Cm Revanth Reddy: జూబ్లీహిల్స్ బైపోల్ లో కాంగ్రెస్ ఘన విజయంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. జూబ్లీహిల్స్ లో గెలుపు మా బాధ్యతను మరింత పెంచిందని ఆయన అన్నారు. జూబ్లీహిల్స్ లో విజయం అందించిన ప్రజలకు సీఎం రేవంత్ ధన్యవాదాలు తెలిపారు. జూబ్లీహిల్స్ లో గెలుపు కోసం కృషి చేసిన అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ లో కాంగ్రెస్ కు సరైన ఫలితాలు రాలేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత హైదరాబాద్ ప్రజల్లో కాంగ్రెస్ పై నమ్మకం పెరుగుతోందన్నారు. గెలుపుతో పొంగిపోవడం, ఓటమితో కుంగిపోవడం కాంగ్రెస్ కు తెలియదన్నారు. ప్రతిపక్షంలో ఉంటే ప్రజల పక్షాన పోరాటం చేయడం, అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమమే కాంగ్రెస్ పని తీరు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికతో కాంగ్రెస్ ను ప్రజలు ఆశీర్వదించారని ఆయన వ్యాఖ్యానించారు.
”ప్రజల తరపున నిలబడటం, పోరాడటమే కాంగ్రెస్ కర్తవ్యం. రెండేళ్ల పాలనను ప్రజలు నిశితంగా పరిశీలించి తీర్పు ఇచ్చారు. రాష్ట్ర ఆదాయంలో 65శాతం వరకు జంట నగరాల నుంచే వస్తోంది. ఈ నగరాల ఆదాయాన్నే రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు వాడుతున్నాం. హైదరాబాద్ నగరానికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా మరింత అభివృద్ధి చేస్తాం. 2023 ఎలక్షన్ తర్వాత నుంచి ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఓట్ల శాతం పెరుగుతోంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో విజయంతో కాంగ్రెస్ కు బలం పెరిగింది.
ప్రతిపక్ష నాయకులు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. హరీశ్ రావు అసూయ, కేటీఆర్ అహంకారం తగ్గించుకోవాలి. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. హరీశ్ రావు, కేటీఆర్.. మరో రెండేళ్లు ఓపిక పట్టండి. ప్రజా ఉద్యమాలు చేయండి, నిరసనలు తెలపండి. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నేతలు ఫేక్ ప్రచారాలు చేశారు. ప్రభుత్వంపై విష ప్రచారం చేశారు. డబ్బులు పెట్టి ఫేక్ సర్వేలు చేయించారు. కబ్జాల నుంచి ప్రభుత్వ భూమిని కాపాడేందుకు హైడ్రాను తీసుకొస్తే దానిపై దుష్ప్రచారం చేశారు.
కేంద్రం నుంచి నిధులు రాకుండా కిషన్ రెడ్డి సహాయ నిరాకరణ చేస్తున్నారు. అనేక ప్రాజెక్టులకు అనుమతులు రాకుండా అడ్డుకుంటున్నారు. మెట్రో, మూసీ ప్రక్షాళన వంటి వాటికి అనుమతులు అడ్డుకుంటున్నారు. కిషన్ రెడ్డి ఎంపీ నియోజకవర్గంలోనే బీజేపీకి బాగా ఓట్లు తగ్గాయి” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
”కాంగ్రెస్ కు అండగా ప్రజలు నిలబడ్డారు. కాంగ్రెస్ ను ఆశీర్వదించి.. సంక్షేమం, అభివృద్ధిని చేయాలని సందేశం ఇచ్చారు. పోలైన ఓట్లలో 51 శాతం కాంగ్రెస్ కు వేశారు. 38 శాతం బీఆర్ఎస్ కు, 8 శాతం బీజేపీకి ఓట్లేశారు. ప్రజా తీర్పును మేము బాధ్యతగా తీసుకుంటాం. హైదరాబాద్ నుండి వస్తున్న ఆదాయాన్ని రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగిస్తున్నాం. అధికార, ప్రతిపక్షాల పాత్రపై ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. దీన్ని ప్రతిపక్షాలు గుర్తించి గౌరవించాలి. RRR, మెట్రో విస్తరణ, రేడియల్ రోడ్లు, ఫ్లై ఓవర్లు, చెత్త సమస్య, చెరువుల రక్షణ, మూసీ అభివృద్ధి కి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశాం. సోషల్ మీడియా ద్వారా దూషిస్తూ, అవహేళన చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. అభివృద్ధికి బీఆర్ఎస్ అడ్డుపడుతోంది.
మెట్రో, RRR, గోదావరి నీళ్లు, పెట్టుబడులు, మూసీ అభివృద్ధికి నిధులు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు. జూబ్లీహిల్స్ లో బీజేపీకి డిపాజిట్ పోయింది. కిషన్ రెడ్డి ఇప్పటికైనా గుర్తుంచుకోవాలి. లేదంటే కాలగర్భంలో కలిసిపోతారు. ఇది భూకంపానికి ముందు వచ్చిన చిన్న ప్రకంపన.. కిషన్ రెడ్డి గుర్తించాలి. మహా నగర అభివృద్ధికి కిషన్ రెడ్డి సహకరించాలి. సచివాలయానికి రావాలని కిషన్ రెడ్డిని ఆహ్వానిస్తున్నా. రాష్ట్ర ప్రయోజనాలు, రావాల్సిన వాటి కోసం కేంద్రంలో కిషన్ రెడ్డి సహకరించాలి. బండి సంజయ్, కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ ఎంపీలు సహకరించాలి. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడొద్దు. ప్రతిపక్షాలు సంయమనం పాటించాలి. రెండేళ్లు ఓపిక పట్టండి. మూడో ఏట నుంచి రాజకీయం చేద్దాం. ఫేక్ న్యూస్, సర్వేల పేరుతో.. బురద జల్లారు.. ఇప్పుడు నిజాలు తెలిశాయిగా” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
Also Read: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఘన విజయం.. కేటీఆర్ కీలక కామెంట్స్..