ఎన్టీఆర్‌కు భారతరత్న ఇస్తామంటే కుటుంబ సభ్యులే వద్దన్నారు.. లక్ష్మీపార్వతి కీలక వ్యాఖ్యలు

కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్‌కు భారతరత్న ఇస్తామంటే కుటుంబ సభ్యులే వద్దన్నారని ఆంధ్రప్రదేశ్ తెలుగు, సంస్కృత అకాడమి చైర్‌ప‌ర్స‌న్‌ లక్ష్మీపార్వతి ఆరోపించారు.

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇస్తామంటే కుటుంబ సభ్యులే వద్దన్నారు.. లక్ష్మీపార్వతి కీలక వ్యాఖ్యలు

ntr family members rejected bharat ratna says lakshmi parvathi

Updated On : February 10, 2024 / 1:03 PM IST

Lakshmi Parvathi: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇస్తామంటే ఆయన కుటుంబ సభ్యులే అడ్డుకున్నారని ఆంధ్రప్రదేశ్ తెలుగు, సంస్కృత అకాడమి చైర్‌ప‌ర్స‌న్‌ లక్ష్మీపార్వతి ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుంటూరులో శనివారం జరిగిన జగన్ పాలన-టీచర్ల స్పందన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం స్వర్గీయ ఎన్టీఆర్‌కు భారతరత్న అవార్డు ఇస్తామంటే ఆయన కుటుంబ సభ్యులు వద్దన్నారని తెలిపారు. ఒకవేళ ఎన్టీఆర్‌కు భారతరత్న వస్తే ఆయన భార్యగా తాను అవార్డు అందుకుంటాననే ఉద్దేశంతోనే తిరస్కరించారని వివరించారు. చంద్రబాబు సారథ్యంలో ఎన్టీఆర్ పరువును ఆయన కుటుంబ సభ్యులు బజారుపాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

కేసుల మాఫీ కోసమే ఢిల్లీకి చంద్రబాబు
చంద్రబాబు తన కేసుల మాఫీ కోసమే ఢిల్లీకి వెళ్లారని లక్ష్మీపార్వతి ఆరోపించారు. కేసుల భయంతో బీజేపీతో పొత్తుకు పాకులాడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీని బీజేపీ, పవన్ కళ్యాణ్, కమ్యూనిస్టుల కాళ్ళదగ్గర తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. అధికార వ్యామోహంతో మరోసారి ముఖ్యమంత్రి కావాలని చంద్రబాబు కలలు కంటున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబుకు పార్టీని తాకట్టు పెడుతున్నాడనే పవన్ కళ్యాణ్‌కు కాపులు దూరమయ్యారని అన్నారు.

”పవన్ కళ్యాణ్‌ది బానిస బ్రతుకు. అందుకే కాపులు అసహ్యించుకుంటూ రివర్స్ అయ్యారు. మూడు కాదు ముప్పై పార్టీలు కలిసి వచ్చినా జగన్ మోహన్ రెడ్డిని ఏమీ చేయలేవు. వైయస్సార్ హయాంలో మహాకూటమిలో 10 పార్టీలు ఉన్నా ఏమీచేయలేక పోయాయి. చంద్రబాబుకు స్వయం ప్రకాశం లేదు, ఎప్పుడూ ఎవరో ఒకరి మద్దతు కావాల్సిందేన”ని లక్ష్మీపార్వతి అన్నారు. కాగా, ఢిల్లీలో అసలు చంద్రబాబు అమిత్ షాను కలవలేదని.. కలిస్తే ఫొటో బయటపెట్టాలని లక్ష్మీపార్వతి నిన్న డిమాండ్ చేశారు.

Also Read: చంద్రబాబు, జగన్ ఢిల్లీ పర్యటనల వెనుకున్న మర్మం ఏంటి? ప్రధాని మోదీతో ఏం చర్చించారు?