CM Revanth Reddy : పెత్తనం నాదే కానీ.. తాళం చెవి భట్టి దగ్గరే వుంది : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : తెలంగాణ ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..  ఆదాయం తగ్గినా ఇవ్వాల్సిన నిధులను మాత్రం ఆపలేదన్నారు. సీఎం అయినా తాను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కకు చెప్పాల్సిందేనని అన్నారు.

CM Revanth Reddy

CM Revanth Reddy : ‘పెత్తనం నాదే కానీ.. తాళం చెవి భట్టి దగ్గరే ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ..  ఆదాయం తగ్గినా ఇవ్వాల్సిన నిధులను మాత్రం ఆపలేదన్నారు. ఉద్యోగాలకు సంబంధించి 2015లోని బకాయిలను పెండింగ్ లో ఉన్నప్పటికీ వాటిని నూటికి నూరుశాతం విడుదల చేయనున్నట్టు చెప్పారు. సీఎం అయినా తాను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కకి చెప్పాల్సిందేనని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికుల పాత్ర మరువలేనిదని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేసుకున్నారు.

సకల జనుల సమ్మెలో రాష్ట్ర వ్యాప్తంగా రవాణాను స్తంభింపజేసి రాష్ట్ర సాధన పోరాటానికి ఆర్టీసీ కార్మికులు సహకరించారని చెప్పారు. తెలంగాణ వస్తే దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయని కార్మికులు భావించారని, కానీ, 90రోజులు సమ్మె చేసినా ఆనాటి ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరించలేదన్నారు.

ఆర్టీసీ కార్మికులదే ఘనత :
36 మంది కార్మికులు మరణించినా వారి కుటుంబాల గురించి ఆనాటి ప్రభుత్వం ఆలోచించలేదని ఆయన విమర్శించారు. ఇప్పుడు, ఈ ప్రజా ప్రభుత్వం ఏర్పడటంలో ఆర్టీసీ కార్మికులు ముఖ్య పాత్ర పోషించారని అభినందించారు. ఆరు గ్యారంటీలలో మొట్టమొదటి హామీని అమలు చేసిన ఘనత ఆర్టీసీ కార్మికులదని సీఎం రేవంత్ చెప్పారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మొట్టమొదటి బడ్జెట్ అని, రూ.2,75,891 కోట్ల వాస్తవిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టినట్టు ఆయన స్పష్టం చేశారు. వాస్తవాల ప్రాతిపదికన బడ్జెట్‌ను రూపొందించామని చెప్పారు. గత ప్రభుత్వంలా కాగితాల్లో చూపించి అబద్దాలు చెప్పదలచుకోలేదన్నారు. రాష్ట్ర ప్రజలు వాస్తవిక బడ్జెట్‌ను అర్ధం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వానికి ఆదాయం తగ్గినా ఆర్టీసీకి రూ.281 కోట్ల నిధులను విడుదల చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పథకం ఆర్టీసీ బలోపేతానికి ఉపయోగపడిందన్నారు. రాష్ట్ర ప్రజల ఆశీర్వాదం వల్లే ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ప్రజల ఆశీర్వాదం ఉండాలని సీఎం రేవంత్ ఆకాంక్షించారు. దేశంలోనే తెలంగాణ మోడల్ పాలనపై చర్చ జరిగేలా పరిపాలన అందిస్తామని హామీ ఇచ్చారు.

అందుకే ఇటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టాం: మీడియాతో రేవంత్ రెడ్డి :
అంతకుముందు.. తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్‌లో పాల్గొన్నారు. అబద్ధాల ప్రాతిపదికన బడ్జెట్ పెట్టదలచుకోలేదని తెలిపారు. తమ ప్రభుత్వం వాస్తవాలకు దగ్గరగా బడ్జెట్ ప్రవేశపెట్టిందని చెప్పారు. కమీషన్ల కోసం టెండర్లు పిలిస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని పరిస్థితులే రిపీట్ అవుతాయని తెలిపారు.

రుణమాఫీ అమలు చేస్తామన్నారు. మేడిగడ్డకు వెళ్దామని సభ్యులందరినీ ఆహ్వానించామని చెప్పారు. ఈ నెల 13న బీఆర్ఎస్ వాళ్లకి సమావేశం ఉంటే వేరే తేదీ చెప్పినా తాము ఆలోచిస్తామన్నారు. ఒకరోజు ముందు/వెనకా అయినా వెళ్లడానికి రెడీనని తెలిపారు. ఇరిగేషన్ కు16 వేల కోట్ల రూపాయల మిత్తి కట్టాల్సి వస్తుందని తెలిపారు.

ఇది గత సర్కార్ పాపం అని చెప్పారు. మహిళల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చామని అన్నారు. బీఆర్ఎస్ కార్ల డీల్ పై అధికారిక విచారణ కొనసాగుతోందని తెలిపారు. బీఏసీకి పార్టీ పేరు ఇచ్చిన వారే రావాలని, అది రూల్ అని చెప్పారు. తనను కలిస్తేనే బీఆర్ఎస్ వారి ఎమ్మెల్యేలను అనుమానిస్తోందని తెలిపారు. రాజ్యసభ ఎన్నికల్లో ఎంత మంది బరిలో ఉంటారో పార్టీ నిర్ణయిస్తుందని చెప్పారు.

తెలంగాణను అబద్ధాల పునాదుల మీద గత ప్రభుత్వం నడిపిందని రేవంత్ రెడ్డి అన్నారు. సచివాలయం భవనం, అంబేద్కర్ విగ్రహం, అమర జ్యోతి నిర్మాణాలపై విచారణ చేస్తామని తెలిపారు. పది పైసలతో అయ్యేది పది రూపాయలు ఖర్చుపెడితే అద్భతం అవుతుందా అని నిలదీశారు.

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇస్తామంటే కుటుంబ సభ్యులే వద్దన్నారు.. లక్ష్మీపార్వతి కీలక వ్యాఖ్యలు

ట్రెండింగ్ వార్తలు