్క కోడిగుడ్డు ధర రూ.8కి చేరింది.
Also Read : AP Govt : ఏపీ ప్రజలకు మరో శుభవార్త.. ఆ సేవలన్నీ ఇకపై ఉచితంగా.. వెంటనే ఇలా చేయండి..
సామాన్యుడికి పోషకాహారమైన కోడిగుడ్డు ఇప్పుడు పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు భారంగా మారింది. గత కొన్ని నెలలుగా క్రమంగా పెరుగుతూ వచ్చిన గుడ్డు ధరలు ఇప్పుడు ఆకాశాన్ని తాకాయి. పౌల్ట్రీరంగ చరిత్రలోనే ఎన్నడూలేని విధంగా గరిష్ఠ ధరలు నమోదు కావడంతో అటు వినియోగదారులు ఇటు వ్యాపారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ఒక్క కోడిగుడ్డు రికార్డు స్థాయిలో రూ. 8కి చేరింది. ఇక హోల్‌సేల్ మార్కెట్లోనే ఒక్కో గుడ్డు ధర రూ.7.30 పలుకుతుండటం విశేషం. గతంలో ఒక ట్రే (30 గుడ్లు) రూ.160 నుంచి రూ.170 వరకు లభించేవి. కానీ, ప్రస్తుతం అది రూ.210 నుంచి రూ. 220కి చేరింది. కోడిగుడ్డు ధరలు ఈ స్థాయికి చేరుకోవడం ఫౌల్ట్రీ ఇండస్ట్రీ చరిత్రలోనే తొలిసారి అని చెబుతున్నారు. అయితే, ధరలు ఇంతలా పెరగడానికి ప్రధాన కారణం డిమాండ్ కు తగిన ఉత్పత్తి లేకపోవడమే. ఇక నాటు కోడి గుడ్ల విషయానికి వస్తే ఒక్కో గుడ్డు ధర రూ.15 వరకు పలుకుతోంది.
Also Read : Government Employees : ఆఫీసులకు అలా రావొద్దు.. ఉద్యోగులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ
గతంలో తెలుగు రాష్ట్రాల్లో రోజుకు సుమారు 8కోట్ల గుడ్లు ఉత్పత్తి అయ్యేవి. అయితే, కోళ్ల ఫారాల నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడవుతున్న నేపథ్యంలో చాలా మంది ఫౌల్ట్రీ యాజమానులు ఈ రంగానికి దూరమవుతున్నారు. కోళ్లకు పెట్టే దాణా, మక్కలు, సోయా, చేపపొట్టు వంటి ముడిసరుకుల ధరలు విపరీతంగా పెరగడం వల్ల చిన్న, మధ్యతరహా రైతులు కోళ్ల ఫారాలను మూసివేస్తున్న పరిస్థితి. గతంలో కోల్డ్ స్టోరేజీల్లో దాదాపు 20కోట్ల గుడ్లు నిల్వ ఉండేవని, ప్రస్తుతం ఆ నిల్వలు పూర్తిగా తగ్గిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరికొద్దిరోజులు కోడిగుడ్డు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు పేర్కొంటున్నారు. కోళ్ల దాణాపై సబ్సిడీ ఇవ్వడం లేదా ఉత్పత్తిని పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే తప్ప ధరలు అదుపులోకి వచ్చే సూచనలు కనిపించడం లేదు.